Take a fresh look at your lifestyle.

ప్రజాచైతన్యమే కోవిద్ కట్టడికి మార్గం

“కోవిద్ వైరస్ బారినుంచి కోలుకున్నవారిని తిరిగి వాలంటీర్లుగా క్వారంటైన్ సెంటర్లలో ఉపయోగించుకోవటం వల్ల వీరి అనుభవం పేషంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. వీరిని కోవిద్ యుద్ధవీరులుగా గుర్తించి వారి అనుభవాలను ప్రధాన స్రవంతి మీడియాలో, టీవీల్లో చెప్పించడం ద్వారా వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా కోలుకుంటామనే అవగాహన ప్రజల్లో పెరుగుతుంది. ప్రజల్లో సినిమా హీరోలకు ఎంతో ఆదరణ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తెలుగు సినీరంగ హీరోలు ప్రజలకు ఈ అవగాహన కల్పించే కార్యక్రమంలోకి స్వచ్ఛందంగా రావాలి. “చేతులు కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి” అని చెప్పటం కోసం కాదు.  తెరమీద కనిపించే ఈ హీరోలు కోవిద్ హీరో/ హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసి వైరస్ మీద వారి పోరాట అనుభవాన్ని ప్రజల ముందుకి తీసుకురావాలి. మరి ఈ రకమైన హీరోయిజం చూపించే ఛాలెంజ్‌కి మన తెలుగు సినీ హీరోలు ముందుకి రాగలుగుతారా?”

k sajayaకోవిద్ వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్ డౌన్ పెడతారేమో అనే వార్త విస్తృతంగా చలామణిలో వుంది. అయితే, మూడునెలల లాక్ డౌన్ కూడా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోవటాన్ని గుర్తించినపుడు, పరిష్కారాన్ని మళ్లీ నిర్బంధం వైపుకు తీసుకువెళ్లటం వల్ల గొప్ప ఫలితాలు ఏమీ రాకపోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ సమస్యలను గుర్తించి కార్యాచరణ ఆ వైపుగా తీసుకెళ్లగలిగితే మన ముంగిటిలో వున్న ప్రమాదానికి అడ్డుకట్ట వేయగలుగుతాము. కోవిద్ వైరస్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో మనకు ఇప్పుడు కావలసింది భరోసా నిచ్చే అనుభవాలు, భయపెట్టే కథనాలు కాదు. మరణాల సంఖ్యనే కాదు, వైరస్ వ్యాప్తిని ఎలా తగ్గించగలుగుతామనేది ప్రభుత్వం ముందూ, ప్రజల ముందూ వున్న సవాలు కూడా! ఇప్పుడు కావలసింది అందరం కలిసి ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోగలుగుతామనే దాని మీద ఏకాభిప్రాయం. “మాకెవ్వరూ చెప్పనవసరం లేదు” అనే అహంకార ధోరణి పరిస్థితులను మరింత విషమింపచేస్తాయి తప్పించి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇప్పుడు ఈ అంశం కేవలం ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదు. ప్రజా సమూహాలుగా, ప్రతిపక్ష రాజకీయ పార్టీలుగా, మీడియా, సమాచార వ్యవస్థగా  ప్రతి ఒక్కరూ ఆలోచించి పనిచేయవలసిన అంశం. తెలిసో తెలియకో అవగాహన వైపుగా కన్నా మరింత భయం కలిగించే విధంగానే సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది మారాల్సిన అవసరం వుంది.
ముందుగా “పాండమిక్” (విస్తృత సమూహ వ్యాప్తి) పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన కార్యరంగంలోకి దిగాలి. ఒక్కోసారి తక్షణం స్పందించినప్పటికీ పరిస్థితులు చేజారిపోయే అవకాశం వుంటుంది. కోవిద్ విషయంలో పాశ్చాత్య దేశాల చేదు అనుభవాలు మనముందు వున్నాయి. నిజానికి మన దేశం కంటే ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థల పరిస్థితి, అవగాహన ఎక్కువే అయినప్పటికీ, కోవిద్‌ని ప్రభుత్వాలూ, ప్రజా సమూహాలూ సరిగ్గా అంచనా వేయకపోవటం వల్ల అక్కడ మరణాల సంఖ్య పెరుగుతూ పోయింది. అసలు ప్రజారోగ్యం పట్ల పట్టింపు లేని మన ప్రభుత్వాల చేతిలో పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో మనకు కూడా అర్థమవుతోంది. ప్రజారోగ్యం పట్ల పట్టింపు కేవలం ప్రభుత్వాలకే కాదు, రాజకీయ పార్టీల, ప్రజల ఆలోచనల్లో కూడా లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను వివిధ చర్యల ద్వారా బలోపేతం చేయాలనేదానికన్నా కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం చేయిస్తే చాలని డిమాండ్ వస్తుంది.
