- లేదంటే కఠిన చర్యలు ..!
- 127 మంది హైదరాబాద్ వాసులకు ఆధార్ సంస్థ నోటీసులు
- నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం
భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి బుధవారం నోటీసులు జారీ చేసింది. పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు గురువారం తమ వద్ద ఉన్న అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోలేకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న సత్తార్‌ఖాన్ అనే వ్యక్తి ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతను నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్ కార్డును అందుకున్నాడని అందిన ఫిర్యాదు మేరకు ఈనె 3న అతనికి నోటీసులు జారీ చేసింది. పౌరసత్వం కలిగి ఉంటే దానిని పొందడానికి సమర్పించిన ఒరిజినల్ పత్రాలను చూపించాలని నోటీసులో పేర్కొంది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, గురువారంలోగా విచారణాధికారి ఎదుట హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒకవేళ భారతీయుడు కాని పక్షంలో దేశంలోకి ఏ విధంగా ప్రవేశించారో నిరూపించుకోవాలని తెలిపింది. లేనిపక్షంలో దీన్ని సుమోటోగా తీసుకుని ఆధార్‌కార్డును రద్దుచేస్తామని వెల్లడించింది. ఈ నోటీసులను అందుకున్న వ్యక్తి ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా, దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు అట్టుడుకుతున్న వేళ 127 మంది నోటీసులు జారీ చేసిన విషయం భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ 127 మందికి నోటీసులు జారీ చేసిన అంశం మీడియాలో విస్త•తంగా ప్రచారం కావడంతో ఆధార్ సంస్థ వివరణ ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్ పాతబస్తీ తలాబ్‌కట్ట భవానీనగర్‌లోని మీ సేవా కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ధ్రువీకరణ పత్రాలు లేని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారనీ, అలాగే, బాలాపూర్, కంచన్‌బాగ్‌లో ఉంటున్న మరికొందరు అక్రమంగా దేశంలోని చొచ్చుకొని వచ్చిన శరణార్థులు కూడా ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారని పేర్కొంది. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారని పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మందికి నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అక్రమ వలసదారులకు ఆధార్ మంజూరు చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయనీ, ఆధార్ చట్టం ప్రకారం కార్డు పొందాలంటే దరఖాస్తు చేయడానికి కనీసం 182 రోజుల ముందు నుంచీ భారత్‌లో నివసించాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.స్థానిక పోలీసుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఆధార్ సంస్థ ప్రాంతీయ అధికారి 127 మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. కానీ, నోటీసులు జారీ చేసిన 127 మందికి గురువారం ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరామనీ, అయితే, ఒరిజినల్ ధ్రువపత్రాలు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.