Take a fresh look at your lifestyle.

ఆచార్యుడు, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి: డాక్టర్ సర్వేపల్లి

‘ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠాలతోపాటు బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్షంగా దేశంపైన ప్రగాఢంగా ప్రభావం చూపుతుంది. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.‘‘చక్రవర్తి థార్మిక తత్త్వవేత్త అయి వుండాలన్నది గ్రీకు తత్త్వవేత్త ప్లాటో ఆశయం’’. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య భారతదేశానికి డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌రాష్ట్రపతి కావడంతో ప్లాటో ఆశయం కొంతవరకు నెరవేరినట్లే. ఆచార్యుడుగా, విద్యావేత్తగా, రాయబారిగా, రాజనీతిజ్ఞుడుగా, రచయితగా, అసమాన తత్త్వవేత్తగా ప్రపంచ ఖ్యాతినందిన మహాపురుషుడు రాధాకృష్ణన్‌. ‌భారత దేశం గర్వించదగిన ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు, గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్‌..’

ప్రపంచ దేశాల మత, సామాజిక సాంస్కృతిక రాజనీతి శాస్త్ర సాహిత్యాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న మహామేధావి రాధాకృష్ణన్. నేటి వైజ్ఞానిక యుగంలో, భౌతిక విజ్ఞానాన్నీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ సమన్వయపరుస్తూ దేశ విదేశాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ మేధావుల ప్రశంసలను చూరగొన్నాయి. ప్రత్యేకించి వేద వాఙ్మయాన్ని మధించి శోధించి సాధించిన జ్ఞానామృతాన్ని తనదైన వ్యాఖ్యానాలతో పామరులకు సైతం అర్ధమయ్యేట్లు అందించారు. ఉపనిషత్తులపై, భగవద్గీతపై భారతీయ పురాణేతిహాసాలను తత్త్వశాస్త్ర సంపుటాలుగా ప్రచురించి ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు వివిధ భాషల్లోకి. డాక్టర్ సర్వేపల్లి ఎన్నిహోదాలలో విధులు నిర్వర్తించినా, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయునిగా, విద్యావేత్తగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆయనను గౌరవించుకునే రీతిలో ఆయన పుట్టిన రోజు, సెప్టంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినంగా పాటిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి యేటా సత్కరించుకునే కర్తవ్యాన్ని ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠాలతోపాటు బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్షంగా దేశంపైన ప్రగాఢంగా ప్రభావం చూపుతుంది. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

“చక్రవర్తి థార్మిక తత్త్వవేత్త అయి వుండాలన్నది గ్రీకు తత్త్వవేత్త ప్లాటో ఆశయం”. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య భారతదేశానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కావడంతో ప్లాటో ఆశయం కొంతవరకు నెరవేరినట్లే. ఆచార్యుడుగా, విద్యావేత్తగా, రాయబారిగా, రాజనీతిజ్ఞుడుగా, రచయితగా, అసమాన తత్త్వవేత్తగా ప్రపంచ ఖ్యాతినందిన మహాపురుషుడు రాధాకృష్ణన్. భారత దేశం గర్వించదగిన ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు, గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 ,సెప్టంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తణి లో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి వీరాస్వామయ్య తహశీల్దార్. తల్లి సీతమ్మ. ఆయన పాఠశాల విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరులో సాగింది. మాతృభాష తెలుగు. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీనుండి ఏం.ఏ పట్టా పొందారు. బాల్యం నుండే అసాధారణ మైన తెలివితేటలు కల్గివుండేవారు 18 సంవత్సరాల చిన్నవయసులో ఆయనకు 1906లో శివకామమ్మతో వివాహం జరిగింది. ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో సీటు వచ్చినా,ఇంగ్లండ్ వెళ్ళి చదివేందుకు డబ్బులేక మానుకొన్నారు. 1909 లో 21 సం. వయస్సులో కుటుంబాన్ని పోషించేందుకు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఆసిస్టంట్ లెక్చరర్ గా ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అదే ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కాలంలో ఉపనిషత్తులు, భగవద్గీత , బ్రహ్మ సూత్రాలు, బౌద్ధ,జైన మత గ్రంథాలు బాగా అధ్యయనం చేశారు. వీటితోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాలను, ఆంగ్లసాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి ఆంగ్లభాష పైన, తత్వశాస్త్రంపై మంచి పట్టు సాధించారు.

