Take a fresh look at your lifestyle.

ప్రైవేటు హాస్పిటల్సా … దోపిడి కేంద్రాలా..?

“ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌పై ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోసడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషల్‌ అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు మన ప్రభుత్వం కూడా నియమించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఆపత్కాల పరిస్థితులలో ప్రైవేటు హాస్పిటల్స్ ‌ను స్వాధీనం చేసుకున్నారు. మన రాష్ట్రంలో సగం పడకలు ప్రభుత్వం స్వాధీనం చేసి వాటిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చికిత్స అందించేందుకు దఫాలుగా ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ , ‌ప్రభుత్వం చర్చలు జరిపినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. వాటిని వెంటనే స్వాధీనపరచుకొని చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి.”

‘అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు..
నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కు..
నేను పోను బిడ్డో లంచాల దవాఖానకు.’.

అని ఆనాటి ప్రభుత్వదవాఖానల దుస్థితిని వివరిస్తూ ఓ సినీ కవి రాశారు. ఆ పరిస్థితులు నేడు తలక్రిందులయ్యాయనిపిస్తున్నది. మెరుగైన చికిత్స కోరి కొరోనా రోగులు ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌లో చేరితే, అవేమో, లక్షలాది రూపాయల చార్జీలు వసూలు చేస్తూ… చివరకు బంధువులకు శవాన్ని అప్పగిస్తున్న దయనీయ పరిస్థితుల్లో…..

నేను ఫోను బిడ్డో ప్రైవేటు దవాఖానాకు
నేను రాను బిడ్డో ధరల హాస్పిటల్కి
నేను పోను బిడ్డో గండాల దవాఖాన కి
లక్షలాది రూపాయలు గుంజుతూండ్రు
లక్షణంగా పైకి పంపుతున్నారు

నేను పోను బిడ్డో మోసాల దవాఖాన కి

వద్దు వద్దు తల్లో గొప్పోళ్ళ దవాఖానకు…
అని పాడుకునే పాడు రోజులు దాపురించాయి..

కొరొనా మహమారి విజృంభణ తో మానవాళి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని, ఆర్థికంగా, ఉపాధి పరంగా , ఆరోగ్యపరంగా ప్రజలు ప్రాణాలు గుప్పి పెట్టుకుని రోజులు లెక్కించుకుంటున్న వేళ, ప్రజారోగ్యాన్ని పాలకులు గాలికి వదిలి వేయడంతో ప్రజలు దిక్కుతోచకున్నారు. మూడు వందల మందికి వైరస్‌ ‌వచ్చినపుడు దేశం యావత్తు అకస్మాత్తుగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించిన ప్రభుత్వాలు, కొరోనా ఉదృతిని అరికట్టడంలో ఘోరంగా విఫలమై,మన దేశం ఈరోజు బ్రెజిల్‌ ‌ను దాటి రెండవ స్థానానికి ఎగబాకింది. వైరస్‌ ‌సోకిన వారు పేదవారైనా ధనవంతులైన ప్రభుత్వ హాస్పిటల్‌ ‌గాంధీ దవాఖాన లో చేరి చికిత్స పొందాలని, అందుకు ఏర్పాట్లు చేశామని, కొరోనా కట్టడి కి వెయ్యి కోట్లు ఖర్చు పెడతామని ప్రభుత్వం చెప్డం మినహా క్రియా శూన్యం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సిబ్బంది ,వసతులు, పి పి కిట్లు లేక పనిచేస్తున్న అరకొర సిబ్బందికి వైరస్‌ ‌సోకింది. వారితోపాటు పనిచేసే సిబ్బంది హోం క్వారంటైన్కు వెళ్లడంతో సకాలంలో చికిత్స అందించే పరిస్థితులు కరువయ్యాయి. వైరస్‌ ‌తీవ్రతతో రోగులు చనిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ ఉధృతివవలన ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి పెరగి రాష్ట్రంలో 150 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్‌ ‌చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కొరనా వైద్య వ్యాపారం ఊపందుకుంది. ప్రజలలో కొంతమందికి లక్షణాలు, కనపడక పోయినా భయంతో నాణ్యమైన చికిత్స అందుతుందని ప్రైవేట్‌ ‌హాస్పిటళ్ళ వైపు పరిగెత్తడంతో ఇదే అదునుగా భావించి యాజమాన్యాలు లక్షలాది రూపాయలు దండుకుంటున్నాయి. హైదరాబాద్‌ ‌బడా కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌నిలువు దోపిడీకి అద్దం పట్టే అమానవీయ సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.

మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా నివాసి ఒక గ్రూప్‌ -2 ఉద్యోగిని నిండు గర్భిణి ఒకరోజు స్వల్పంగా జ్వరం వస్తే మహబూబ్‌ ‌నగర్‌ ‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌వెళ్ళి చూపిస్తే మందుబిళ్లలు ఇచ్చి పంపారు. తర్వాత కోసిగి హాస్పిటల్‌ ‌లో చూపినా తగ్గలేదు, తిరిగి మహబూబ్‌ ‌నగర్‌ ‌ప్రైవేట్‌ ఆస్పత్రికి కాన్ఫు కోసం వెళ్లగా, దగ్గు వస్తున్నందున కోవిడ్‌ ‌పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్‌ ‌వచ్చింది. అయినా స్థానికంగా చేర్చుకోకపోవడంతో కాన్పు కోసం హైదరాబాద్‌ ఓ ‌బడా హాస్పిటల్‌ ‌కు తీసుకెళ్తే వారు చెప్పినట్లు సిజేరియన్‌ ‌కోసం వెంటనే ఆమొత్తం చెల్లించారు. సిజేరియన్‌ అనంతరం మగ బిడ్డ జన్మించాడు. రెండు రోజుల తర్వాత ఆమెకు కొద్దిగా ఆయాసం రావడం తో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ ‌వచ్చింది అని చెప్పి ఆమెను ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌కు తరలించారు. ఈ క్రమంలో రోజుకు లక్షన్నర చొప్పున కట్టించుకుంటూ ఇరవై రోజుల పాటు చికిత్స కొనసాగించిన క్రమంలో పేషెంట్‌ ‌తరపు బంధువులు ఆందోళనకు గురై ఆమెను చూపించాలని పట్టుబట్టడంతో పిపీ ఈ కిట్‌ ‌ధరింపజేసి ఐసియుకి తీసుకెళ్ళి చూపించారు. ఆ సమయంలో బాలింత ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేదు. ఆరోగ్యం మెరుగు పడకపోగా పూర్తిగా క్షీణించింది. ఆమె తరపు బంధువులు ఏమేమి చికిత్స అందించారో , అందిస్తున్నారో , వివరాలు తెలపాలని వేరేచోట డాక్టర్ల అభిప్రాయం తీసుకుంటామని అడుగగా మరుసటి రోజు మృతి చెందినట్లు చెప్పి శవాన్ని అందించారనీ బంధువులు ఆరోపించారు.

29 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆమె మరణించడం విషాదకరం…. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ ‌ఫిజికల్‌ ‌డైరెక్టర్‌ ఒకరి ఇంటి పక్క వారికి కోవిడ్‌ ‌రాగా తాను కూడా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ ‌వచ్చింది . ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడే. రెండు మూడు రోజుల్లో పట్టణంలో ఏరియా హాస్పిటల్‌ ‌క్వారంటైన్‌ ‌లో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం బడా కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌కు తరలించారు. నాలుగు రోజులు ఆక్సిజన్‌ ‌మీద ఉంచి , అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించిందని చెప్పి ఐసీయూ కు తరలించి రోజుకు లక్షా 70 వేల రూపాయలు కట్టించుకుంటూ 12 రోజులు చికిత్స అందిస్తున్న క్రమంలో ఎటువంటి మెరుగుదల లేదని చెబుతూ మభ్యపెట్టారు. చివరకు మరణించారని తెలిపారని బంధువులు ఆరోపిస్తున్నారు. .అదేవిధంగా ఒక కుటుంబంలో ముగ్గురికి కరోనా చికిత్స అందించిన ఓ హాస్పిటల్‌ 60 ‌లక్షలు వసూలు చేసింది. మరో కొరోనా రోగి ఒకరు విశ్వ నగరంలోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌లో చేరగా 45 రోజులు చికిత్స చేసి 41 లక్షల రూపాయల బిల్లు కట్టించుకున్నారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు…. కొరోనా రోగుల ను లూటీ చేస్తున్న ఈ ప్రైవేటు హాస్పిటల్స్ ‌ను నియంత్రించ లేరా ?? ప్రభుత్వాలు, ఇన్‌ ‌కమ్‌ ‌టాక్స్ అధికారులు అదుపు చేయలేరా? అని ప్రజలు ప్రశ్నించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 248 జూన్‌ 15‌న జారీచేసి ఐసోలేషన్‌ ‌లో రోజుకు నాలుగు వేలు , ఆక్సిజన్‌ ‌పై 7500, వెంటిలేటర్‌ ‌పై9000 , 14 రోజులపాటు ఉంటే లక్ష రూపాయలు , ఆక్సిజన్‌ ‌బెడ్స్ ‌పై రెండు లక్షల రూపాయలు , వెంటిలేటర్‌ ‌పై మూడు నుండి నాలుగు లక్షల వరకు మాత్రమే చార్జి చేయాలని అంతకు మించి వసూలు చేయరాదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది . కానీ ఈ జివో ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రైవేట్‌ ‌చికిత్సకి వెళ్లి అప్పులపాలై, చివరకు కొందరు శవాలుగా మారుతున్నారు. ప్రైవేట్‌ ‌దవాఖానాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సూచించారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

