Take a fresh look at your lifestyle.

ప్రైవేటీకరణ పరిష్కారం కాదు… విశాఖపై పునరాలోచన చేయాలి

‌నాలుగు రంగాలు మినహా ఇతర రంగాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు అప్పగిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. వ్యాపారం చేయడం ప్రభుత్వం పనికాదనీ, ప్రభుత్వం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది కానీ, వ్యాపారం చేయదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నవరత్నాల పేరిట తొలి ప్రధాని పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఏర్పాటు చేశారు. వాటిని దేశానికి పెద్ద అసెట్‌ అనేవారు. అలాగే. నాగార్జునసాగర్‌, ‌భాక్రానంగల్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినప్పుడు వాటిని ఆధునిక దేవాలయాలుగా వర్ణించారు. కాలం మారింది. మనుషులు మారినట్టే ప్రభుత్వాల ప్రాధాన్య క్రమాలు మారాయి. ఇప్పుడు ప్రభుత్వం వ్యాపారం చేయదని ప్రధాని చెబుతున్నా పక్కా వ్యాపార ధోరణిలోనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నష్టాలపై యూపీఏ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు.

నరేంద్రమోడీ మొదటి నుంచి నెహ్రూ విజన్‌ ‌వ్యతిరేకతే తన విధానంగా అమలు జేస్తున్నారు. పంచవర్ష ప్రణాళికలను అటకెక్కించారు. ప్రణాళికా సంఘం స్థానే నీతీ ఆయోగ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అదెలా పని చేస్తుందో తరచూ వార్తలు వొస్తున్నాయి. నీతి ఆయోగ్‌ ‌సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయడం లేదనీ, వాటిలో తమకు అనుకూలంగా ఉన్న వాటినే ఎంచుకుంటోందని వార్తలు వొచ్చాయి. అలాగే, ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రాజెక్టులను సైతం ప్రైవేటీకరిస్తామంటూ మోడీ చాలా స్పష్టంగా చెప్పారు. సెంటిమెంట్‌, ‌చారిత్రక సంపద అనే అంశాలతో పని లేదు. ప్రభుత్వం నడపగలదా లేదా అన్నదే ప్రామాణికతగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆయన ఏ పరిశ్రమ గురించి చెప్పారో కానీ, తెలుగు రాష్ట్రాలలో మీడియా ముఖ్యంగా, న్యూస్‌ ‌చానల్స్ ‌విశాఖ ప్రైవేటీకరణ అంశంపై ఫోకస్‌ ‌చేసి పుంఖానుపుంఖాలుగా గోష్టులు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ గోష్టులన్నీ రాజకీయ కోణంలోనే సాగుతున్నాయి. ఆంధప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ అసమర్ధత వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుగు దేశం సానుభూతిపరులు, ఆ భావజాలం గలవారూ విమర్శిస్తున్నారు.

వాస్తవానికి ఇది విధాన నిర్ణయమని ప్రధాని చాలా స్పష్టంగా చెబుతున్నప్పుడు ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో ఆరోపణలు గుప్పించడం సమంజసం కాదు. తెలుగుదేశం హయాంలోనే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకుందని వైసీపీ నాయకులూ, శ్రేణులూ ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో నష్టాలు లేకుండా ఎలా నడపవొచ్చో ప్రధాని మోడీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్‌ ‌సవివరంగా తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీకి కావల్సిన ఇనుప ఖనిజాన్ని సేకరించేందుకు సొంతంగా ఇనుప గనులను కేటాయించాలని సూచించారు. ఉక్కుఫ్యాక్టరీకి అదనంగా గల భూములను విక్రయించి అప్పులు తీర్చవొచ్చని సూచించారు. ఈ సూచనలపై కూడా తెలుగు దేశం వారు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఉక్కుప్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉంది. ఉవ్వెత్తున సాగిన ప్రజా ఉద్యమం కారణంగా ఈ ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. ఏ ఒక్కరి వల్లో కాకుండా అన్ని పార్టీలూ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆనాటి విశాఖ ఎంపీ తెన్నెటి విశ్వనాథం నాయకత్వంలో అలుపెరుగని పోరాటం సాగించారు.

- Advertisement -

దాని ఫలితంగానే ఏర్పడింది. ఇది చరిత్ర అయితే, ప్రధానమంత్రి మాటల్లో వారసత్వ ప్రాజక్టులను నష్టాలతో ఎల్లకాలం కొనసాగించలేమని అన్నారు. ఉక్కుఫ్యాక్టరీకి నష్టాలు రావడానికి ప్రభుత్వం లోతైన విచారణ జరిపిస్తే ప్రభుత్వ నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం డొంక కదిలించడం ఇష్టం లేక సాకులు చెబుతోంది. మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలన్నీ ఉత్తరాది వారికి ప్రత్యేకించి గుజరాత్‌ ‌వారికి లాభం చేకూర్చేందుకేనన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో అసత్యం లేదనిపిస్తోంది. నోట్ల రద్దు విషయాన్నే తీసుకుంటే దాని వల్ల ఎక్కువ ప్రయోజనం పొందినది గుజరాత్‌ ‌వజ్రాల వ్యాపారులన్న విషయమై కథనాలు వెలువడ్డాయి. అలాగే, జిఎస్‌టీ వల్ల కూడా పెద్ద వ్యాపారులకే లాభం జరిగింది. మోడీ సామాన్య , మధ్యతరగతి వర్గాల కష్టాలను దృష్టిలో పెట్టుకోవడం లేదు. మోడీ భారీ పరిశ్రమలు, కార్పొరేట్‌ ‌వర్గాల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వొచ్చాయి.

ఉక్కు ప్యాక్టరీని కారు చౌకగా అమ్మేయాలని చూస్తే మరో మహోద్యమం తప్పదని ఇప్పటికే అఖిల పక్ష కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. గనులు కేటాయించినా నష్టాలు వొస్తే ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకున్నా ఎవరూ తప్పు పట్టరు. అసలు ఆ ప్రయత్నమే చేయకుండా అమ్మేస్తామంటే ఎవరి ప్రయోజనం కోసమనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా మోడీ విశాఖ వంటి పేరున్న సంస్థల ప్రైవేటీకరణ ఆలోచనకు స్వస్తి చెప్పి, వాటిని బతికించేందుకు ఆలోచనలు చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది. దేశంలో పెట్టుబడుదారులకు కాకుండా విదేశాలకు విక్రయించాలన్న ఆలోచన పుండుమీద కారం చల్లినట్టు ఉంది. అందువల్ల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని మోడీ గ్రహించాలి. దీనిపై పునరాలోచన చేయాలి.

Leave a Reply