Take a fresh look at your lifestyle.

జన జీవితాల గోప్యతకు గండం

ఇందుగలడందు లేడను సందే హం బొలదన్నట్లుగా ….మన సందేహాలకు సమాధానాలిచ్చే సకల విజ్ఞాన సమాహారంలా అంతర్జాల మాయాజాలం మనముందు సాక్ష్యాత్క రిస్తున్నది. టి.విలు, మొబైల్‌ ‌ఫోన్లు, కంప్యూటర్లు సాంకేతిక రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్నే మార్చేసింది. సాంకేతిక సాధనాల వలన ప్రపంచంలో జరిగే సమాచారమంతా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమోతున్నది.  విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ సాంకేతిక విప్లవం మన జీవితాల్లో ఒక భాగమై పోయింది.అయితే సాంకేతిపరిజ్ఞానాన్ని సరైన దారిలో నడిపించకపోతే లాభాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి. విద్యతో వివేకాన్ని పెంపొందించుకోవచ్చు- అహంకారాన్ని అలవరచుకోవచ్చు. అలాగే సాంకేతిక విద్యా నైపుణ్యంతో నిర్మాణాత్మకమైన ఆలోచనలను పెంపొందిం చుకోవచ్చు – విధ్వంసానికీ వినియోగించవచ్చు. మన ఆలోచనా విధానంలోనే సర్వం ఇమిడిఉన్నది.

సద్వినియోగం తో అభివృద్ధిని పెంపొందించవచ్చు-దుర్వినియోగంతో పతనాన్ని కొని తెచ్చుకోవచ్చు. తాను చెడిందే కాకుండా ఇతరులను చెడగొట్టడానికి కూడా సాంకేతిక విద్య నేడు అందుబాటులో ఉంది.నేటి యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. విజ్ఞానాన్ని వినాశనానికి, వ్యక్తిగత, సామాజిక పతనానికి, వినియోగించడం దారుణం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగ పడుతున్నది. క్షణాలమీద పనులన్నీ జరిగిపోతున్నాయి. గతంలో తంతితపాలా ద్వారా సమాచారాన్ని అందించడానికి  వారాలతరబడి ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు చరవాణి ఆ పరిస్థితిని తారుమారు చేసి, సత్వరమే మన సందేశాలను ఇతరులకు చేరవేసే సౌలభ్యం ఏర్పడింది. ప్రమా దాలకైనా, ప్రమోదాలకైనా చరవాణి వినియోగం తప్పనిసరైనది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం తో మానవ మేథస్సుకు పదును పెట్టడం తగ్గిపోయింది. ఆలోచనా విధానం మారిపోయింది.

పుస్తకపఠనం తగ్గిపోయి, అంతర్జాల విన్యాసం పెరిగి పోయింది. వాట్సప్‌, ‌ఫేస్బుక్‌, ‌ట్విట్టర్ల వాడకం పెరిగింది. మంచి కోసం ఉపయోగపడవలసిన సాంఘిక మాధ్యమాలు దుర్వినియోగానికి దారితీస్తున్నాయి. అన్ని రంగాలలోను ఈ సాంకేతిక విప్లవ పైశాచికత్వం కట్టలు తెంచుకుని కరాళనాట్యం చేస్తున్నది. విద్యాధికులు కూడా సాంఘిక మాధ్యమాలను దుర్వినియోగపరచడం సభ్యతకు తిలోదకాలివ్వడమే.ఇక విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం. తినడం,తాగడం కూడా వాట్సప్‌,‌ఫేస్బుక్‌ ‌స్టేటస్లుగా పెట్టడం విడ్డూరం. మేకప్‌ ‌లతో,డాన్సులతో,అర్దనగ్న  విన్యాసాలతో చిరునవ్వులు చిందిస్తూ అదే తమ స్టేటస్‌ ‌కు సింబల్‌ ‌గా భావిస్తూ స్టేటస్‌ ‌లు పెట్టడం వలన దేశానికి ఏమి ప్రయోజనం? పిల్లికి భిక్షం పెట్టని వారంతా  కేవలం గ్లామర్‌ ‌ను తమ స్టేటస్‌ ‌లో పెట్టడం,వెకిలి నవ్వులతో, చిరాకు తెప్పించే విన్యాసాలకోసం సాంఘిక మాధ్యమాలను వినియోగించడం సిగ్గుచేటు.