హాస్పిటల్సల్ ‌లో చేరిన రోగులకు అవసరం ఉన్నా లేకున్నా రక రకాల పరీక్షలు చేయడం , అవసరం లేని మందులు రాయడం , మామూలు చికిత్స అందిస్తే రోగం నయం అయ్యే అవకాశం ఉన్న ఇంటెన్సివ్‌ ‌కేర్‌ ‌యూనిట్‌ ‌కి తరవించి డబ్బులు దండుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్‌ ఉం‌డాలి అని సూచించింది .మన దేశంలో 11 వేల మందికి ఒక డాక్టర్‌ ఉన్నారు. వైద్య రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది . డాక్టర్ల కొరత వల్ల పేషంట్ల బిల్లులు పెరుగుతున్నాయి. డాక్టర్లు అందుబాటులో లేరు అని చెప్పి చికిత్స వాయిదా వేసి బిల్లులు పెంచుతున్నారు. ప్రజల బలహీనతలను మానసిక , ప్రాణపాయస్థితిని ఆసరాగా చేసుకుని ఆసరాగా చేసుకుని అధికంగా వసూలు చేస్తున్నాయి. ఆసుపత్రులు వేసే అదనపు బిల్లులను అడ్డుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌పై ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోసడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషల్‌ అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు మన ప్రభుత్వం కూడా నియమించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఆపత్కాల పరిస్థితులలో ప్రైవేటు హాస్పిటల్స్ ‌ను స్వాధీనం చేసుకున్నారు. మన రాష్ట్రంలో సగం పడకలు ప్రభుత్వం స్వాధీనం చేసి వాటిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చికిత్స అందించేందుకు దఫాలుగా ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ , ‌ప్రభుత్వం చర్చలు జరిపినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. వాటిని వెంటనే స్వాధీనపరచుకొని చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కొరోనా చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి. దారిద్ర రేఖ దిగువన ఉన్న పేద ప్రజలు ప్రైవేట్‌ ‌లో చికిత్స చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి సౌకర్యాన్ని కల్పించాలి. ఉద్యోగులకు పెన్షనర్లకు క్యాష్‌ ‌లెస్‌ ‌ట్రీట్మెంట్‌ అం‌దించడానికి కొరోనాను ఇహెచ్‌ఎస్‌ ‌పరిధిలోకి తీసుకురావాలి.

ప్రభుత్వ రంగంలో ఉన్న దవాఖానాలకు అన్ని హంగులు, సౌకర్యాలు, సిబ్బంది నియామకాలు , పరికరాలు ,భౌతిక వసతులు కల్పించడానికి తగిన బడ్జెట్‌ ‌కేటాయింపులు చేయాలి. ప్రజలు అధైర్య పడకుండా, వైరస్‌ ‌సోకిన వారిని చిన్నచూపు చూడకుండా పూర్తిగా వెలి వేయకుండా , వైరస్‌ ‌తో బాధపడుతున్న వారిని కృంగిపోకుండా చేయూతను అందించి సహకరించాలి. ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్‌ ‌లు గా ఉన్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ ‌సిబ్బందికి తగిన రక్షణ కవచాలు అందించాలి, వ్యాక్సిన్ల తయారీకి నిరంతర ప్రక్రియగా పరిశోధన జరిపించాలి .అందుకు తగ్గ వసతులను ప్రభుత్వాలు కల్పించాలి.

thanda sadhanandham
తండ సదానందం
9989584665.

Leave a Reply