Take a fresh look at your lifestyle.

మరిచిపోకు…. సైనికుడా….

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో
కాసిన్ని తెల్ల గులాబీలుంటే తెంపుకురా
యుద్ధంలో మరణించిన మనవారి సమాధులపై ఉంచి
ఓ.. కన్నీటి నివాళినర్పిద్దాం

సైనికుడా….
యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో
నెత్తురంటని మట్టుంటే మూటగట్టుకురా
పోరుకు బలైన ఆత్మీయుల గురుతుగా
ఇంటిముందర ఓ మల్లె మొక్క నాటుదాం

సైనికుడా….
యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో
చెమ్మగిళ్ళని కళ్లేవైనా ఉంటే ఓ ఫోటో తీసుకురా
తనివితీరా నా యదలకద్దుకుని
నీ పడక గదిలో వేలాడదీస్తా

సైనికుడా…
యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో
గాయపడని తెల్లపావురమేదైన ఉంటే పట్టుకురా
యుద్ధంలో అలసిపోయావు కదా!
దానితో ఆడుకుని కాసింత సేదధీరుదువు

సైనికుడా…
యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో
శవాల మధ్యన ఆనంద గీతమాలపించే
ఆత్మీయ గొంతెదైనా ఉంటే రికార్డ్ ‌చేసుకురా
నిదురపోయే వేళ నీకు జోలపాటగా వినిపిస్తా….

(రష్యా-ఉక్రెయిన్‌ ‌ల మధ్య యుద్ధాన్ని నిరసిస్తూ….)

– దిలీప్‌.‌వి, జిల్లా కార్యదర్శి, మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా, 8464030808

Leave a Reply