Take a fresh look at your lifestyle.

ప్రకృతి పరిరక్షణ మనందరి భాద్యత

“పర్యావరణాన్ని సంరక్షిస్తే అది మానవాళిని కాపాడుతుంది. భూమి,గాలి,నీరు,నిప్పు,ఆకాశం ఎంత స్వచ్ఛముగా ఉంటె మానవాళికి అంత ఆరోగ్యం.కోటానుకోట్ల సంవత్సరాలుగా సజీవంగా,స్వచ్చంగా ఉన్న ప్రకృతి 19వ శతాబ్దం నుండి విధ్వంసానికి గురి అవుతున్నది. శాస్త్ర,సాంకేతిక మరియు జీవావరణ మార్పులు ప్రకృతి స్వచ్చతను నాశనం చేస్తున్నవి.పెరుగుతున్న జనాభా,పట్టణీకరణ,పారిశ్రామిక విప్లవం,అడవుల నరికివేత,వనరుల విధ్వంసం,మితిమీరిన ప్లాస్టిక్‌ ‌వాడకం,రసాయనాల వినియోగం,ప్రకృతిని నాశనం చేస్తున్నవి.మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు.దీనితో అసంఖ్యాక జంతు,వృక్ష జాతులు అంతరించి పోతున్నవి.”

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్త ంగా ప్రతి సంవత్సరం జులై 28న జరుపుకుం టాము .సమా జానికి ఆరోగ్య కరమైన వాతా వరణం ముఖ్యమని ప్రపంచ ప్రకృతి పరి రక్షణ దినోత్సవం తెలియ జేస్తున్నది. సహజ వనరుల ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించి, సహజ వనరులను రక్షించే పద్ధతులను గురించి ప్రజలకు తెలియజేయుటకు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు భూమిని మరియు సహజ వనరులను రక్షించడానికి కృషి చేయాలి. పర్యావరణాన్ని సంరక్షిస్తే అది మానవాళిని కాపాడుతుంది. భూమి,గాలి, నీరు,నిప్పు,ఆకాశం ఎంత స్వచ్ఛముగా ఉంటె మానవాళికి అంత ఆరోగ్యం.కోటానుకోట్ల సంవత్సరాలుగా సజీవంగా,స్వచ్చంగా ఉన్న ప్రకృతి 19వ శతాబ్దం నుండి విధ్వంసానికి గురి అవుతున్నది. శాస్త్ర,సాంకేతిక మరియు జీవావరణ మార్పులు ప్రకృతి స్వచ్చతను నాశనం చేస్తున్నవి.పెరుగుతున్న జనాభా,పట్టణీకరణ,పారిశ్రామిక విప్లవం,అడవుల నరికివేత,వనరుల విధ్వంసం,మితిమీరిన ప్లాస్టిక్‌ ‌వాడకం,రసాయనాల వినియోగం,ప్రకృతిని నాశనం చేస్తున్నవి.మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు.దీనితో అసంఖ్యాక జంతు,వృక్ష జాతులు అంతరించి పోతున్నవి.

