- పాత ఫీజలు కోసం పట్టుబడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
- దోస్త్ ఆడ్మిషన్ల కోసం సర్టిఫికెట్లు ఇవ్వకుండా పేచీ
హైదరాబాద్, ఆగస్ట్ 2 : కొరోనా పేదలు, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేస్తున్నా..ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం ఫీజల బరువును మోయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా తమ ఫీజులు క్రమం తప్పకుండా చెల్లించాల్సిందే అన్నరీతలో ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో బరువు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రులపైనే ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..ఇంటర్మీడియట్ ఫీజుల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం ఫీజును మాత్రమే వసూలు చేయాలని.. కేవలం ట్యూషన్ఫీజు మాత్రమే అది కూడా నెలవారిగా మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కానీ, ఇంటర్మీడియట్ ఫీజుల విషయంలో మాత్రం ఇంటర్మీడియట్ బోర్డుగానీ, ప్రభుత్వంగానీ ఫీజుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదే అదునుగా ప్రైవేటు కళాశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఆన్లైన్ తరగతులకే విద్యార్థుల నుంచి రూ.లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. లేందటే లాగిన్ అడ్రస్ లేకుండా చేస్తున్నాయి. విద్యాసంస్థలను తెరిచేదానితో సబంధం లేకుండా మొత్తంగా ఫీజులు రాబట్టే పనిలో పడ్డాయి. దీనిని బట్టి ప్రైవేటు కళాశాలల తీరు ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రస్తుత కొరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఫీజులు తీసుకుంటున్నప్పటికీ కళాశాలల్లో మాత్రం అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఎపితో పోలిస్తే తెలంగాణలో విచ్చలవిడితనం విపరీతంగా ఉంది.