Take a fresh look at your lifestyle.

తెలంగాణ మంత్రులకు ప్రొఫెసర్ హర గోపాల్ లేఖ

తీవ్ర అనారోగ్యానికి గురై ముంబై జే.జే హాస్పిటల్ చేర్పించబడి మళ్లీ తలోజ జైలుకు పంపబడిన ప్రముఖ తెలుగు కవి వరవరరావు విడుదల కోసం కృషి చేయాలని తెలంగాణ మంత్రి వర్గ సభ్యులందరికీ ప్రొఫెసర్ హరగోపాల్, నిర్బంధ వ్యతిరేక వేదిక నాయకులు లేఖ రాశారు. వరవరరావును బెయిలు లేదా పెరోలుపై విడుదల చేయాలని లేదా హైదరాబాద్ కు తరలించి హాస్పిటల్లో మంచి చికిత్స అందించాలని, తక్షణం వీడియో కాన్ఫరెన్స్ లో భార్య, కూతుళ్లతో మాట్లాడే అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఆ లేఖ పూర్తి పాఠం…
గౌరవ మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వం గారికి,
తేదీ:4-6-2020
సర్/మేడం,
విషయము÷ వరవరరావు, సాయిబాబా మరియు భీమా కోరేగావ్ కేసులో, తెలంగాణలో UAPA కింద అరెస్టు చేసిన అందరినీ విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి.
ప్రజాస్వామిక ఆలోచనలను, భావ వ్యక్తీకరణను, నిరుపేదలు, ఆదివాసీలు, దళితులు, మహిళలపై ప్రతినిత్యం కొనసాగుతున్న వేధింపులను వ్యతిరేకించడాన్ని, ప్రశ్నించడాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమాత్రమూ సహించట౦ లేదు. సంఘాలు ఏర్పరుచుకుని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఏ చిన్న ఆందోళనలనైనా అనేక ఆంక్షలతో నిరోధిస్తున్నారు. ప్రజా ఉద్యమాల కార్యకర్తలను, ప్రజాస్వామిక ఆకాంక్షలకు, ప్రజల జీవన పరిస్థితులు మార్పు కోసం కట్టుబడి పనిచేసే మేధావులను, ప్రజాస్వామిక వాదులను అక్రమకేసుల్లో ఇరికించి, కటకటాల వెనక్కి నెట్టేసి వాళ్ళ ఆరోగ్యాలను, వయసును, కోవిడ్-19 పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోకుండా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.
గత మూడేళ్లుగా ప్రొ. జి.ఎన్. సాయిబాబా జీవిత ఖైదీగా అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక, ఒంటరిగా, కదలలేని అంగవైకల్యంలో తోడ్పడే సహాయకులు లేక, క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లిని కనీసం ఒకసారి చూసే అవకాశం లేక ఒంటరి సెల్లో నిర్బంధంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బెయిల్ కోరినా, పెరోల్ కోరినా ప్రభుత్వమే వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. తెలుసుకునే అవకాశాలే లేవు.
గత 18 నెలలుగా విప్లవ కవి, విరసం వ్యవస్థాపకులలో ఒకరు అయిన పి వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్నారు. తొలుత పూణే ఎరవాడ జైల్లో ఉంచారు. అటునుండి ముంబై తలోజా జైలుకు తరలించారు.80 సంవత్సరాలు పైబడిన వయసులో అసౌకర్యాల జైలులో ఒంటరి సెల్ లో ఉంచారు. వివి అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కానీ, ఫోన్ లో నైనా మాట్లాడగల అవకాశంకానీ కల్పించడం లేదు. అలాగే బీమా కోరేగావ్ కేసులో అక్రమ నిర్బంధంలో ఉన్న మరో పదిమంది ఖైదీల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వీరెవరికీ కోవిడ్ విపత్తు లోనైనా, అనారోగ్య పరిస్థితుల రీత్యా నైనాబెయిల్ రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటున్నది.
