Take a fresh look at your lifestyle.

సామెతలు – సంస్కృతి

“తెలుగు సమాజాల్లోని సాహిత్యంలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చర్యలకు సంబంధించిన సామెతలు వేలకొద్ది ప్రజా జీవితంలో భాగమై సంభాషణల్లో తారసపడుతాయి. సుదీర్ఘమైన విషయాన్ని చెప్పడానికి పదునైన భావాలను అతి తక్కువ పదాలతో వ్యక్తీకరించడంలో సామెతలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. సామెతలు సంఘ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపకరిస్తాయి. భాషా, సాహిత్యాలలో సామెతలు లేని సమాజాలు ఉండటం అరుదుగానే కనిపిస్తుంది. తెలుగు సమాజంలో చక్కని సామెతలతో ప్రజల మధ్య సంత్సంబంధాలు, సామరసత్యను నెలకొల్పడంలో ఉపకరిస్తాయి.”

telugu language Proverbs - Culture

సమాజంలోని వింతలు, విశేషాలు, మానవ జీవితానికి దగ్గరి సంబంధం కలిగి ఉండి సాహిత్యం ద్వారా ప్రజలలో విశేషమైన ప్రచారంతో ఆదరణ లభిస్తుంది. సామాజిక విషయాలే సాహిత్యం ద్వారా ప్రజలకు గుణాత్మక మార్పులను అందించేందుకు సాహిత్యం ఒక సాధనంగా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో వివిధ ప్రక్రియలు సృజనాత్మకతకు కేంద్రంగా వుంటాయి. సామెతలు సాహిత్యంలో ఒక ప్రక్రియగా కాకపోయినప్పటికీ భాషా సాహితీ సముద్రంలో సామెతలు పాఠకుల్లో చురుకుతనం అందించే మెరుపులవుతాయి. సామెతలు మానవ జీవిత అనుభవాలను, భావనశక్తిని, మానసిక పరిణతిని ప్రకటిస్తాయి. వందల సంవత్సరాల క్రితం నుంచి అనాగరిక మానవ జీవితం నుంచి ఆధునిక మానవ నాగరికతల నుంచి మనిషి పొందిన అనుభవాల నేపథ్యం నుంచి వచ్చిన అందమైన మాటలు లేక పదాల సంపదనే ‘సామెత’లుగా చెప్పవచ్చును.
నానుడులు, సుద్దులు, జనశ్రుతులు, శాస్త్రములు(శాత్రం), న్యాయములు, సాటవ, సాటన, ఛాటన తదితర పదాలన్నీ సామెతలకు సామాన్యార్థములోనే ప్రయోగిస్తారు. వీటి గురించి సూక్ష్మంగా అధ్యయనం చేసినట్లయితే ఆయా పదాలకు విడివిడిగా ప్రత్యేక అర్థాలు, భావనలు కలుగవచ్చును. ‘నాడునుడి’ అనేది ‘నానుడి’గా మారింది. సంస్కృతంలోని ‘లోకోక్తి’కి తెలుగు అనువాదం. సుద్దులనగా చక్కని మాటలని అర్థం. ‘సుద్దుల’నే పదాన్ని తెలంగాణలోని జానపదులు తరచుగా ప్రయోగించే పదం.

