Take a fresh look at your lifestyle.

నూతన వ్యవసాయ చట్టాలను.. ఉపసంహరించే వరకు నిరసన

  • అప్పటి వరకు ఢిల్లీ వొదలం..6 నెలల గ్రాసంతో వొచ్చాం
  • స్పష్టం చేస్తున్న ఢిల్లీ చేరుకున్న ఆరు రాష్ట్రాల రైతులు
  • మూడు రహదారులు మూసివేసి అడ్డుకుంటున్న పోలీసులు  

పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దు చుట్టూ క్యాంప్‌ ‌చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం టియర్‌ ‌గ్యాస్‌, ‌వాటర్‌ ‌ఫిరంగులు, లాఠీ ఛార్జ్ ‌చేస్తూ •వ్వగతం పలుకుతున్నది. తమ నిరసనలను ఆరు నెలల వరకు కొనసాగించడానికి తమకు అవసరమైన రేషన్‌ ‌తీసుకుని బయలు దేరామని రైతులు పిడికిలి బిగించి చెబుతున్నారు. ఢిల్లీకి దారితీసే మూడు రహదారులు మోడీ ప్రభుత్వం మూసివేసింది. రైతులు టికిరి గ్రౌండ్‌కి పోయి తమ నిరసన చేసుకోమని సర్కార్‌ ‌చెబుతున్నది. రైతులు మాత్రం మా పార్లమెంట్‌ ఎదురుగా జంతర్‌ ‌మంతర్‌ ‌వొచ్చి ధర్నా చేస్తామని పట్టు బడుతున్నారు. రైతులు ప్రభుత్వంతో తలపడటం కోసం ఎలా సిద్ధపడి వొచ్చారనేది చాలా ఆసక్తికరంగా వుంది. రైతుల బృందాలు, ఆహారం మరియు అవసరమైన సామాగ్రి నిండిన ట్రాక్టర్లతో నడుస్తూ, పలు రహదారుల నుండి ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ, బారికేడ్లను ధిక్కరించి, ముళ్ల తీగలు, కీలక రహదారుల దగ్గర తవ్విన కందకాలు దాటుకుని ఢిల్లీలోకి రాటానికి ప్రయత్నం చేస్తున్నాయి.

రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి ఢిల్లీ నుండి బహదూర్‌గడ్‌ ‌రహదారి తెరిచి టికిరి గ్రౌండ్స్‌కి పోవొచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ బోర్డర్‌ ‌నరేలా సమీపంలోని సింగు సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీకి దారితీసే మూడు రహదారులు మూసివేశారు. ఢిల్లీ బహదూర్‌గడ్‌ ‌హైవే. ఢిల్లీ-సోనెపట్‌, ‌ఢిల్లీ-హరిద్వార్‌ ‌వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉత్తర ప్రదేశ్‌ ‌నుండి రైతులు దేశ రాజధాని వైపు కవాతు చేస్తున్నారు.  ‘‘మా  దగ్గర ఆరు నెలల ఆహారం వుంది, మాకు వ్యతిరేకంగా ఉన్న ఈ చీకటి వ్యవసాయ చట్టాలను వొదిలించుకున్న తరువాత మేము తిరిగి గ్రామానికి పోతాం’’ మీడియా ముందు రైతులు మాట్లాడుతున్న మాటలు ఇవి.

కొంతమంది రైతులు భారీగా మోహరించిన పోలీసుల మధ్య రాజధాని శివార్లకు సమీపంలో ఉన్న బురారీలోని ఒక మైదానంలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు  వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.
రైతు నిరసనలకు మద్ధతు ఇచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌బురారీలో జరుగుతున్న ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది. రైతుల కోసం టెంట్లు, ఆహార సదుపాయాలు దగ్గరుండి చూసుకోవాలని స్థానిక ఆప్‌ ఎమ్మెల్యేలకు అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆదేశించారు. అయితే ఇదంతా బూటకం అని నిరసనకారులు చెబుతున్నారు. నిరసన వేదిక వద్ద సౌకర్యాలు లేవు. బురారీలోని నిరసన వేదిక వద్ద ఎటువంటి ఏర్పాట్లు లేవు. ‘కనీసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదు, గురుద్వారాలో వున్న మరుగు దొడ్లను ఉపయోగించటానికి ప్రయత్నించాము కాని పోలీసులు మమ్మల్ని అనుమతించలేదు’ అని ఒక రైతు వాపోయాడు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకోవడానికి నగరంలోని తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక ‘‘జైళ్లుగా’’ మార్చాలని ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను ఆప్‌ ‌ప్రభుత్వం తిరస్కరించింది.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌రైతులు తమ నిరసనను ముగించాలని రైతులను అభ్యర్థించారు. మూడు వ్యవసాయ రంగ చట్టాలకు సంబంధించిన అంశాలను రైతు సంస్థల ప్రతినిధులతో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ‘‘రైతులతో సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 3 ‌న మరో రౌండ్‌ ‌చర్చలకు మేము రైతు సంస్థలను ఆహ్వానించాము. కోవిద్‌-19 ‌మరియు శీతాకాలాలను దృష్టిలో ఉంచుకుని ఆందోళనను నిలిపి వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని తోమర్‌ ‌మీడియా ముందు ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్‌, ‌హర్యానా, ఉత్తరాఖండ్‌, ‌రాజస్థాన్‌, ‌కేరళ, పంజాబ్‌ ‌రాష్ట్రాల రైతులు ఢిల్లీ తరలి వొస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే నిరసన కోసం ఢిల్లీ నడిబొడ్డున ఉన్న రామ్‌ ‌లీల మైదాన్‌లో అన్ని రాష్ట్రాల రైతులు కలవాలని భావిస్తున్నారు. 500 రైతు సంస్థలు ఇందులో భాగమని రైతులు అంటున్నారు. ఏడు రైతు సంస్థలతో కూడిన ది సంయుక్త్ ‌కిసాన్‌ ‌మోర్చా చర్చల కోసం రైతులు సమావేశమయ్యే స్థలాన్ని సమకూర్చమని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసింది.

Leave a Reply