Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా… విపక్ష పార్టీల చలో ప్రగతి భవన్‌

  •  ‌ముఖ్య నేతల అరెస్టు
  • రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది: ప్రొ.కోదండరామ్‌

రాష్ట్రంలో కొరోనా కట్టడిలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ విపక్ష పార్టీల నేతలు నిర్వహించ తలపెట్టిన ప్రగతి భవన్‌ ‌ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రగతి భవన్‌ ‌ముట్టడికి ప్రయత్నించిన విపక్ష నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మేలుకో ప్రజలను కాపాడు పేరుతో టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ ‌పార్టీలు శుక్రవారం ప్రగతి భవన్‌ ‌వద్ద నిరసన తెలపాలని నిర్ణయించాయి. అయితే, ఉదయం నుంచే ఆయా పార్టీల ముఖ్య నేతల ఇళ్లతో పాటు ప్రగతి భవన్‌ ‌వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ‌వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.‌రమణను అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. అలాగే, ప్రగతి భవన్‌ ‌ముట్టడికి వెళుతున్న టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, ‌సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, న్యూడెమోక్రసీ నేతలు గోవర్ధన్‌, ‌సంధ్య, కమ్యూనిస్టు, యువజన ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వీరందరినీ అరెస్టు చేసి గోషామహల్‌ ‌పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీల కార్యకర్తలు, పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాగా, ప్రగతి భవన్‌ ‌ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంపై టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ఖండించారు. రాష్ట్రంలో కొరోనా విజృంభిస్తుంటే మరోవైపు, సీఎం కేసీఆర్‌ అవనసర సమావేశాలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కొరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, నిరుపేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందనీ, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతోనే ప్రగతి భవన్‌ ‌ముట్టడికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. విపక్ష పార్టీల ప్రగతి భవన్‌ ‌కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామిక పద్దతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకోవడమంటే పౌర హక్కులను కాలరాయడమనని విమర్శించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టమంటే సీఎం కేసీఆర్‌ అరెస్టులతో పోలీస్‌ ఎమర్జెన్సీ పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ ‌పాలన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంతృత్వంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానాల దోపిడీని వెంటనే అరికట్టడంతో పాటు కొరోనా నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా చాడ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!