కమిటీల పేరుతో కాలయాపన
చిత్తశుద్ది ఉంటే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి
టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్
ఉద్యోగాల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలాడుతోందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ఇప్పటికే ఆరేళ్లుగా నిరుద్యోగులను వంచించిన సర్కార్ మరోమారు నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తోందని అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ప్రస్తుతం 34 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని వివరించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందనే నమ్మకం తమ పార్టీకి లేదని కోదండరామ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలఖారులోపే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని, మార్చి లోపు పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురవడంతోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే కొత్త పీఆర్సీ రావాల్సి ఉండగా ఇంకా.. పాతది కూడా అందలేదన్నారు. ప్రభుత్వానికి ఆంధ్రా గుత్తేదారుల జేబులు నింపడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై లేదని విమర్శించారు. ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా పదోన్నతులు ఇవ్వడంలేదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల బకాయిలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖాళీ పోస్టుల సమాచారం ఉన్నప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇటీవల దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ వి•ద స్పష్టత తీసుకుని రాలేదన్నారు. పాత జోనల్ విధానం ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.