Take a fresh look at your lifestyle.

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత ప్రియంవద

“పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావిత మైనారు. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమ బాట పట్టారు. 1952లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో పిడిఎఫ్‌ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. మహిళా హక్కుల సాధన, బాల్య వివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారు. మహిళల కూలీరేట్ల పెంపు కోసం ఆమె రాజీలేని పోరాటం సాగించి, పెద్ద రైతు కుటుంబ నేపథ్యం కలిగిఉన్న అర్ధశేరు వడ్లు మాత్రమే ఉండే రోజు కూలీని, రెండుశేర్ల వడ్లు కూలీగా ఇప్పించారు.”

నేడు దాయం ప్రియంవద వర్ధంతి

హైదరాబాద్‌ ‌సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ ‌నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా. కూడా పిలుస్తారు. నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా తెలంగాణ సాయుధ పోరాటం పురుడు పోసుకుంది. వెట్టి చాకిరి, భావ వ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృ భాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు పోరాటానికి నేపథ్యంగా నిలిచాయి. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం దక్షిణాసియాలో, భారత దేశంలో స్వాతంత్య్రాన ంతరం జరిగిన తొలి సాయుధ రైతాంగ తిరుగు బాటుగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఆ విధంగా అది ఎన్నో సాయుధ పోరాటాలకు, ఉద్యమాలకు ఈ పోరాటం స్ఫూర్తి దాయకంగా నిలిచింది.

నిజాం నిరంకుశ పాలనకు, దొరల, భూస్వాముల, దేశముఖ్‌ ‌దోపిడీకి, అణిచివేతకు, హింసకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటమిది. దేశంలోనే తొలిసారిగా భూ సమస్యను బలంగా ముందుకు తెచ్చి భూ సంస్కరణల చట్టానికి నాంది పలికిన పోరాటమిది. తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ‌జిల్లాలో ప్రతిపల్లె, ప్రతి గడప సాయుధ పోరులో మమేకమైనవే. దొడ్డి కొమరయ్య అమరత్వం నుంచి ప్రారంభమైన పోరులో వేలాదిమంది పోరాట యోధులను నిజాం పోలీసులు, రజకార్లు, భూస్వాములు, గుండాలు హత మార్చిన హృదయ విదారక నేపథ్యం.

ఈ పోరాటం మామూలు వ్యక్తి నుండి మేధావుల వరకు ఆడమగ తేడా లేకుండా ఎందరినో కదనరంగం లోకి ఆకర్షించింది. అలాంటి వారిలో దాయం ప్రియంవద ఒకరు.దాయం ప్రియంవద (1928 – ఆగస్టు 3, 2013) తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన మహిళ. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాయం రాజిరెడ్డి సోదరి. భీమిరెడ్డి నరసింహారెడ్డి, శశిరేఖ, మల్లు స్వరాజ్యం తదితర ఉద్యమ కారులంతా ప్రియంవద సమీప బంధువులు. నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం వెంపటి సమీపంలోని తూర్పుగూడెంలో 1928లో లక్ష్మమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు ఆమె జన్మించారు. ప్రియంవదది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. రష్యన్‌ ‌సాహిత్యం, గోర్కి నవలలు, రెండో ప్రపంచ యుద్ధం గురించి వెలువడిన పుస్తకాల పట్ల ఆసక్తిని కలిగి చదవడం వల్ల నాటి సమకాలీన పరిస్థితిని ఒంట పట్టించు కున్నారు.

సుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటంలో కాలూనారు. 1943 సంవత్సరంలో 15ఏళ్ళ వయసు లోనే అన్న రాజిరెడ్డితో కలిసి ఖమ్మం ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దాయం రాజిరెడ్డి లతో కలిసి సూర్యాపేట ప్రాంతంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. గెరిల్లా సైనికురాలిగా ఆయుధం పట్టడానికి ముందు ఆమె విజయవాడలో ఆత్మరక్షణ, ఆయుధశిక్షణ పొందారు. సాయుధ పోరాటంలో గాయపడ్డ యోధులకు వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఆరోగ్యసేవిక (నర్సింగ్‌) ‌ట్రైనింగ్‌ ‌పొందారామె. పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావిత మైనారు. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమ బాట పట్టారు. 1952లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో పిడిఎఫ్‌ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. మహిళా హక్కుల సాధన, బాల్య వివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారు. మహిళల కూలీరేట్ల పెంపు కోసం ఆమె రాజీలేని పోరాటం సాగించి, పెద్ద రైతు కుటుంబ నేపథ్యం కలిగిఉన్న అర్ధశేరు వడ్లు మాత్రమే ఉండే రోజు కూలీని, రెండుశేర్ల వడ్లు కూలీగా ఇప్పించారు.

ఆంధ్రమహాసభలు వరంగల్‌, ‌ఖమ్మంలో జరిగిన తర్వాత అన్న రాజిరెడ్డిను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా నియమించారు. ఇబ్బందుల్లో ఉన్న రాజిరెడ్డికి తోడుగా కొలనుపాక జైన మందిరంలో నడిపే స్కూలులో యాభై రూపాయల జీతంతో టీచర్‌గా చేరారు. అక్కడ ఒక సంవత్సరంపాటు పనిచేశారు. ఆసమయంలో వీరి కుటంబంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో 1944లో విజయవాడ వెళ్లారు. అక్కడ జరిగిన అఖిలభారత కిసాన్‌ ‌మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ గ్రామాలకు వెళ్లి తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆడవాళ్లలో చైతన్యం కలిగించారు. నల్గొండ జిల్లాలో పలు గ్రామాల్లోతిరిగి, పోరాట వ్యూహాల గురించి సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు, వాటిని ఎదుర్కొనే పద్దతులను గురించి, ఉత్తేజ ప్రసంగాల ద్వారా వివరించే ప్రయత్నాలు చేశారు. చదువు విషయంలో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు పాఠాలు చెప్పారు.

ఊళ్ళల్ల రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో అమ్మను, నాన్నను చూసేందుకు సొంతూరుకు వెళ్ళిన విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి సమయంలో స్టేషనుకు, ఆపై తుంగతుర్తి క్యాంపుకు, తర్వాత సూర్యాపేటకు, చివరకు హైదరాబాద్‌ ‌తరలించి, చంచల్‌గూడ జైల్లో బంధించారు. మూడు నెలల తర్వాత బయటికి జైలు నుంచి వచ్చిన ఆమె ఆయుధాలు పట్టి కాల్చడం నేర్చుకున్నారు. దళంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగా మాత్రమే సహాయం అందించారు. మరోసారి స్వంత ఇంటిలో అరెస్టయి సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌జైలుకు, ఆనంతరం వరంగల్‌ ‌జైలుకు పంపబడ్డారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ‌జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. ఎంచుకున్న లక్ష్య సాధన కోసం ఆమె వివాహం చేసుకోక ఒంటరిగానే బతికారు. ఉద్యమ రోజుల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా గడిపిన ఆమె చివరి రోజుల్లో ప్రజా జీవితానికి దూరంగా జీవిస్తూ 2013, ఆగస్టు 3 న తుది శ్వాస విడిచారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply