బయటకొచ్చి ఫోజులు..!
కమీషన్ల కోసమే సిఎం కేసీఆర్ బ్రోకర్ పాత్ర
కుటుంబం ఇంకెన్నాళ్లు రాజ్యమేలాలి?
వారు చేసిన త్యాగాలేమిటో చెప్పాలి?
టిఆర్‌ఎస్‌ను గద్దెదించే వరకు విశ్రమించను
రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సిద్ధిపేట జిల్లాలోకి ప్రజా సంగ్రామ యాత్ర
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసిందని రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతుందనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్డున పడేసిన కేసీఆర్ కుటుంబంలో మాత్రం 5గురికి కొలువులిచ్చుకున్నారనీ మండిపడ్డారు. బిజెపి చీఫ్ బండి తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర మంగళవారం సిద్ధిపేట జిల్లాలోని బెజ్జంకి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా బెజ్జంకి సభలో బండి మాట్లాడుతూ..ఇంకెన్నాళ్లు కేసీఆర్ కుటుంబ పాలనను భరించాలి? టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించబోమన్నారు. టిఆర్‌ఎస్‌కు బండి బ్రాండ్ అంబాసిడర్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ…టిఆర్‌ఎస్‌ను గద్దెదించే విషయంలో నేనే ముమ్మాటికీ బ్రాండ్ అంబాసిడర్‌ను అని అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో నష్టపోతున్న రైతాంగ, నిరుద్యోగ, అణగారిన ప్రజల పక్షాన పోరాడే విషయంలో నేను తప్పకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాననీ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు ఏకపక్షమేననీ చెప్పిన బండి..టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి అక్కడ డిపాజిట్ కోసం కొట్లాడాల్సిందేననీ అన్నారు. మొన్నటి వరకు తెలంగాణలో పండించిన ప్రతి చివరి గింజ వరకు కొంటాననీ చెప్పిన కేంద్రంతో పని లేదని చెప్పారనీ, ఇప్పుడు మాట తప్పిండన్నారు.
అసలు బియ్యానికి, రైతుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. వడ్లు పండిస్తరు, అమ్ముతారు. వడ్లు మొత్తం కొనేది కేంద్రమే. అసలు ఈ విషయంలో కేసీఆర్‌కు సంబంధమేముంది? మిల్లర్ల దగ్గర కమీషన్ల కోసమే బ్రోకర్ పాత్ర పోషిస్తున్నాడనీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పండే పంటను ఏ విధంగా ఎగుమతి చేయాలి? మార్కెటింగ్ చేయాలనే అంశంపై అన్ని రాష్ట్రాల సిఎంలతో కేంద్రం మీటింగ్ పెడితే తెలంగాణ సిఎం కేసీఆర్ తప్ప మిగతా రాష్ట్రాల సిఎంలందరూ హాజరయ్యారన్నారు. సిఎం కేసీఆర్ వెళితే రాష్ట్రంలో పండించిన పంటనంతా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండేదన్నారు. సిఎం కేసీఆర్‌కు ఢిల్లీ వెళ్లి చేసేదేమీ లేదనీ, ప్రధానమంత్రి మోదీ వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెడుతడు. బయటకొచ్చి ఫోజులు కొడుతుండన్నారు. పేదలకు ఆపదొస్తే కనీసం పరామర్శించిన నేత కేసీఆర్ అని, గట్టిగా వర్షం వస్తే సిరిసిల్ల మునిగిపోతుందనీ, అయినా కొడుకు(మంత్రి కేటీఆర్)రాడు, తండ్రి రాడన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ డిపాజిల్ కోసం వెంపర్లాడాల్సిందేననీ, బిజెపి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
హుజూరాబాద్‌లో దళితబంధు ఇస్తానన్న సిఎం కేసీఆర్ మానుకొండూర్ ఎస్సీ నియోజకవర్గంలో ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ మెడలు వంచేందుకు బిజెపి ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తుందనీ, టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించి పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పాదయాత్ర కొనసాగుతుందనీ బండి అన్నారు. బిజెపి కిసాన్‌మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపి రాజ్‌కుమార్ మాట్లాడుతూ..బండి చేస్తున్న ప్రజాసంగ్రామ పాదయాత్రను దేశం మొత్తం చూస్తుందనీ, దేశం ప్రధానమంత్రి మోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో రైతులకు అందకుండా టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. సిఎం కేసీఆర్ మాత్రం ప్రజలను రెచ్చగొట్టేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనీ…ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెడుతాడన్నాడు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందనీ బండి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి బిజెపిని అధికారంలోకి తేవడం ఖాయమనీ రాజ్‌కుమార్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు సోయం బాబూరావు, ప్రేమేందర్‌రెడ్డి, బొడిగె శోభ, సురేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఆలే భాస్కర్, రాకేష్‌రెడ్డి, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి, తొడుపునురి వెంకటేశం, ఉడుత మల్లేశం, గంగాడి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.