సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి లేఖ
కొరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కొరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. చావు దుఃఖంలో ఉన్నా వారి కుటుంబానికి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్టాల్రలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని చెప్పారు.
కొరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయన్నారు. నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇతర రాష్టాల్రను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి.. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ప్రైవేట్ ఆసుపత్రులో ఉచిత వైద్యం చేయించాలని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.