Take a fresh look at your lifestyle.

బెంగాల్‌లో అధికార భాషగా తెలుగు… తెలుగు వారందరికీ గర్వకారణం

తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ పశ్చిమబెంగాల్‌ ‌లోని  తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి విశేషంగా కృషి చేశారు. తమిళులతో పోలిస్తే తెలుగువారికి భాషాభిమానం తక్కువే. తమిళులు ఏ రాష్ట్రంలో ఉన్నా తమ భాష ఔన్నత్యం కోసం విశేషంగా కృషి చేస్తారు.   పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి రాజకీయాలే ప్రేరణ అయి ఉంటాయి. అక్కడ ఖర్గపూర్‌లో తెలుగువారి జనాభా ఎక్కువ. రైల్వేలో ఉద్యోగాల కోసం దశాబ్దాల క్రితమే తెలుగువారు ఖర్గపూర్‌ ‌తదితర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు. అలాగే, రౌర్కేలా, భిలాయ్‌ ఉక్కు కర్మాగారాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళి ఒడిషా, ఉమ్మడి మధ్యప్రదేశ్‌లలో స్థిరపడ్డారు. ఖర్గపూర్‌ను మినీ ఆంధ్రగా పిలుస్తారు. ఖర్గపూర్‌ ‌మునిసిపాలిటీలో 35 వార్డులుండగా, ఆరు వార్డుల్లో తెలుగువారే కౌన్సిలర్లు కావడం గమనార్హం. అలాగే, ఒడిషాలోని  బరంపురం,  కర్నాటకలోని బళ్ళారి మద్రాసు ప్రావిన్స్‌లో తెలుగు ప్రాంతాలుగానే ఉండేవి. తెలుగు రాష్ట్రం ఏర్పాటులో ఈ రెండు ప్రధాన నగరాలు పొరుగు రాష్ట్రాలల్లో చేరిపోయాయి.

ఇప్పటికీ  బళ్ళారిలో గాలి జనార్దనరెడ్డి, బి శ్రీరాములు వంటి వారు కర్నాటక రాజకీయాల్లో  ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి వివి గిరి ఒడిషాలోని గంజాం జిల్లాకు చెందిన వారు. బరంపురం నుంచి ఆయన పార్లమెంటుకు ఎన్నికైనారు. ఇందిరాగాంధీ కేబినెట్‌లో జగన్నాధరావు అనే తెలుగు నాయకుడు మంత్రిగా వ్యవహరించారు. ఆయన బరంపురం నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇప్పటికీ  పొరుగు రాష్ట్రాల్లో తెలుగువారు  సాంఘిక, ఆర్థిక రంగాల్లో రాణిస్తున్నారు. మహారాష్ట్రలో ముత్తెంవార్‌, ‌మద్దెంవార్‌ ‌వంటి పేర్లు గలవారు తెలుగువారే. ప్రవాసాంధ్రులు ఎక్కడున్నా భాషా వికాసం కోసం విస్తృతంగా కృషి చేస్తున్నారు. వారిలో ఖర్గపూర్‌ ఆం‌ధ్రమహాసభ చేసిన కృషి మరువలేనిది. తెలుగు వ్యవహార భాషా ఉద్యమ నిర్మాత గిడుగు రామమూర్తి పంతులుగారు పర్లాకిమిడికి చెందినవారు. ఆయన ఒడిషాలో గిరిజనుల భాషకు రూపు ఇచ్చిన తెలుగు పరిశోధకునిగా గుర్తింపు పొందారు.   అలాగే, సరిహద్దు ప్రాంతాల్లో నివసించిన తెలుగు కవులు, రచయితలు పొరుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గన్న క్షేత్రాల గురించి అక్కడ పేరొందిన వ్యక్తుల గురించి  తెలుగువారికి తెలియజేసేవారు. అలాంటివారిలో మహాకవి గురజాడ అప్పారావు, కాళీపట్నం రామారావు,  రావి వెంకటాచలం, మధురాంతకం రాజారాం వంటివారు ఎంతో మంది ఉన్నారు. ఖర్గపూర్‌ ఆం‌ధ్ర సమితి వారు తెలుగు నాట వివిధ నగరాలు, పట్టణాల్లో జరిగే  నాటక కళా పరిషత్‌ ‌నాటక పోటీల్లో పాల్గొనేవారు. వారిలో రావుజీ  ముఖ్యులు. మద్రాసులో కూడా తెలుగు సేవా సమితి ఇప్పటికీ చురుకుగా పని చేస్తోంది. ఖర్గపూర్‌లో  తెలుగువారి వోట్ల కోసమే  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యర్ధులు ఆరోపించవొచ్చు. ఒడిషా, బెంగాలీ, హిందీ, గుర్ముఖి, నేపాలీ సహా పది భాషలు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి. తెలుగును అధికార భాషగా గుర్తించాలన్న డిమాండ్‌ ‌చాలా కాలంగా ఉంది. ఇప్పటికైనా అక్కడి తెలుగువారి  కోర్కెను మన్నిస్తూ మమత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగువారిలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఖర్గపూర్‌లో తెలుగువారుండే ప్రాంతాల్లో తెలుగు మీడియం పాఠశాలలు పని చేస్తున్నాయి. తెలుగు పత్రికలు కూడా వెలువడుతున్నాయి. రౌర్కేలా, భిలాయ్‌ ‌లలో కూడా తెలుగుకు ఆదరణ లభిస్తోంది.  అమెరికాలో కూడా ప్రవాస భారతీయులో తెలుగువారు తమ భాషా సంస్కృతులను కాపాడుకోవడమే కాకుండా, మాతృభాషకు గుర్తింపు,  గౌరవం కోసం పోరాడుతున్నారు.