ఆధునిక మానవుని దెబ్బకు ప్రకృతి సమస్తం విలవిలలాడి పోతున్నది.విశ్వాన్నంతటిని నియంత్రించగలను అనే అహంకారం ఆధునిక మానవుడు నరనరాన జీర్ణించుకున్నాడు.కానీ ప్రాకృతిక ప్రపంచంలో,గృహ సంబంధమైన జీవావరణ వ్యవస్థలో తాను కూడా భాగమే అన్న విషయం మరచిపోయాడు. ఈ జీవావరణ వ్యవస్థలో సమతుల్యత కొనసాగించడం గురించి,శాంతియుత సహజీవనం గురించి,సర్వజీవరాశులను గౌరవించాల్సిన ఆవశ్యకతను గురించి ప్రకృతి మనకు అద్భుత మైన పాఠం చెప్తున్నది.మానవుడు చరాచర ప్రకృతిలో ఒక భాగం.ప్రకృతి శక్తి ముందు మానవ శక్తి పరిమితం అయినా మనిషి స్వార్ధంతో ప్రకృతిపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.క్షణికమైన సుఖాల కొరకు తరతరాల ప్రకృతిని విధ్వసం చేస్తున్నాడు.ఎప్పటికైనా మనిషి ఈ ప్రకృతిలో అంతర్భాగమై అందరితో సమానంగా జీవించాలి,మరణించాలి.ఏ మనిషి ప్రకృతికి అతీతం కాదు.ఈ సృష్టి శాశ్వతం,మనం ఈ సృష్టికి అతిధులం మాత్రమే.ఉన్నన్ని రోజులు సృష్టి లోని అందాలను ఆస్వాదించి,తరువాతి తరానికి జాగ్రత్తగా అందించాలి.సమస్త జీవ కోటితో సృష్టిని సమిష్టిగా పంచుకోవాలి. మానవుల చర్యలవల్లనే ఎన్నో జీవులు అంతరించే దశకు,అరుదైన జాబితా లోకి చేరుతున్నాయి. గతంలో జంతువుల జనాభాలో మానవులు ఒక శాతం మాత్రమే కాగా నేడు 32 శాతం    మేరకు అరణ్యాలలో ఉండే జంతువులను తన ఆహారం కొరకు మానవుడు హరిస్తున్నాడు.అరణ్యేతర జంతువులలో 67 శాతం  మనిషికి ఆహారం అవుతున్నవి.ఈ భూమిని సారవంతంగా,నివాస యోగ్యంగా మలచిన అనేక జీవజాతులను నాశనం చేస్తున్నాడు మానవుడు. అడవులను నాశనం చేస్తున్నాడు.వాటిని పొలాలుగా, నివాస స్థలాలుగా మారుస్తున్నాడు.33 శాతం  అడవులు ఉండవలసిన దేశంలో 21 శాతం నకు మించి లేవు.సగటున రోజుకి 333 ఎకరాల అటవీ భూమి అదృశ్యమై పోతున్నట్లు సర్వేలు చెప్తున్నవి. విచక్షణారహితంగా అటవీ సంపదను ధ్వంసం చేయడం వలన వర్షా భావ దుర్భర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి.అడవులు క్షీణించడంతో భూగోళం అగ్ని గోళంగా మారుతున్నది. మానవ చర్యల వలన గాలి కాలుష్యం అవుతున్నది. గాలి కాలుష్యం వలన ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియజేస్తోంది. ముఖ్యంగా కరోనాపై పోరులో ఆక్సిజన్‌ ‌ది  కీలక పాత్ర అని చెప్పవచ్చు.వైరస్‌ ‌మన శరీరంలోని రక్తంలోని ఆక్సిజన్‌ ‌సరఫరాను అడ్డుకొని,కీలక అవయవాలకు ప్రాణ వాయువు అందకుండా చేయడం వలన కరోనా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మన శరీరంలో కరోనాను జయించడానికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంతో పాటు స్వచ్చమైన ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తున్నది.ప్రాణవాయువు కొరకు మొక్కలు నాటి సహజ వాతావరణంలో జీవించాలి.మనం నివసించే ప్రాంతాలను ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలుగా మార్చుకోవడమే ప్రస్తుతం మన కర్తవ్యంగా భావించాలి.  తెలంగాణా ప్రభుత్వం హరితహారం పేరుతో ఆరేళ్లక్రితం ఒక మహోజ్వల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో ముందుకుపోతున్నది. అడవుల విస్తీర్ణం పెంపు కొరకు పటిష్ట కార్యాచరణతో ముందుచూపుతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. పచ్చదనం -జలం లేనిదే పర్యావరణం లేదు. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటిలభ్యత తగ్గిపోతున్నది.నదులు, బావులు, చెరువులు,భూగర్భ జలాలు రసాయన,పారిశ్రామిక వ్యర్ధాలతో విషతుల్యమవుతున్నవి.దేశంలో కలుషిత నీటివలన ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారని నీతి ఆయోగ్‌ ‌గణాంకాలు తెలియజేస్తున్నవి.పరిస్థితిలో మార్పులు రావాలంటే నీటి పొదుపు సంరక్షణా చర్యలు చేపట్టాలి.
