Take a fresh look at your lifestyle.

నిరసన ప్రాథమిక హక్కు

నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య సురక్షితత్వం అనే మాటల నిర్వచనాలేమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను నిర్వచించడంలో విఫలమైంది. చివరికి వాటిని నిర్వచించలేక అవన్నీ ఒక వృత్తమని, ఆ వృత్తానికి బైటివలయంలో రాజ్యం సురక్షితత్వం ఉంటుందని ప్రకటించింది.

 

జస్టిస్‌ భార్గవ, జస్టిస్‌  వక్తధర్‌ కమిషన్ల నాటి నుంచి, ప్రభుత్వం నియమించిన ప్రతి విచారణ కమిషన్‌ ముందర  వాదనలు వినిపించడం నా పని అయింది. అసాధారణంగా ప్రజల న్యాయమైన నిరసనల మీద పోలీసులు చేసిన అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఇటువంటి కమిషన్లను నియమిస్తుంది. అసలు అటువంటి నిరసన వెల్లువెత్తడమే రాజ్యం మీద తిరుగుబాటుగా ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల ప్రతి ప్రజా నిరసననూ అణచివేయడానికి అత్యంత క్రూరంగా ప్రవర్తించమని ప్రభుత్వం పోలీసులను ఆదేశిస్తుంది. కాని మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజలకు ఆ మాదిరిగా నిరసన తెలిపే హక్కును ప్రాథమిక హక్కుగా హామీ ఇచ్చింది. ప్రజల సమస్యలను రాజకీయంగా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించింది.
రెండు దశాబ్దాల కింద ఒక సందర్భంలో ఒంగోలులో పొగాకు రైతులు తమ జీవితాలను మెరుగుపరచుకునే ఉద్దేశ్యంతో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శనకారులు మొదట  నిరాహార దీక్షలకు కూచున్నారు. ఆ క్రమంలో వారిలో అశాంతి పెరిగింది. సహజంగానే వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రాకపోయేసరికి వారికి ఇక మిగిలిన దారి హింసా మార్గం మాత్రమే. అక్కడికి ఆ గుంపును చెదరగొట్టడానికి వెళ్లిన పోలీసులు ఒక ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేటును వెంటబెట్టుకుని వెళ్లారు. సాధారణంగా ఇటువంటి ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కింది స్థాయి రెవెన్యూ అధికారి అయి ఉంటాడు. అంతకన్నా పై స్థాయి అధికారి అంతే ఏదో పెద్ద తేడా ఉంటుందని కాదు. ఎవరైనా కాల్పులు జరపాలని పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని ఆమోదించడానికే. మన పోలీసులకు సాధారణంగా ప్రజాస్వామ్య ప్రక్రియలను దాట వేయడానికి శిక్షణ ఇవ్వబడుతుంది. అందువల్లనే చాలా ఎక్కువగా తుపాకి కాల్పులు జరుగుతాయి . ఒంగోలులో కూడా ఇదే జరిగింది.
మన దేశంలో రాజ్యాంగం పని చేసే తీరు చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రజలు ఒక సమస్యను గుర్తించి పరిష్కరించమని అడుగుతారు. ఆ విషయంలో ఒక మహజరు సమర్పించుకోమని స్థానిక నాయకులు సలహా ఇస్తారు. ప్రజలు సమర్పించే మహజరు తక్షణమే దగ్గరిలోని చెత్తబుట్టకు చేరుతుంది. సమస్య పరిష్కారం కోసం, కనీసం తమ మహజరుకు జవాబు కోసం చాలా కాలం వేచి చూసిన ప్రజలు సంఘటితం కావాలని, నిరసన తెలపాలని నిర్ణయించుకుంటారు. ప్రజల నిరసన వ్యక్తీకరణ పొందుతుంది. ఆ నిరసనను పోలీసులు ఊహించశక్యంకాని హింసతో అణచివేస్తారు. ప్రజలు తమ జీవించే హక్కు కోసమో, జీవనం కోసమో డిమాండ్‌ చేస్తారు కాని ఆ క్రమంలో వాళ్లలో కొందరు తమ ప్రాణాలే పోగొట్టుకోవలసి వస్తుంది. అది కూడా చట్టం ద్వారా స్థాపిపతమైన పద్ధతిలో జరగదు.
శాంతిభద్రతలు అనే ఎక్కడా నిర్వచించబడని శక్తివంతమైన మాట అధికరణం 21 హామీ ఇచ్చే జీవించే స్వేచ్ఛను అన్యాయంగా, అనధికారికంగా రద్దు చేసి వేస్తుంది.