‘సూక్తి’కి వివరణలో సు అనగా మంచి అనీ, ఉక్తి అనగా మాట, నైతికతను బోధించే ముచ్చటగా భావించవచ్చును. శిష్ట వ్యవహారంలో ‘జనశ్రుతి’ అనే పదానికి అర్థం ప్రసిద్ధి పొందిన, వినతగిన విషయం అనే భావనలో వాడుతుంటారు. వేర్వేరు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నప్పటికీ సంగ్రహ వ్యవహారంలో సామెతలను సామాన్యార్థంలోనే ఉపయోగిస్తున్నారు. సామెత అనే పదం ‘సౌమ్యత’కు తద్భవమని డా. చిలుకూరి నారాయణరావు మాట. వ్యక్తి విషయ బోధనకు సులభ సాధనం ‘సామెత’. విషయాన్ని నిశితంగా, సూటిగా, స్పష్టంగా, నిర్ధిష్టంగా సామ్యరూపంలో వ్యక్తం చేయడానికి అందరికీ ఉపకరించేది సామెత. ఈ సాధన సంపత్తి ఎవరిలో అధికంగా ఉంటుందో వారే మాటకారిగా నిలబడతారు. వక్త ప్రసంగానికి జీవంలాంటిది సామెత. ఏ రచనకైనా జవజీవాలను అందించేవాటిలో సామెతలు ప్రధానమైనవి. సామెతలు నన్నయకాలం నుంచి ఉండే అవకాశం వుంటుంది. శ్రీసంపత్‌ ‌రాఘవాచారి ‘సామెత’ అనే పదం తొలుత 15వ శతాబ్దంలోని వరహపురాణంలో ప్రయోగించారని పేర్కొన్నారు. ప్రజల వ్యవహారంలో ఉన్న సామెతల్ని మొదటగా పేకరించిన ఘనత క్యాప్టెన్‌ ‌డబ్లూ.ఎం.కార్‌ (1863) అనే పాశ్చాత్యుని కృషి. నిర్మాణపరంగా, జానపద కథలో లేని క్లుప్తత, విశ్లేషణ విశేష్య వాక్యాలూ, ఉపమాకౌశలం సామెతలో నిబిడీకృతమై వుంటుంది.

- Advertisement -

సంస్కృతి:
ప్రతీ సమాజం తనకంటూ ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి వుంటుంది. సాహిత్యానికి, సంస్కృతికి విడదీయరాని సంబంధాన్ని కలిగి వుంటుంది. సమాజంలోని వివిధ వర్గాలు, తెగలు, జాతుల ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, నమ్మకాలు, అలవాట్లు విభిన్నరీతులు సాహిత్యం ద్వారనే ప్రజల్లోకి ప్రవాహంగా వ్యక్తమై చేరుతాయి. సంస్కృతి అనే పదానికి మూలం ‘క్యూటిరె’ అనే జైవిక పదం. కల్చర్‌ అం‌టే కనిపెట్టు చూస్తూ, పరిచర్య చేయడం అని అర్థం. కాలెరి అనే లాటిన్‌ ‌పదం నుంచి ‘క్యూట్యర్‌’ అనే పదం ఏర్పడింది. కాలెరి అంటే ‘దున్ను’ లేక పోషించు అని అర్థం. మానవ జీవన విధానాన్ని పెంపొందించేది సంస్కృతి. మానవుడు ప్రకృతిలో జీవించడంవల్ల శ్రమ ద్వారా వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. దీనినే సంస్కృతిలో భౌతిక సంస్కృతిగా పిలుస్తారు. మనిషి కలిగివుండే సమస్త వస్తు సంపదను సూచించేదే భౌతిక సంస్కృతి. మనుషులు తోటి మనుషులతో, అంతరంగంతో, సరస్పర సంబంధంలోకి వస్తారు. దీంతోనే సామాజిక వ్యవస్థలు, కట్టుబాట్లు, ఆచారాలు, విలువలు, కళలు, సాహిత్యం, సంగీతం, అభివృద్ధి అంశాలను అభౌతిక సంస్కృతి అని పిలుస్తారు. ‘సమాజంలో సభ్యుడిగా ఉంటూ మనిషి సముపార్జించే జ్ఞానం, నమ్మకాలు, కళలు, నైతికతలు, చట్టం, ఆచారాలు, ఇతర శక్తులు, అలవాట్లు, సంక్లిష్టత మొత్తమే సంస్కృతి అని ‘ప్రిమెటివ్‌ ‌కల్చర్‌’ అనే గ్రంథంలో ఇ.బి. టేలర్‌ ‌పేర్కొన్నారు. ‘ఒక సమాజంలో నివసించే ప్రజల జీవన విధానాలే ఆ సమాజ సంస్కృతి’ అని రాల్ఫ్‌లింటన్‌ ‌పేర్కొన్నారు.

