సిఎం సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే
ఆచార్య బియ్యాల జనార్ధన్‌రావు ఆశయాల్లో ప్రధానమైన తెలంగాణ రాష్ట్ర సాధన నెరవేరిందని భౌతికంగా ఆయన లేకున్నా ఆయన స్పూర్తి కొనసాగుతుందని అయితే ఆయన ఆశయ సాధన ఏ మేరకు జరిగిందో విశ్లేషణ జరగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో గురువారం 18వ ఆచార్య బియ్యాల జనార్ధన్‌రావు మెమోరియల్ లెక్చర్ ‘ఐదేండ్లలో సాగునీటి రంగం’ అనే అంశం రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం అధ్యక్షతన జరిగింది. శ్రీధర్‌రావు దేశ్‌పాండే కీలకోపన్యాసం చేస్తూ తెలంగాణ రాకపూర్వం మనం నీళ్ళ దోపిడీపై శ్రద్ధ చూపలేదని, కేవలం ఉద్యోగాలు, నిధులపై శ్రద్ధ వహించామని ఎప్పుడైతే మన చెరువులు విధ్వంసం ప్రారంభమైందో సాగునీటి నిర్మాణాలు జరుగలేదో, వ్యవసాయం సంక్షోభానికి గురి కాబడి వలసలు, ఆత్మహత్యలు ప్రారంభం కాగానే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందన్నారు. 1996లో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 80శాతం తెలంగాణ రైతులు అప్పులు, వలసలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. దీంతో నీరే తెలంగాణ ఉద్యమానికి ప్రధాన అంశం అయ్యిందని, దీనిపై ఆచార్య జయశంకర్, ఆచార్య జనార్ధన్రావులు ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రంలో 33వేల చెరువులు, 12లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని ఆ కాలంలో నవాబ్ అలీ జంగ్ బహదూర్ కీలకపాత్ర వహించారన్నారు. 1965 టిఎంసిల వినియోగానికి ప్రణాళికలు రూపకల్పన జరిగాయని 40లక్షల ఎకరాల ఆయకట్టుకు రూపకల్పన చేసినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అవి బుట్టదాఖలయ్యాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు విధ్వంసం కావద్దని అద్భుత సాంకేతికత ప్రక్రియ, ముందు చూపు మన తెలంగాణ చెరువుల నిర్మాణమని కాకతీయులు గొప్ప దార్శనికులని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అంతా నీటి వినియోగంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారని ఎంతో మేధోమదనం జరిగిందని తెలంగాణ ఆత్మ చెరువులేనని అన్నారు. 306 కిలోమీటర్లు కృష్ణానది ప్రవహిస్తున్నా మహబూబ్‌నగర్ జిల్లా కరువు జిల్లాగా ప్రజలు వలసలకు ఉమ్మడి రాష్ట్రంలో పోయే వారని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజన్‌గా మారబోతుందన్నారు. ఐదేండ్లలో సాగునీటిలో ప్రగతి మనముందు ఉందని తెలంగాణ భూగర్భ జలాల మట్టం పెరుగుదల కూడా ఉందన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు బండా ప్రకాష్ మాట్లాడుతూ ఇప్పటి తరం ఆచార్య జనార్ధన్‌రావు సేవలు తెలుసుకోవాలని ప్రతిభకు తెలుగు మాధ్యమం, గ్రామీణ ప్రాంతం అడ్డు కాదని బియ్యాల గొప్ప మానవతావాది అని సమాజంలో నీళ్ళపై చర్చ జరుగాలని ప్రజలను చైతన్య పర్చడంలో ముందున్నారన్నారు. ఆచార్య కె.సీతారామారావు, ఆచార్య కె.మురళీ మనోహర్‌రావు, ఆచార్య రేవతి ప్రసంగించారు. ఈ సందర్బంగా శ్రీధర్‌రావు దేశ్‌పాండేను సన్మానించారు. జనార్ధన్‌రావు మెమోరియల్ ఫౌండేషన్ బాధ్యులు, విశ్రాంతాచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.