అశ్లీలతను ఆనందిస్తూ,అదే  జీవితమనే భ్రమలో బ్రతుకుతూ చాలా మంది విద్యార్థులు, యువతీ యువకులు బద్దకస్తులుగా, సోమరిపోతుల్లా మానసిక రోగుల్లా తయారౌతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక రంగంలో వస్తున్న  వికృత పోకడలపై మంచి- చెడు తారతమ్యం తెలిసేలా నేటి విద్యార్థులకు,యువతకు దశాదిశానిర్ధేశనం చేయాలి. సాంకేతిక విద్య నిర్మాణాత్మక మైన కార్యక్రమాలకే గాని నైతిక విలువల విధ్వంసానికి వినియోగించరాదనే సత్యాన్ని విశదీకరించాలి.సాంకేతిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూనే, దీనివలన తలెత్తిన దుష్ఫరిణామాలకు దూరంగా ఉండాలి.మానసిక వికాసాన్ని అందించకుండా,మొద్దుబారిన మెదళ్ళను తయారు చేస్తున్న సాంకేతిక మార్పులను కొంత వరకు  త్యజించి, సాంకేతిక రంగంలోని సవ్యమైన విధానాలను మాత్రమే అనుసరిస్తూ గ్రంథ పఠనానికే నేటి యువత అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి. గ్రంథపఠనం వలన మన ఆలోచనా గవాక్షాలు తెరుచుకుంటాయి. మంచి,చెడుల  విచక్షణ తెలుసుకునే మార్గం సుగమమౌతుంది.

ఆలోచనకే తావులేని మరబొమ్మలుగా,తోలు బొమ్మలుగా తైతక్కలాడించే నేటి సాంకేతిక వ్యవస్థలో మనహృదయాలు సైతం మొద్దుబారిపోతున్నాయి.విచక్షణా నేత్రాలు మసకబారిపోతున్నాయి. వివేకం అడుగంటి,వినయం,సంస్కారం ఆలోచనాజ్ఞానం నశింపుతో సమాజంలో అత్యల్ఫస్థాయిలో  మిగిలున్న సంబంధబాంధవ్యాలు సైతం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిపోయాయి.మనిషిలో ఆలోచన రావాలి. అందుకు మంచి పుస్తకాలు చదవాలి. గ్రంథ పఠనానికి పూర్వవైభవం రావాలి. ఇంటర్నెట్‌ ‌లో లభించే సమాచారం లోని విశ్వసనీయతను పరిశీలించాలి. ఇంటర్నెట్‌ ‌సమాచారాన్ని గుడ్డిగా నమ్మకూడదు. పఠనా పటిమను పెంపొందించాలి.నేటి యువతకు, విద్యార్ధికి గ్రంథ పఠనం పై ఆసక్తిని కలిగించాలి. సాంకేతిక విప్లవంతో పుస్తక పఠనానికి  తిలోదకాలివ్వడం  క్షేమదాయకం కాదు. సాంకేతిక రంగంలో సంభవిస్తున్న పరిణామాలు  చరవాణి నెత్తిన పన్నీరై, యువత చెడు దారుల్లో పయనిస్తున్న సంక్లిష్ట పరిస్థితులు
దాపురించడం శోచనీయం. సామాజిక వ్యవస్థలోని నైతిక విలువలను,మానవీయకోణాన్ని మింగేస్తున్న విషతుల్యమైన సాంకేతికత స్థానాన్ని పుస్తకపఠనం ఆక్రమించాలి.

సాంకేతిక రంగాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అసభ్యతకు,అశ్లీలతకు తావు లేని  సాంకేతిక జ్ఞానం వైపు ప్రపంచాన్ని మళ్ళించాలి. సామాజిక మాధ్యమాలు రాజకీయ కక్షలకు, వేధింపులకు కారణం కారాదు. సామాజిక మాధ్యమాల వలన వార్తాపత్రికలు కనుమరుగై పోతున్నాయి. సకల దరిద్రాలకు కారణభూతమౌతున్న మొబైల్‌ ‌ఫోన్లను కనిపెట్టినందుకు మార్టిన్‌ ‌కూపర్‌ ‌కూడా ఆందోళన చెందుతున్న వార్తలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొబైల్‌ ‌వినియోగం మన విచక్షణ మీద ఆధారపడి ఉంది. మంచికి చెడుకి మధ్య కనిపించే సన్నని గీతను అర్ధం చేసుకోవాలి. మన మనసును మనం అదుపులో ఉంచుకోవాలి.  సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి.ఇకనైనా అన్ని దేశాలు టెక్నాలజీ వాడకం విషయంలో, సోషల్‌ ‌మీడియా, యూట్యూబ్‌ ‌ఛానెళ్ళ విషయంలో కట్టుదిట్టమైన నియమ నిబంధనలు రూపొందించాలి.
 సుంకవల్లి సత్తిరాజు
సంగాయగూడెం,దేవరపల్లి మండలం,తూ.గో జిల్లా.(ఆం.ప్ర)
9704903463

Leave a Reply