Take a fresh look at your lifestyle.

బ్యాంకుల విలీనం కన్నా ప్రైవేటీకరణ మేలు

ప్రధాని  నరేంద్రమోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాన్ని రాజకీయవేత్తలే కాకుండా, ఆర్థిక రంగంలో పేరొందిన నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఎవరి సలహాలనూ, సూచనలనూ పాటించకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థికరంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.    తాజాగా ఇప్పుడు బ్యాంకుల విలీనం నిర్ణయాన్ని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్లు తప్పు పట్టారు. బ్యాంకుల విలీనం వల్ల దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలతో పెనవేసుకున్న అనుబంధాన్ని బ్యాంకులు కోల్పోవల్సి వొస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలుగు నాట ఆంధ్రా బ్యాంకును యూనియన్‌ ‌బ్యాంకులో విలీనం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. బ్యాంకుల విలీనం కన్నా, కొన్ని బ్యాంకులను కొంత కాలం ప్రైవేటు రంగానికి అప్పగించడం మేలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌దువ్వూరి సుబ్బారావు అన్నారు. అలాగే, బ్యాంకులు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నా, ప్రయోజనం కనిపించడం లేదని చివరికి అవి విదేశీ సంస్థల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉందని మరో ఆర్థిక నిపుణుడు హెచ్చరించారు.   బ్యాంకుల్లో సామాన్యులు దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందనీ, రైతులు, బలహీనవర్గాలకు సాయం అందించడంలో  మీమాంస ప్రదర్శిస్తున్న ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల కార్పొరేట్‌ ‌సంస్థల రుణాలను మాఫీ చేసిందంటూ కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ చేసిన ఆరోపణను కొట్టివేయడానికి వీలు లేదు. అలాగే, రిజర్వు బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరిగిన తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు వొచ్చిందంటూ ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ఆరోపించారు.

ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం తీవ్రమైన వొత్తిడి తెచ్చింది. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత మరో పర్యాయం కొనసాగుదామని అనుకున్నా, ప్రభుత్వం జోక్యం కారణంగానే పూర్వపు ఉద్యోగానికి వెళ్ళిపోయారు. అలాగే, బ్యాంకులు స్వతంత్రంగా పని చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని మరో మాజీ గవర్నర్‌  ‌వైవి రెడ్డి అన్నారు. ఆయన కూడా ప్రభుత్వ జోక్యం ఎక్కువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని మెరుగు పర్చలేకపోవడానికి కారణం రుణాలు వసూళ్ళ విషయంలో బ్యాంకులు స్వతంత్రంగా పని చేయలేకపోతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కార్పొరేట్‌, ‌పారిశ్రామిక సంస్థల యజమానుల్లో ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండేవారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వొచ్చాయి. అయితే, రాహుల్‌ ‌గాంధీ వంటి రాజకీయ నాయకులు బ్యాంకు రుణాల ఎగవేతల గురించి మాట్లాడితే ఇదంతా మీరు చేసిన నిర్వాకమేనంటూ ఒక్క మాటతో వారి నోరు మూయించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. ఆయన అధికారంలోకి వొచ్చిన తర్వాత నీరవ్‌ ‌మోడీ, చోక్సీ, తదితర ఎగవేతదారుల గురించి మాట్లాడరు.

నిజానికి అప్పట్లో భారీ ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసిన వారంతా దేశంలోనే ఉన్నారు. మోడీ హయాంలో ఎగవేతదారుల జాబితాలో కొత్తగా చేరిన వారు విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు. వారిని రప్పించడం ప్రభుత్వానికి అసాధ్యం అవుతోంది. ఆర్థిక రంగంలో ప్రభుత్వం తన వైఫల్యాలను అంగీకరించేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా లేరు. ఆయన ఎంత సేపు బీహార్‌ ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ అవినీతిని గురించి మాత్రమే పదే పదే ప్రస్తావించారు. లాలూ అవినీతి ఆధారాలు దొరకడం వల్లనే జైలులో పెట్టారు. వీలైనంత మేరకు ఆస్తులను ఎటాచ్‌ ‌చేశారు. విదేశాల్లో ఉన్న రుణాల ఎగవేత దారుల సొమ్మును వసూలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వివరించడం లేదు. స్విస్‌ ‌బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలో ప్రతిపౌరునికీ 15 లక్షల చొప్పున పంపిణీ చేస్తానంటూ ఆరున్నర ఏళ్ళ క్రితం చేసిన వాగ్దానాన్ని మోడీ నిలబెట్టుకోలేదు. అలాగే,  పూర్వపు ప్రభుత్వాల హయాంలో  వేల కోట్లరూపాయిల కుంభకోణాలకు పాల్పడిన వారి నుంచి డబ్బు వసూలు చేయలేదు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ రుణాలనూ, ప్రభుత్వ నిధులను కొల్లగొట్టిన వారు బీజేపీలో చేరగానే రక్షణ పొందుతున్నారు. ఎక్కడైనా ఆర్థిక శాఖ దాడులు నిర్వహించిందంటే వారంతా మోడీ ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన వారేనని అర్థం చేసుకోవచ్చు.

విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తామని గతంలో  అదే పనిగా ప్రకటించి విదేశ యాత్రలు చేసిన మోడీ కొరోనా కారణంగా ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. ఇప్పుడు ప్రతి దేశమూ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో బ్యాంకులు స్వతంత్రంగా పని చేయడానికి వీలు కల్పించాలన్న ఆర్థిక నిపుణుల సూచన పరిశీలనార్హమే. ప్రస్తుతం   విదేశాల నుంచి నిధులు సేకరించే అవకాశాలు లేవు. ప్రైవేటు రంగంలో ఉన్నప్పుడే బ్యాంకులు బాగా పని చేశాయి. ఉదాహరణకు ఆంధ్రాబ్యాంకు, కెనరా, సిండికేట్‌, ‌తదితర బ్యాంకులు లాభాలను ఆర్జించేవి. స్థానిక నాయకుల పలుకుబడి, చొరవతో ఏర్పడిన బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ముకు  బ్యాంకుల విలీనం వల్ల నష్టం జరుగుతుందేమోనన్న భయాందోళనలు  వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక, ఒక్కొక్క ప్రైవేటు బ్యాంకుకీ ఒక్కో చరిత్ర ఉంది. విలీనం వల్ల ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందనీ, బ్యాంకుల పేర్లు ప్రజల స్మృతి పథం నుంచి తొలగిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వానికి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. దీనిపై పునరాలోచన చేయాలన్న ఆర్థిక నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.

Leave a Reply