Take a fresh look at your lifestyle.

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు నిరసన సెగ ..

  • పెద్ద ఎత్తున ఆందోళన..రైతు రాములు ఆత్మహత్యపై భగ్గుమన్న జనం
  • కలెక్టరేట్‌కు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • పోలీసలతో తోపులాటతో ఉద్రిక్తత..ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలన్న బిజెపి
కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి5: కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌తో పాటు,రైతు రాములు ఆత్మహత్యతో భగ్గుమన్న ప్రజలతో కలెక్టరేట్‌  ‌దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్‌ ‌ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టణప్రజలతో పాటు రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకొచ్చిన మాస్టర్‌ ‌ప్లాన్‌తో భూములు నష్టపోయిన రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. చర్చి గ్రౌండ్‌ ‌నుంచి భూ బాధితులు ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీకి భారీగా అన్నదాతలు తరలివచ్చారు. మరోవైపు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కలెక్టర్‌ ‌కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ ఇం‌చార్జి సుభాష్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.కామారెడ్డి మున్సిపల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌ను రద్దు చేయాని కలెక్టరేట్‌ ‌వద్ద ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌ ‌రావు తెలిపారు. కలెక్టర్‌ ‌వచ్చి మెమోరాండం తీసుకోవాలని డిమాండ్‌ ‌చేసారు. కలెక్టర్‌ ‌వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించ్చారు.
బుధవారం శవాన్ని అడ్డుకున్నట్టు ఇవాళ ఉండదని డీఎస్పీని హెచ్చరించారు. మరోవైపు రాములు మృతికి సంతాపంగా రైతులు మౌనం పాటిస్తుండగా అక్కడికి వచ్చిన సర్పంచ్‌ ‌భర్త జనార్దన్‌ ‌రెడ్డిపై వారు దాడికి యత్నించారు. రాజీనామా చేయకుండా ర్యాలీ వద్దకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను సముదాయించారు.కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కారణంగా భూమి కోల్పోతామన్న భయంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వేదనకు గురైన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉపసర్పంచ్‌ ‌సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పీఏసీఎస్‌ ‌డైరెక్టర్‌, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు పదవులు వదులుకున్నారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు చేయాలని వారు డిమాండ్‌ ‌చేసారు.
నగరాలు, పట్టణాల అభివృద్ధ్దికోసమే మాస్టర్‌ ‌ప్లాన్‌
‌మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ప్రజలకు అనుకూలంగా ఉండాలి
కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కేవలం డ్రాఫ్టు మాత్రమే
ప్రజలకు ఎందుకు వివరించలేక పోయారు
పట్టణప్రగతి సదస్సులో అధికారులకు మంత్రి కెటిఆర్‌ ‌ప్రశ్న
image.png
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: నిర్మాణాత్మక నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసమే మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేశామని
పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటి రామారవు అన్నారు. మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ప్రజలకు అనుకూలంగా ఉండాలి.. వ్యతిరేకంగా ఉండొద్దు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌నిరసనలపై మంత్రి కేటీఆర్‌ ‌స్పందించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కేవలం మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ముసాయిదా మాత్రమే ఇచ్చారని కేటీఆర్‌ ‌తెలిపారు. ఇదే విషయాన్నిప్రజలకు చెప్పాల్సిందని అన్నారు.  ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని ప్రకటించారు. వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించాలని సూచించారు.
500 ఎకరాలు ఇండస్టియ్రల్‌  ‌జోన్‌కు పోతోందని ఆందోళన చెందుతున్నారు. భూమి పోతుందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో చూశానని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేందుకు లేదని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్టాల్రకు తెలంగాణ పురపాలక శాఖ ఆదర్శంగా ఉండాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.  పట్టణాల అభివృద్ధి కార్యాచరణపై మున్సిపల్‌ ‌కమిషనర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. పౌరుడు కేంద్రంగా ఉండాలన్న ప్రభుత్వం ఆకాంక్షకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేసినా.. స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుంటే కేంద్రం ఊరికే గుర్తింపు ఇస్తుందా? కేంద్రం ఇస్తున్న అవార్డులే మన పనితీరుకు నిదర్శనం. 141 పురపాలక సంఘాల్లో 42 ’ఓడీఎఫ్‌గుర్తింపు సాధించాయి. మిగతా 99 పురపాలక సంఘాలూ ఇదే స్ఫూర్తితో కృషి చేయాలని కేటీఆర్‌ ‌సూచించారు. అధికారులు, యంత్రాంగం కొత్త ఆవిష్కరణలతో వస్తే స్వీకరిస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న అధికారులను గుర్తించి, రివార్డులు ప్రకటిస్తామన్నారు.

Leave a Reply