మూడున్నర నెలల అనుభవం తర్వాత ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అనేక అంశాల్లో దృష్టి సారించవలసిన అంశాలు వున్నాయి. మొత్తం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని గమనిస్తే హైదరాబాద్ మహానగరంలో దీని వ్యాప్తి ఉధృతంగా వుందని అర్థమవుతోంది. దీనికి దారితీస్తున్న కారణాల పట్ల దృష్టి సారించాలి. ప్రజలు కూడా అనేక అంశాల పట్ల జాగరూకతతో వుండాలి. తమ వ్యక్తిగత స్థాయిలో తీసుకోగలిగిన జాగ్రత్తలను తీసుకోవాలి. నిజానికి, సమూహంగా చేసే ఏ కార్యక్రమాలనైనా సరే ఆపడం అనేది జరగకపోతే వైరస్ ఉధృతి ఆగదు. వర్షాకాలం మొదలవటం ఒక అంశం అయితే, ఈ కాలంలో సాంస్కృతికంగా జరిపే కొన్ని ఆచారాలను ఆపకపోవటం మరో అంశం. మతంతో సంబంధం లేకుండా అందరూ ప్రార్ధనా స్థలాలకు గుంపులుగా వెళ్తూనే వున్నారు. మొక్కుల పేర్లతో గుంపులు గుంపులుగా జమ అవుతూనే వున్నారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు యధావిధిగా వందలాదిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోతున్నాయి. ఫంక్షన్ హాళ్ళలో జరగకపోవచ్చు, ఇళ్లలోనే ఈ వ్యవహారం నడుస్తోంది. మద్యం లాంటి దుకాణాల్లో, హోటళ్లలో గుంపులుగా జనం గుమిగూడుతున్నారు.  మృగశిర పేరుతో చేపల మార్కెట్లలో జనం ఎగబడుతూనే వున్నారు. చనిపోయినవారి అంత్యక్రియలకు గుంపులుగా వెళుతూనే వున్నారు. బాధాకరమైన విషయమైనప్పటికీ, అంత్యక్రియలకు కూడా తక్కువమంది మాత్రమే వెళ్ళాలనే నిబంధనను ఎవరికివారు పాటించకపోతే, దానివలన వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుంది. అనేక అనుభవాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. స్వరాష్ట్రాలకు ఇంకా వెళుతున్న కార్మికులకు భౌతికదూరం పాటించే అవకాశం వుండకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ, పైన ప్రస్తావించిన అంశాలు వాయిదా వెయ్యగలిగి కూడా నిర్లక్ష్యంతో చేస్తున్న అంశాలుగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాధినేతలే యజ్ఞాలు, ప్రారంభోత్సవాల పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నపుడు ప్రజలు మాత్రం ఎందుకు ఆగుతారు! ఎవరు ఏ కారణాల చేత చేసినా గానీ జరుగుతున్నది మాత్రం చేజేతులా మనం ఆహ్వానిస్తున్న దురదృష్టమే! ఈరోజు కొంతమంది కుటుంబాలు మరణాల బారిన పడితే రేపు అది మన కుటుంబమే కావొచ్చు. దీనిని గమనంలోకి తీసుకుంటే ప్రభుత్వాలుగా, ప్రజలుగా నిర్దిష్టంగా తీసుకోవలసిన చర్యల మీద దృష్టి సారించగలుగుతారు. విస్తృతంగా టెస్టులు చేయటం ఎంత అవసరమో, వాటికి తగ్గట్టుగా వ్యవస్థలను ఏర్పరచడం కూడా అంతే అవసరం.
ప్రభుత్వం తక్షణం పూనుకుని ఆరోగ్య వ్యవస్థలో సహాయం చేయగలిగిన ప్రభుత్వేతర సంస్థలను కార్యాచరణలోకి ఆహ్వానించాలి. నిజానికి ఆరోగ్యం మీద పనిచేస్తున్న సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి సేవలను ఇంతవరకూ ఉపయోగించుకోలేదు. అవసరమైన మద్దతులను కల్పించి, నిబంధనలను రూపొందించి వాటి కనుగుణంగా ప్రభుత్వ- ప్రభుత్వేతర భాగస్వామ్యాన్ని రూపొందించాలి. ఈ విధమైన చర్యలను తీసుకోవటం ద్వారా ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్స్ కూడా ఇష్టం వచ్చినట్లు ఫీజులను వసూలు చేయకుండా అరికట్టగలుగుతారు.
