కాంగ్రెస్‌లో ‘ఐ’క్యమత్యం
దుబ్బాకలో పకడ్బందీ వ్యూహంతో ప్రచారం
కొట్టొచ్చినట్టు కనబడుతున్న టాగూర్ మార్క్
శ్రేణుల సంతోషం
కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపులు, వర్గాలు…ఆధిపత్య పోరు..తిట్టుకోవడాలు, కొట్లాటాలు..అసమ్మతీ, అసంతృప్తులు.. ఎవరికీ వారే యమునా తీరు అన్నట్లుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ‘ఐ’ ఉన్నప్పటికీ నేతల్లో ఐక్యమత్యం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ గ్రూపులు, వర్గాలు, కొట్లాటలు పక్కనబెట్టారు. అందరూ ఏకతాటిపైకి వచ్చారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ నేతలందరూ ఎంతో క్రమశిక్షణతో సర్వశక్తులొడ్డుతున్నారు. తమకు అప్పగించిన పనిని ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంతో క్రమశిక్షణతో బుద్ధిగా పని చేస్తున్న కాంగ్రెస్ నేతలను చూసి ఔరా! వీళ్లు కాంగ్రెస్ నేతలేనా అని ముక్కున వేలు వేసుకుంటున్న వాళ్లూ లేకపోలేదు. ఐక్యమత్యంగా ఉంటూ, టీం వర్క్ చేస్తున్న తమ నాయకులను చూసిన పార్టీ శ్రేణులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా కాంగ్రెస్‌లో ఎలాంటి లొల్లులు లేవు. పంచాయితీలు అసలే లేవు. ఎవరి హోదాకు తగ్గట్టుగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. దీనికంతటికి కారణం లేకపోలేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా పార్టీ జాతయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడుకు చెందిన మాణికం టాగూర్ రావడమే.
దుబ్బాక ఉప ఎన్నికల వేళ…కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా పేరున్న మాణికం టాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమించడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలా మార్పులు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఆరితేరిన మాణికం టాగూర్ దుబ్బాక బై పోల్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకలును పరుగులు పెట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి నియోజకవర్గంలోని ఉన్న 146గ్రామాలకు గానూ ప్రతి గ్రామానికి పార్టీ రాష్ట్రస్థాయి నాయకుడిని ఇంఛార్జిగా నియమించారు. ప్రతి మండలానికి ఎంపి, మాజీమంత్రి, ఎమ్మెల్యే, మాజీ ఎంపి స్థాయి లీడర్లను ఇంఛార్జులుగా నియమించారు. నియోజకవర్గంలో 146గ్రామాలుండగా 261పోలింగ్ బూతులున్నాయి.
ఒక్కో పోలింగ్ కేంద్రానికి పార్టీ నియమించిన ఇంఛార్జితో పాటు పోలింగ్ కేంద్రానికి చెందిన 30మందిని ఎంపిక చేశారు. పార్టీ నియమించిన పార్టీ గ్రామస్థాయి ఇంఛార్జి, పోలింగ్ కేంద్రానికి చెందిన ఎంపిక చేసిన 30మందితో పాటు మండల ఇంఛార్జిగా నియమించిన నేతను సమన్వయపరుస్తూ.. పార్టీ ప్రణాళికను సమర్థంగా అమలు పరిచేలా పర్యవేక్షించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, గత నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసిన టాగూరే స్వయంగా మండలాల వారీగా, బూతుల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాడు. మెజారిటీ బాధ్యతలను ఇంఛార్జిలపైనే పెట్టిన టాగూర్..టీం వర్క్‌గా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నాడు. టాగూర్ తన మొదటి పర్యటనలోనే దుబ్బాక ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా…ప్రస్తుతం దుబ్బాకలోనే ఉంటూ.. నియోజకవర్గంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎలాగైనా ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉండటమే కాకుండా, గెలుపు కోసం ఆదిశగా వ్యూహాన్ని రూపొందించే పనిలో టాగూర్ నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.