ఈయన ప్రతిభను గుర్తించి మైసూరు విశ్వవిద్యాలయం 1918లో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా నియమించింది. రాధాకృష్ణన్ ప్రసంగాలు విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకొనేవి . విద్యార్ధుల పట్ల ప్రేమ, వాత్సల్యం కల్గి వుండేవారు. 1921 లో అశుతోష్ ముఖర్జీ , రవీంద్రనాథ్ ఠాగోర్ ఆహ్వానంపై కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేరారు. మైసూర్ యూనివర్సిటీ లో ఘనంగా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పడానికి విద్యార్ధులు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన ఇంటిముందు గుర్రపు బండి సిద్ధంగా వుంది. బండికి కట్టిన గుర్రాలను తొలగించి, రైల్వేస్టేషన్ దాకా బండిని విద్యార్ధులే లాక్కొని వెళ్లారు. అది విద్యార్ధులలో ఆయన పట్ల ఉన్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల అభిమానానికి రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనాడు గురుశిష్యుల హృదయాను బంధం ఆవిధంగా ఉండేది. 1931లో బ్రిటీషు ప్రభుత్వపు ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది. 1931 లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉన్న రోజుల్లో ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం వ్రాసి పాశ్చాత్య పండితుల ప్రశంసలు పొందారు. దీనితో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిప్లేక్సన్, రికవరీ ఆఫ్ ఫేత్, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్,దిహిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈ స్టెర్న్ రెలిజిన్స్ అండ్ వెస్టర్న్ థాట్ ఆయన రచనలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పై వెళ్ళి ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలలో ప్రాచ్యతత్వ శాస్త్రం పై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అదే సంవత్సరంలో లో నానాజాతి సమితి ఇంటలెక్చువల్ కొ ఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు. 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వం 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు ఈయనను అధ్యక్షునిగా నియమించింది. 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 1946 లో భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1949 లో ఉన్నతవిద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి రాధాకృష్ణన్ నాయకత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నికయ్యారు.

1952 నుండి 1962 వరకు భారత తొలి ఉపరాష్ట్రపతి గా పదవినలంకరించారు. బాబు రాజేంద్రప్రసాదు తర్వాత 1962 నుండి 1967 వరకు రెండవ భారత రాష్ట్రపతి గా పదవిని చేపట్టారు. 1954 లో భారతరత్న పురస్కారం లభించింది. 1961లో జర్మనీ పుస్తక సదస్సు నుంచీ శాంతి బహుమానం పొందారు. 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి మొదలైన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచీ వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేట్‌లు పొందారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిఫ్ ప్రకటించింది. 1956 లో భార్య మరణించింది. వీరికి సంతానం అయిదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. శేష జీవితం మద్రాస్ లోని స్వంత ఇంట్లో గడుపుతూ 1975 ఏప్రిల్ 17 న పరమపదించారు.

సర్వమానవ సౌభ్రాతృత్వంకోసం, స్వేచ్ఛా సమానత్వాలకోసం నిబద్ధతతో అంకితభావంతో ఆయన చేసిన విశిష్ఠ సేవలు సమున్నత వ్యక్తిత్వానికి దర్పణాలు. రాధాకృష్ణన్ ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేదు. సంభాషణల్లో ఎవరినీ నొప్పించిన ఘటనలు లేవు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. ఆయన గాంభీర్యం, హుందాతనం చూసి అపరిచితులు తొలుత ఆయనను పలకరించడానికి జంకేవారు. తదుపరి పసిబిడ్డవంటి మృదుమధుర స్వభావాన్ని చూసి విస్తుపోయేవారు.
నందిరాజు రాధాకృష్ణ
98481 2821

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply