Take a fresh look at your lifestyle.

‘‌ప్రింటింగ్‌’ ‌పరిశ్రమ కుదేలు ..!

  • ముద్రణా రంగంపై కొరోనా పిడుగు
  • ముద్రణా సంస్థలకు రూ.కోట్లలో నష్టం
  • ఉపాధి కోల్పోయిన వందలాది మంది కార్మికులు
  • ఇంకా విడుదల కాని పాఠ్య పుస్తకాల ముద్రణ నిధులు
  • క్యాలెండర్లు, డైరీల ముద్రణపై నిషేధంతో డోలాయమానంలో పరిశ్రమ

కొరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. దేశవ్యాప్తంగా భారీ పరిశ్రమలు మొదలుకుని చిన్న పరిశ్రమల వరకు అంతా అస్తవ్యస్తంగా మారింది. కొరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిన విధంగానే ముద్రణా రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా పేపర్‌ ఆధారంగా నడిచే ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లు ఆదాయం కోల్పోయి అసలు వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మల్టీకలర్‌ ‌ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లు, ఆఫ్‌సెట్‌ ‌ముద్రణా సంస్థల యజమానులు రూ.కోట్లలో నష్టపోయారు. దీంతో ఆ సంస్థలలో పనిచేసే కార్మికులు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కొరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ముద్రణా రంగం పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కుదుట పడుతున్న సమయంలో ఇకపై క్యాలెండర్లు, డైరీలు, ఫెస్టివల్‌ ‌గ్రీటింగ్‌ ‌కార్డులు ముద్రించరాదంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో ముద్రణా రంగ సంస్థల యజమానుల నెత్తిపై పిడుగు పడినట్లయింది. దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి విజృంభణను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విధించింది. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1000 యూనిట్ల వరకు మల్టీకలర్‌, ఆఫ్‌సెట్‌ ‌ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లకు కష్టకాలం మొదలైంది. వీటిలో దాదాపు 90శాతం ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లు హైదరాబాద్‌ ‌మహానగరంలో ఉన్నాయి.

వీటన్నింటిలో అన్ని విభాగాలలో కలిపి కనీసం 45 వేల మంది వరకూ కార్మికులు పనిచేస్తుంటారు. హైదరాబాద్‌ ‌నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, ‌లక్డీకాపూల్‌, ‌నారాయణగూడ, బల్కంపేట్‌తో పాటు ప్రతీ పారిశ్రామికవాడలోనూ చిన్న పెద్ద ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లు ఉన్నాయి. ప్రతీ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి మల్టీకలర్‌ ‌క్యాలెండర్లు, డైరీల ముద్రణకు భారీ స్థాయిలో ఆర్డర్లు వచ్చేవి. ఈ ముద్రణ పక్రియ సెప్టెంబర్‌ ‌నుంచి మొదలై దాదాపు 8 నెలల పాటు అంటే ఏప్రిల్‌ ‌వరకు కొనసాగేది. దీంతో ముద్రణా సంస్థల వ్యాపారం జోరుగా సాగేది. వీటి వల్ల ప్రభుత్వానికి సైతం గణనీయంగా ఆదాయం వచ్చేంది. అయితే, కొరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా ఒక్క హైదరాబాద్‌ ‌నగరంలోనే ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలోని కొన్ని ప్రసిద్ధ ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లకు తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాల నుంచి కూడా పాఠ్య పుస్తకాల ముద్రణకు ప్రింట్‌ ఆర్డర్‌ ‌వచ్చేవి. మరికొన్ని సంస్థలు గ్లోబల్‌ ‌టెండర్లు కూడా వేసి ఆసియా ఖండంలోని కొన్ని దేశాలలో ప్రింటింగ్‌ ‌హక్కులను కూడా దక్కించుకునేవి. దాదాపు 6 నెలల తరువాత ఇప్పుడిప్పుడే ముద్రణా రంగ ఆధారిత పరిశ్రమలు మెల్లమెల్లగా కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ ‌కంటే ముందు ఉన్న పరిస్థితితో పోలిస్తే 10 నుంచి 15 శాతం పనులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ పరిశ్రమ ఈ 6 నెలల కాలంలో చవిచూసిన నష్టం నుంచి కుదురుకుని తిరిగి గాడిన పడాలంటే ఎంత సమయం పడుతుందో కూడా తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి : రవీందర్‌రెడ్డి టీవోపీఏ అధ్యక్షుడు
లాక్‌డౌన్‌ ‌కారణంగా ముద్రణ రంగ ఆధారిత పరిశ్రమలు ఎంతో నష్టపోయాయి. దీంతో యాజమాన్యాలు కూడా రూ.కోట్లలో నష్టపోయామని తెలంగాణ ఆప్‌సెట్‌ ‌ప్రింటర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమర్షియల్‌ ‌సెగ్మెంట్‌, ఆఫ్‌సెట్‌ ‌ప్రింటింగ్‌ ‌విభాగాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. లాక్‌డౌన్‌ ‌కారణంగా ముద్రణ సంబంధిత అన్ని రంగాలకు కలిపి దాదాపు రూ. 5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో పాటు ప్రభుత్వ ముద్రణా సంస్థలను కమర్షియల్‌ ‌విభాగాల కింద పరిగణిస్తుండటంతో అదనపు భారం పడుతోంది. యూనిట్‌కు రూ. 6 కు బదులుగా రూ. 15 వరకూ విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాల్సి వస్తున్నది. గతంలో మాదిరిగా ప్రింటింగ్‌ ‌ప్రెస్‌లను మూసి వేసి ఇతరులకు విక్రయించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో రూ. కోట్లు కొనుగోలు చేసిన ప్రింటింగ్‌ ‌యంత్రాలను ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ప్రింటింగ్‌ ‌పరిశ్రమ కొరోనా కారణంగా చవిచూసిన ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ముద్రణా సంస్థలను ఆదుకోవడానికి ప్యాకేజీ ప్రకటించాలి.

పాఠ్యపుస్తకాల ముద్రణ నిధులు విడుదల చేయాలి : వెంకట్‌రెడ్డి, వెబ్‌ ఆఫ్‌సెట్‌ ‌ప్రింటర్స్ అసోసియేషన్‌ ‌ప్రతినిధి
కొరోనా కారణంగా ప్రింటింగ్‌ ‌పరిశ్రమకు తీవ్ర నష్టం మిగిల్చిందనీ వెబ్‌ ఆఫ్‌సెట్‌ ‌ప్రింటర్స్ అసోసియేషన్‌ ‌ప్రతినిధి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా గత ఆరు నెలలుగా ఆర్డర్లు లేక తీవ్రంగా నష్టపోయామనీ, భవిష్యత్తులో ఆ నష్టాలను పూడ్చుకుంటామనే భరోసా కూడా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం అనుమతితో ముద్రించిన పాఠ్య పుస్తకాలకు సంబంధించిన రూ. 20 కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పటికీ ముద్రణా సంస్థలకు చెల్లించలేదనీ, పాఠ్య పుస్తకాలను ముద్రించి ఆరు నెలలు దాటినప్పటికీ సంబంధిత నిధులు విడుదల కాకపోవడంతో ఓ వైపు ప్రైవేటు ఆర్డర్‌లు లేక మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అందక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామనీ, ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని వెంకట్‌రెడ్డి కోరారు.

 

Leave a Reply