సాహిత్యం-సామెతలకు మధ్య సంబంధం:
తెలుగు సాహిత్యం మీద సంస్కృత సాహిత్య ప్రభావంతో వస్తువు, సంవిధానం, వాక్యరచన రీతులను అరువు తెచ్చుకుంది. నన్నయ భారతంలో ఐదు సామెతలు మాత్రమే ఉన్నాయి. దేశీ మార్గాన్ని అనుసరించిన పాల్కురికి సోమనాథుని సాహిత్యంలో193 సామెతలు ప్రయోగించారు. వేమన శతకంలో కూడా సామెతలు కనిపిస్తాయి. క్షేత్రయ్య, మొల్ల, చెల్లపిల్ల వారు తమ సాహిత్య రచనల్లో సామెతలు ప్రయోగించారు. సమాజంలోని పండితుల సాహిత్యం కంటే సామెతలకే ఎక్కువ ప్రచారం లభించింది. సామెతలు నిత్య వ్యవహారికంలో అధికంగా జానపదులు సంభాషణల్లో విరివిగా ప్రయోగిస్తారు.వీరితోపాటు శిష్టజనులు కూడా దైనందిన జీవన సంభాషణంలో వినియోగించడం మనకు కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్నివర్గాల ప్రజల జీవన సంభాషణలో సామెతలు తమ భావ వ్యక్తీకరణకు బలం చేకూర్చడానికి వాడుతారు.మాండరిన్‌, ‌స్పానిష్‌, ‌జర్మనీ భాషా సాహిత్య సంభాషణల్లో విస్తృతంగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడయింది. యూరఫ్‌లోని 16,17 శతాబ్దాల్లో ఎలిజబెత్‌ ‌కాలం సామెతలకు స్వర్ణయుగమని పండితులు వ్యాఖ్యానించారు. 18వ శతాబ్దం చివరి నుంచి సామెతల ప్రయోగం క్రమంగా తగ్గిందని తెలుస్తోంది. ఆంగ్ల భాషలో క్రీ.పూ. 300 నాటికే ప్రజలు నిత్యవ్యవహారంలో ఉన్నట్లు ‘ఇంటర్నెషనల్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌కోటేషన్స్’ అనే గ్రంథంలో వివరించారు. సామెతలు మానవ జీవితంలోని వివిధ సందర్భాలను బలంగా నొక్కి చెప్పడానికి ప్రధాన పాత్రను పోషిస్తాయి. నిత్య జీవన సంస్కృతిలోని విషయాలను సామెతలు ప్రతీకలుగా వ్యక్తీకరిస్తాయి. ఆ సామెతలను ప్రయోగించడం ద్వారా ఆయా సంస్కృతి, సంప్రదాయాలను అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

తెలుగు సమాజాల్లోని సాహిత్యంలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చర్యలకు సంబంధించిన సామెతలు వేలకొద్ది ప్రజా జీవితంలో భాగమై సంభాషణల్లో తారసపడుతాయి. సుదీర్ఘమైన విషయాన్ని చెప్పడానికి పదునైన భావాలను అతి తక్కువ పదాలతో వ్యక్తీకరించడంలో సామెతలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. సామెతలు సంఘ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపకరిస్తాయి. భాషా, సాహిత్యాలలో సామెతలు లేని సమాజాలు ఉండటం అరుదుగానే కనిపిస్తుంది. తెలుగు సమాజంలో చక్కని సామెతలతో ప్రజల మధ్య సంత్సంబంధాలు, సామరసత్యను నెలకొల్పడంలో ఉపకరిస్తాయి. వీటి గురించి భవిష్యత్తు పరిశోధకులు గతంలో జరిగిన పరిశోధనలను దృష్టిలో ఉంచుకొని నూతన మార్గంలో పరిశీలిస్తే మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.

– కోడం కుమారస్వామి, ఉపాధ్యాయ అధ్యాపకుడు,
ఎల్‌.‌బి. విద్యా కళాశాల, వరంగల్‌,
9848362803.

 

Leave a Reply