ఇక్కడ ఒక పాత సంగతి చెప్పాలి. తిరువాన్కూరు ` కొచ్చిన్‌ రాష్ట్రంలో సోషలిస్టు పార్టీ ప్రభుత్వానికి పానంపల్లి గోవింద మీనన్‌ నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆయన ఏదో తప్పు చేశాడు. వెంటనే ప్రభుత్వాధికారం నుంచి దిగిపొమ్మని, రాజీనామా చేయమని పార్లమెంటరీ పార్టీ నాయకుడు రామమనోహర్‌ లోహియా ఆదేశించాడు. బహుశా అటువంటి ఆదేశం ఇచ్చిన నాయకుడు ఆయన ఒక్కడే కావచ్చు.
ఆ తర్వాత తమ పార్టీ నాయకులు ఎన్ని తప్పులు చేసినా, ప్రభుత్వాలు కొనసాగితే చాలునన్నట్టు వాళ్లను సమర్థించిన వారేతప్ప బహిరంగంగా విమర్శించిన వారు ఎవరూలేరు. నందిగ్రామ్‌ ఉదాహరణ చూడండి ! ముఖ్యమంత్రి కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ భట్టాచార్య ఇస్తున్న వివరణలు, సంజాయిషీలు, ఆయన కోసం ఇతరులు ఇస్తున్న వివరణలు, సంజాయిషీలు చూడండి. ఒక కమ్యూనిస్టు పార్టీ, అది రాడికల్‌ పార్టీ అయినా, రివిజనిస్టు పార్టీ అయినా, దాని పోలిట్‌బ్యూరో గనుక తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తన పాలనా క్రమంలో అంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే అతడిని వెనక్కి పిలవగలిగిన రోజున మాత్రమే ఈ దేశంలో వామపక్ష భావజాలం విస్తరిస్తుంది. అంత వరకూ అది జరగదు. దశాబ్దాలుగా బూర్జువా ముఖ్యమంత్రులందరూ శాంతిభద్రతల పేరు మీద ఏమిచేస్తూ వస్తున్నారో అదే పని కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ చేశాడు.
నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య సురక్షితత్వం అనే మాటల నిర్వచనాలేమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను నిర్వచించడంలో విఫలమైంది. చివరికి వాటిని నిర్వచించలేక అవన్నీ ఒక వృత్తమని, ఆ వృత్తానికి బైటివలయంలో రాజ్యం సురక్షితత్వం ఉంటుందని ప్రకటించింది.
సరే, ఒంగోలు పోలీసు కాల్పుల విషయంలో విచారించడానికి చాలా నెమ్మదస్తుడు, మంచివాడు, ఎవరికీ అపకారం తలపెట్టని వాడు జస్టిస్‌ హెచ్‌.ఎ.అయ్యర్‌ను విచారణ కమిషన్ల చట్టం కింద న్యాయమూర్తిగా నియమించారు. ఆ విచారణలు ఒంగోలు పట్టణంలో ఒక చిన్న గుట్టమీద జరుగుతుండేవి. ఆ విచారణకు మేము వెళుతున్నప్పుడు దారిలో ఎంతో మంది మఫ్టీ దుస్తుల పోలీసులు ప్రజలను భయపెడుతూ, విచారణ కమిషన్‌ ముందుకు  రాకుండా బెదరగొడుతూ కనిపించారు. అక్కడి నుంచి మేం విచారణ జరుగుతున్న హాలులోకి ప్రవేశించేసరికి, న్యాయమూర్తి ఎదుట మొదటి ఐదు వరుసల్ల కూర్చున్న వాళ్లు మఫ్టీలో ఉన్న స్పెషల్‌ బ్రాంచి పోలీసులని మాకు స్థానికులు చెప్పారు. మేం ఆ విషయం చెప్పగానే న్యాయమూర్తి వారిని బయటికి పంపక ముందే  వాళ్లందరూ లేచి వెళ్లిపోయారు.
ఇటువంటి అనుభవం అదే మొదటిసారి కాదు. జస్టిస్‌ భార్గవ కమిషన్‌ తన మొదటి దఫా విచారణ లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో జరుపుతున్నప్పుడు పురుషోత్తమరెడ్డి అనే కిందిస్థాయి న్యాయమూర్తి సాక్ష్యం చెప్పడానికి లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌కు వస్తున్నాడు. గేటు దగ్గరే ఆయన కారు ఆపి వెనక్కి వెళ్లపొమ్మని ఒక పోలీసు అధికారి బెదిరించాడు. ఆయన ఆ మాట వినకుండా ముందుకే  వెళ్లి సాక్ష్యం చెప్పి తన ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఆయనను ఇల్లు ఖాళీ చేయించాడు . ఆ ఇంటి యజమాని ఒక పోలీసు అధికారి

-కె.జి. కన్నబిరాన్‌

ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply