ప్రతి సంవత్సరం మార్చి నెలలోని చివరి శనివారం రోజున రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు కరెంటు(విద్యుత్) ఆఫ్ చేసి ‘ఎర్త్ అవర్’’ జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధ్వర్యంలో 2007 నుండి ‘ఎర్త్ అవర్’’ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక గంట పాటు కరెంట్ ఆఫ్ చేసి క్యాండీల్(కొవ్వత్తి) లైట్ల వెలుతురులో దీన్ని జరుపుకుంటాం. దీని యొక్క ఉద్దేశం వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని గురించి అవగాహన పెంచడానికి, గృహాలు మరియు వ్యాపార కేంద్రాలు ఇతర కార్యాలయాలు లైట్లను ఒక గంట పాటు ఆపివేసి ప్రకృతిని కాపాడి కరెంటు వలన జరిగే నష్టాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయడమే. మనదేశంలో గృహ అవసరాల నిమిత్తం దాదాపు 30 శాతం విద్యుత్ శక్తిని వినియోగిస్తున్నాం. చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఈ శక్తిలో పెద్ద మొత్తాన్ని పొదుపు చేయడానికి సులువైన ఆచరణాత్మక విధానాలను ఆచరించాలి. ఇలా ఆచరించడం ద్వారా డబ్బులు, శక్తిని పొదుపు చేయడమే కాకుండా సహజ వనరులను సద్వినియోగం చేసిన వాళ్లమవుతాం.
కార్యాలయాలు, గృహాలు విరామ సమయాలలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, కూలర్‌ల కరెంట్ స్విచ్‌లు ఆఫ్ చేసి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. మార్కెట్లో విద్యుత్‌ను ఆదా చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను నాణ్యమైనవి కొనుగోలు చేసుకోవాలి. ఈ రోజుల్లో విద్యుత్ లేకుండా ఏ పని జరగదు అందుకే విద్యుత్ ఎంతో ముఖ్యమైనది. ఉపయోగం లేని ఎలక్ట్రిక్ పరికరాల స్విచ్‌లను ఆపివేయాలి. గాలి, వెలుతురు, రావటానికి కిటికీలను తెరిచి ఉంచడం, ఏసి బదులు ఫ్యాన్ వాడడం, ఫ్రిజ్ డోర్‌ను చాలా తక్కువ సార్లు తెరవడం వంటి పొదుపు మార్గాలు పాటించాలి. గదిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మన బాధ్యతగా అవసరం లేని కరెంట్ స్విచ్‌లను ఆపివేద్దాం. ఇంటి గోడలకు లేత రంగులు ఉపయోగించడం ద్వారా కాంతి ప్రతిభావంతంగా పరావర్తనం చెంది గదిలో వెలుతురును పెంచుతాయి. తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకునే ఎల్‌ఇడి బల్బులను వాడాలి. బల్బులు, ట్యూబ్ లైట్‌ల పైన దుమ్ము చేరకుండా దులుపుతూ ఉండడం ద్వారా వెలుగును పెంచవచ్చు. అవసరం ఉన్న చోటనే బల్బుల స్విచ్‌లు వేసుకోవాలి. కానీ గది మొత్తం లేదా బల్బులు వేయడం మానుకోవాలి.
సౌరశక్తి సహజమైన ఉత్తమమైన తరిగిపోని శక్తి వనరు, ఎంత వాడినా తరిగిపోనిది. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండేది. సౌరశక్తిని సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వ్యవసాయం, గృహోపకరణాలు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాహనాలు, దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు.
మన దేశంలో గుజరాత్ సౌరశక్తి వినియోగంలో ముందంజలో ఉండగా, కర్ణాటక, తమిళనాడు తర్వాత స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో సౌరశక్తి వినియోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. ప్రస్తుతం మనం వాడే శక్తి వనరులన్నీ పునరుత్పత్తికి వీలుకాని వనరులు. అంటే బొగ్గు, చమురు, సహజ వాయువు మొదలైనవి. ఈ మధ్యకాలంలో ఇంధన వనరులను ఇష్టం వచ్చినట్టు అవసరానికి మించి వాడేస్తున్నాము. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణాకు, ఇళ్లలో కూడా మనం అవసరం కంటే ఎక్కువ వనరులను వాడుతున్నాము. అడవులు తగ్గిపోయి, కాలుష్యం పెరిగి పోయి, వర్షాలు కురవక , కొద్దిగా కురిసిన వర్షం నీళ్ళు నదుల లోకి చేరడం లేదు. దానితో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. బొగ్గు నిల్వలు తగ్గి పోవడం వల్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి ఈ సమస్యని ఎదుర్కోవాలంటే ఉన్న వనరులను సక్రమంగా, పొదుపుగా వాడుకోవాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను పెంచడానికి వాడకంలో తేవడానికి కృషి చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎర్త్ అవర్ పాటించడం వలన కాలుష్యం కొంత వరకు తగ్గి, ప్రకృతి వనరులు ఆదా చేయబడుతాయి.