కరోనా వైరస్‌ ‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన సుదీర్ఘ లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా మానవ కార్యకలాపాలు,పారిశ్రామిక వ్యర్ధాల విడుదల ఆగిపోవడంతో గంగా ,యమునా నదులు స్వచ్ఛంగా మారిన విషయం మన కళ్ళ ముందే సాక్షాత్కరించింది. గాలి ఎంత శుభ్రపడకపోతే దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత పంజాబ్‌ ‌లోని జలంధర్‌ ‌నుండి హిమాలయాలను చూడగలుగుతున్నాము. కాలుష్యాన్ని తట్టుకోలేక బడులు మూసేసిన ఢిల్లీ నగరం లాక్‌ ‌డౌన్‌ ‌లోనిర్మలమైన నగరాన్ని,స్వచ్ఛమైన గాలిని అస్వాదించింది. ప్రకృతిని రక్షించేందుకు వాతావరణాన్ని ఎంత నిర్మలంగా ఉంచాలో కరోనా వైరస్‌ ‌వల్ల ఏర్పడిన పరిస్థితులు మనకు చూపించినవి.వన్యమృగాలు హాయిగా ఉండాలంటే వాతావరణం ఎలా ఉండాలో తెలియజేసింది. అనావశ్యక సంచారాన్ని కట్టడి చేసింది.వాహనాల నియంత్రణ వల్ల విషవాయువుల ఉద్గారాలు తగ్గిపోయి ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో కళ్ళకు చూపించింది.మనుషుల జోక్యం లేకపోతే ప్రకృతి ఎంత సహజంగా,అందంగా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి కావాలి? ఈ భూమి మన సొంతం కాదని మరెన్నో జీవరాశులు దాన్ని పంచుకుంటున్నాయని  కరోనా పరిస్థితులు మనకు  గుర్తు చేస్తున్నాయి.కరోనా వైరస్‌ ‌సంచారంతో మనుషుల సంచారం తగ్గిపోయింది. దానితో పెట్రోల్‌,‌డీజల్‌ ‌వాడకం చాలా తగ్గిపోయింది.డిమాండ్‌ ‌తగ్గిపోవడంతో చమురు ఉత్పత్తి,బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. ఫలితంగా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకు అడ్డుకట్ట పడినట్లయింది.
జీవ వైవిధ్యానికి ఎక్కడా  నష్టం వాటిల్లకుండా ప్రకృతి పట్ల జవాబు దారితనంతో మానవుడు నడుచుకోవాలి. మనిషి పలు వ్యాధులు, కాలుష్యం లేకుండా జీవించాలంటే పర్యావరణానికి పునరుజ్జివం పోయాలి. భూమి, నీరు, మొక్కలు, జీవులను కాపాడుకోవాలి. మానవుడు ప్రకృతిని  జయించాలని వెడితే అది తిరగబడి తన ఆధీనంలోకి తీసుకుంటుందని కరోనా మహమ్మారి మనకు చెప్తున్న పాఠం.మానవుడు చేసే ప్రకృతి విధ్వంసం భవిష్యత్‌ ‌తరాలకు శాపంగా మారుతుందనే విషయం మరువరాదు.ఇలాగే విధ్వంసం కొనసాగిస్తే భావితరాల వారికి మనం ఎలాంటి ప్రకృతిని అందివ్వబోతున్నామని ఆత్మ విమర్శ చేసుకోవాలి ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పాలి. ప్రకృతిని  మనం ఎంతగా ప్రేమిస్తే ప్రకృతి అంతగా మనకు ఆయురా రోగ్యాలను ప్రసాదిస్తుంది అనే విషయం మరువ రాదు. మనం బ్రతకాలంటే ముందు ప్రకృతిని పరి రక్షించు కోవాలన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రకృతి విధ్వంసానికి చరమగీతం పా డకపోతే మనం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది..’’ ప్రకృతి పరిరక్షణ మనందరి భాద్యత.

pulluru venu gopal
పుల్లూరు వేణు గోపాల్‌, 9701047002

Leave a Reply