ప్రొ.జి.ఎన్.సాయిబాబా విషయంలో, భీమా కోరేగావ్ పేరిట బనాయించిన అక్రమ కేసు నిర్బంధితుల విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున స్పందించారు. అయినా భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామికంగా మానవీయంగా కాకపోయినా కనీసం రాజ్యాంగబద్ధంగా కూడా ప్రతి స్పందించలేదు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపా(UAPA) చట్టం తీసుకు వచ్చింది. ఆ చట్టానికి ప్రస్తుత భాజపా ప్రభుత్వం మరికొన్ని కఠినమైన సవరణలు చేర్చింది. దేశవ్యాప్తంగా ఊపా చట్టాన్ని ప్రజాస్వామికవాదులు పై, ఉద్యమకారులపై ప్రయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్ర సాధన కృషిలో క్రియాశీలంగా పనిచేసిన, తెలంగాణ రాష్ట్రంలో బాధితులకు న్యాయం కోసం గొంతు విప్పుతున్న ప్రజాసంఘాల కార్యకర్తలపై ఊపా కేసులు బనాయిస్తున్నది. 99 మంది ప్రజాసంఘాల కార్యకర్తలపై 255 కు పైగా కేసులు—ఒక్కొక్కరి పై ఒకటి, రెండు నుంచి ఐదారు కేసుల దాకా బనాయించిoది.17 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలామంది గత కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్నారు.
ప్రజాస్వామిక వాదులను అర్బన్ నక్సలైట్లుగా సంబోధించడం, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించడం, కేసులు బనాయించడం, అన్ని కేసుల్లోనూ సాధారణ విషయమై పోయింది. ప్రపంచంలో కోవిడ్-19 కలిగిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. కోవిడ్-19 బారిన లక్షలలో ప్రజలు చనిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకుండా అడ్డుకోవడం, విచారణ కాలాన్ని సైతం శిక్షాకాలంగా అమలు చేయటం జీవించే హక్కును భంగ పరచడమే. NIA పరిధిలో వరవరరావు కేసు ఉన్నదనే కారణంగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఫోన్లో కూడా కుటుంబ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని కల్పించడం లేదు.
డిమాండ్లు:
◆ పూర్తి అంగవైకల్యంతో సహాయకులు లేకుండా గడపలేని స్థితిలో ఉన్న ప్రొ. జిఎన్ సాయిబాబాను వెంటనే పెరోల్పై విడుదల చేసి, క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లిని చూసే అవకాశం, కొవిడ్-19 బారినుండి కాపాడుకునే అవకాశం కల్పించాలి.
◆ ముంబై తలోజ జైల్లో ఉన్న వరవరరావు తన కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశాన్ని తక్షణమే కల్పించాలి.
వరవరరావు ఆరోగ్య పరిస్థితులను, 80 సంవత్సరాలు పైబడిన వయసును పరిగణించి, తక్షణం బెయిలుపై విడుదల చేయాలి.
కోవిడ్-19 విపత్తు బారిన పడకుండా వరవరరావును ముంబై నుండి హైదరాబాద్ కు తరలించి, ఇక్కడి హాస్పిటల్లో చికిత్స అందించాలి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
◆ భీమా కోరేగావ్ పేరిట బనాయించిన అక్రమ కేసు నిర్బంధితుగా ఉన్న సుధీర్ ధావలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రావత్, రోనా విల్సన్, వెర్నాన్ గొన్జ్వాలెజ్, సుధా భరద్వాజ్, సోమాసేన్, అరుణ్ ఫెరేరా, ఆనంద్ తెల్ తుంబ్డే,గౌతమ్ నవలఖా లకు బెయిలు మంజూరు చేసి, విడుదల చేయాలి.
◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంఘాల కార్యకర్తలపై, ప్రజాస్వామికవాదులపై బనాయించిన UAPA కేసులను వెంటనే ఎత్తివేయాలి. నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేసి విడుదల చేయాలి.
◆ ప్రజాస్వామికమైన రాజ్యాంగబద్ధమైన హక్కులను భంగపరిచే అప్రజాస్వామిక ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి
కావున పై విషయాల పై రాష్ట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకొనే ట్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులుగా స్పందించగలరని ఆశిస్తున్నాము.
కృతజ్ఞతలతో,
ప్రొ.జి.హరగోపాల్,కన్వీనర్
ప్రొ.జి లక్ష్మణ్,
ఎం.రాఘవాచారి
ఎస్.అనిత,
కె. రవిచందర్
కో- కన్వీనర్స్

Leave a Reply