Take a fresh look at your lifestyle.

రెచ్చగొట్టే ప్రకటనలు వాంఛనీయం కాదు

లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా ఇప్పుడు అప్రకటిత యుద్దం చేస్తున్నది . చైనా సేనల చొరబాట్లను మన సేనలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. అటూ, ఇటూ కూడా రెచ్చగొట్టే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. ఈ సమయం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేని దేశాల కోసం కేటాయించిన స్థానానికి భారత్ వరుసగా రెండో సారి ఎన్నికైంది. ఇది చైనాకు కంటగింపు వంటిదే. అయితే, దీనిని ఒక విజయంగా కాకుండా, అందివచ్చిన అవకాశంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావిస్తున్నారు. ప్రధానమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చైనాలో అత్యధికంగా తొమ్మిది సార్లు పర్యటించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో పలు సార్లు ముఖాముఖీ చర్చలు జరిపారు. అందువల్ల చైనా ధోరణిపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా యుద్ధానికి తలపడబోదని మోడీ భావిస్తున్నారు. అయితే, స్వీయ రక్షణ కోసం భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నది ఆయన అభిమతం. అందుకే, భవిష్యత్ కార్యాచరణ కోసం అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ తాత్కాలిక సభ్యత్వ పదవికి అత్యధిక వోట్లతో విజయం సాధించిన సందర్భంలో ఆయన భారత్ తరతరాలుగా శాంతిని కోరుకుంటుందనీ, వసుధైక కుటుంబం స్ఫూర్తితో విశ్వశాంతి కోసం కృషి చేస్తుందంటూ పరోక్షంగా అలనాడు చికాగో సమావేశంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రస్తావించారు.అయితే, శత్రుదేశంగా వ్యవహరిస్తున్న పొరుగు దేశం దూసుకొస్తున్న వేళ శాంతి మంత్రాలు పఠించడం ఎంతవరకూ సమంజసమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తొందరపడటం వల్ల అనేక అనర్ధాలున్నాయి. మూడేళ్ళ క్రితం సిక్కిం సరిహద్దులలో డోక్లాంలో ఇంతకన్నా ఎక్కువగా సేనలను చైనా మోహరించింది.అయితే,అప్పుడు ఇరుదేశాల మధ్య బాహాబాహీగా కాల్పులు జరగలేదు, ప్రాణనష్టం సంభవించలేదు. అప్పట్లో ఉద్రిక్తత మాత్రం రెండు నెలలు పైగా కొనసాగింది. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దౌత్య కౌశలంతో ఉద్రిక్తత తగ్గించడం కోసం చైనాకు సన్నిహితంగా ఉన్న నేపాల్, తదితర దేశాలతో సంప్రదింపులు జరిపి, చర్చల వేదికపైకి చైనా ప్రతినిధులు వొచ్చేట్టు చేశారు. ఆమె నెరపిన దౌత్యం కారణంగానే డోక్లాం ఉద్రిక్తత చల్ల బడింది. ఈసారి అలాంటి ప్రయత్నాలు జరగలేదు.అయితే, పరిస్థితిలు భిన్నమైనవి కావడమే కారణం. అప్పట్లో చైనాయే సేనలను మోహరించింది. డోక్లాం మీదుగా భూటాన్, భారత్ సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చే రీతిలో రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నించింది.

చైనా తలపెట్టిన మహామార్గం లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభించింది.ఇప్పుడు మన దేశం కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గం కోసం భారత సరిహద్దులలో తన భూభాగాల్లోనే రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీని వల్ల మానస సరోవర్ యాత్ర ప్రయాణం సులభం అవుతుంది. ఇంతవరకూ సిక్కిం సమీపంలోని నాథులా పాస్ మీదుగా ఈ యాత్ర చేసేవారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే, 90 కిలో మీటర్లు ప్రయాణిస్తే మానస సరోవర్ కు చేరుకోవచ్చు. అయితే, ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే, ఆవలి వైపున చైనా గుట్టుమట్లన్నీ మనకు తెలుస్తాయి. అందుకే, దీనిని చైనా వ్యతిరేకిస్తోంది. నేపాల్ ను కూడా దీనికి వ్యతిరేకంగా మనపైకి ఉసి గొల్పుతున్నది. కాలాపానీ, లిపులేక్ వంటి ప్రాంతాలు తమవే నంటూ నేపాల్ ఎన్నడూ లేని విధంగా పేచీ పెడుతున్నది . దీనికోసం మ్యాప్ లను సవరించి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ తరుణంలో భారత్ ఐక్యరాజ్య సమితిలో మరోసారి సభ్యత్వం సాధించడం అంటే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందన్న గుర్రుతో చైనా ఉంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి మోడీ ట్విట్టర్ సందేశాన్ని విడుదల చేశారు. భారత దేశానికి ఏ ఒక్క భూభాగాన్నీ ఆక్రమించుకోవాలన్న దురుద్దేశ్యం లేదనీ, తన భూభాగాన్ని రక్షించుకోవడానికీ, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తుందని మోడీ అన్నారు. అంతేకాక, సమస్యలేమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలనాడు చైనా ప్రధాని చౌ ఎన్ లై , భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జరిపిన చర్చల పరమార్థం, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు , వాజ్ పేయిల హయాంలలో ఇరుదేశాల మద్య జరిగిన చర్చల ఉద్దేశ్యం శాంతియుత సహజీవ నం కోసమేనని మోడీ బీజింగ్ పాలకులకు స్పష్టం చేశారు. 45 ఏళ్ళ తర్వాత ఇరుదేశాల సైనికులు తుపాకులను పరస్పరం ప్రయోగించుకునే పరిస్థితి రావడం నిజంగా విచారకరమే. ఇంతకు వారం రోజుల క్రితం ఇరుదేశాల సైనికాధికారులు జరిపిన చర్చలు ఫలించాయని చైనా ప్రకటించింది. ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించింది.ఇంతలోనే ఏమైందో పరస్పర దాడుల పరిస్థితికి దారి తీసింది. ఇప్పుడు కావల్సింది ఆవేశకావేశాలను పెంచుకోవడం కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసే ప్రకటనలన్నీ వచ్చే డిసెంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలో స్వీయ లాభాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవే. అందువల్ల ట్రంప్ మాయలో పడకుండా చైనాతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేయాలి. చైనా వస్తు బహిష్కరణ వంటి నినాదాలు, ప్రదర్శనలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తాయి తప్ప ప్రయోజనం ఉండదు. పొరుగుదేశంతో పొసగని పరిస్థితులు తలెత్తితే శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఐదువిడతల లాక్ డౌన్ ల వల్ల దేశం ఆర్థికంగా బాగా దెబ్బతింది. మామూలు రోజుల్లో సైతం యుద్దోన్మాదం మంచిది కాదు. ఇప్పుడు అసలు వాంఛనీయం కాదు.

Leave a Reply