వైరస్ ఉధృతి ఎక్కువగా వున్న ప్రాంతాలలో ప్రజల భాగస్వామ్యంతో స్థానిక మొహల్లా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుచేయాలి. అందులో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ రెవిన్యూ, పోలీసు అధికారులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ వైద్యసిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది కలిసి పనిచేసే విధంగా వుండాలి. ఇళ్ళల్లో భౌతిక దూరం పాటించలేని కుటుంబాలకు షెల్టర్ ఇచ్చేలా ఈ సెంటర్లు పనిచేయాలి. ఉన్నత, మధ్యతరగతి వర్గాలు నివసించే అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా స్థానికంగా వాళ్లే  క్వారంటైన్ సెంటర్లను నిర్వహించుకునేలా నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వాలి. వైరస్ బాధితులకు అవసరమైన శారీరిక మానసిక స్థయిర్యం అందించడం కోసం కౌన్సిలింగ్ వ్యవస్థను రూపొంచుకోవాలి. హెల్ప్ లైన్ ద్వారా బాధితులకు భరోసా కల్పించవచ్చు. ఇప్పటికే  104 హెల్ప్ లైన్ నడుస్తుంటే అందులో జరుగుతున్న పొరపాట్లను సవరించి దాన్ని ప్రజలకు మరింత చేరువగా వెళ్ళేలా మార్పు తీసుకోవాల్సి వుంటుంది. ఇప్పటివరకూ బాధితుల నుంచీ వస్తున్న ఫిర్యాదు అదే, హెల్ప్ లైన్ నుంచీ సరైన సమాచారం రావటం లేదనే!
కోవిద్ చికిత్స అందిస్తున్న హాస్పిటళ్ళలో తక్షణం హెల్ప్ డెస్క్ లను రూపొందించాలి. అక్కడికి వచ్చే పేషంట్ బంధువులకు సమాచారం అందించే వ్యవస్థగా ఈ హెల్ప్ డెస్క్ పనిచేయాలి. వైద్య విద్యార్ధులకు ఈ బాధ్యత ఇవ్వాలి. దీనితో పాటు నర్సింగ్, పారా మెడికల్, వైద్య విద్యార్థులను సీనియర్ డాక్టర్లతో పాటు కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్లకు అనుసంధానం చేయటం ద్వారా వైద్యపరమైన సమాచారం తొందరగా ప్రజల్లోకి వెళుతుంది. భయం స్థానంలో ప్రజలకు వైరస్ ని జయించగలుగుతాము అనే ధైర్యం వస్తుంది.
కోవిద్ వైరస్ బారినుంచి కోలుకున్నవారిని తిరిగి వాలంటీర్లుగా క్వారంటైన్ సెంటర్లలో ఉపయోగించుకోవటం వల్ల వీరి అనుభవం పేషంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. వీరిని కోవిద్ యుద్ధవీరులుగా గుర్తించి వారి అనుభవాలను ప్రధాన స్రవంతి మీడియాలో, టీవీల్లో చెప్పించడం ద్వారా వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు, తప్పకుండా కోలుకుంటామనే అవగాహన ప్రజల్లో పెరుగుతుంది. ప్రజల్లో సినిమా హీరోలకు ఎంతో ఆదరణ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తెలుగు సినీరంగ హీరోలు ప్రజలకు ఈ అవగాహన కల్పించే కార్యక్రమంలోకి స్వచ్ఛందంగా రావాలి. “చేతులు కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి” అని చెప్పటం కోసం కాదు.  తెరమీద కనిపించే ఈ హీరోలు కోవిద్ హీరో/ హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసి వైరస్ మీద వారి పోరాట అనుభవాన్ని ప్రజల ముందుకి తీసుకురావాలి. మరి ఈ రకమైన హీరోయిజం చూపించే ఛాలెంజ్‌కి మన తెలుగు సినీ హీరోలు ముందుకి రాగలుగుతారా?
ప్రజల నుంచీ రావలసిన మరో ముఖ్యమైన కార్యాచరణ, కోవిద్ బాధితులుగా వున్నవారికి తక్షణం వివిధ రకాలుగా మద్దతుని అందించడం. భౌతిక పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పేషంట్లకు అవసరమైన వస్తువులను అందించడానికి, వాలంటీర్లుగా పనిచేయడానికి యువతరం ముందుకు రావాలి. వైరస్ అదుపు కోసం చేయాల్సింది మద్దతు వ్యవస్థలను ఎక్కడికక్కడ ఏర్పాటు అయ్యేలా చూడటం. నిరంతరం పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక వనరులు. ఇంకా పెంచుకోవాల్సిన అపరిమితమైన మానవ వనరులు. వాటి ఏర్పాటుకు ప్రభుత్వాల మీద తీసుకు రావాల్సిన వొత్తిడి. అంతే గానీ, చప్పట్లు, బాజాలూ, దీపాలూ, పూలు జల్లటం కాదని ప్రజలకు ఈపాటికి అర్థమయ్యే వుంటుంది.

Leave a Reply