- Advertisement -

బెంగాల్‌లో రైల్వే  కార్మికుల్లో అధిక సంఖ్యాకులు తెలుగువారే. వీరంతా విశాఖ,  శ్రీకాకుళం, విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దశాబ్దాల క్రితం అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. కాలనీలు నిర్మించుకున్నారు. సంవత్సరాది, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కవి సమ్మేళనాలు, సాహితీ సభలు నిర్వహిస్తూ భాషా వికాసానికి తోడ్పడుతున్నారు. అలాగే, ఔత్సాహిక నాటక సమాజాలు నాటక, నాటిక పోటీలను నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌కాలం నుంచి  తెలంగాణ నుంచి అనేక మంది సాహితీ వేత్తలూ, కళాకారులు ఆంధప్రాంతంలో సాహితీ కళా, సాంస్కృతి వికాస సభలకు హాజరుకావడం ఆనవాయితీ. అలాగే, బెంగాలీలకు భాషాభిమానం మెండుగా ఉంటుంది. వారు ఎక్కడున్నా దసరాకు దుర్గాపూజ ఉత్సవాలను నిర్వహించి బెంగాలీల సమాగమానికి కృషి చేస్తుంటారు. స్వభాషాభిమానం అంటే వారికి తెలుసు కనుక ఇతర భాషల వారి కోర్కెలను మన్నిస్తున్నారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచి మద్రాసులో చెన్నపురి ఆంధ్రమహాసభ వారు తెలుగు ప్రాంతాల్లోని కవులు, సాహితీ వేత్తలను ఆహ్వానించి సత్కారాలు చేసేవారు. భాషాపరమైన ఐక్యత ప్రజల్లో భావోద్వగాలను పెంచుతుంది. ఇప్పుడు బెంగాల్‌లో మమత ప్రభుత్వం వోట్ల కోసం చేసినా తెలుగు భాషకు అధికార భాష ప్రతిపత్తిని కల్పించడం తెలుగువారంతా గర్వించదగిన విషయం. ఉత్తరాంధ్రలో తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి చేసిన పురిపండా అప్పలస్వామి, రావి శాస్త్రి, వంటి కవులు, సాహితీ వేత్తలు ఒడిషా, బెంగాల్‌లలో తెలుగువారి ఐక్యత కోసం కృషి చేశారు. బెంగాల్‌లో తెలుగు అధికార భాషగా గుర్తించబడటం తెలుగువారందరికీ శుభకరమైన పరిణామం. శ్రీ కృష్ణ దేవరాయుల కాలంలో తెలుగు భాష నాలుగు చెరగులా విస్తరించి అనన్యమైన గౌరవాన్ని పొందింది. అందుకే ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. ఆ స్పూర్తితో తెలుగుభాష వికాసానికి కృషి చేయడం తెలుగువారందరి కర్తవ్యం.

Leave a Reply