Take a fresh look at your lifestyle.

ఈ విడ్డూరాలు మోడీ కే సాధ్యం ..!

‘‘ఈ ‌పిఎం కేర్స్ ‌సైట్‌ ‌లో ప్రధాని ఫొటోతో పాటు జాతీయ పతాకాన్నీ, భారత ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని కూడా పెట్టారు. వీటిని మించి మరోటి ఉంది..పిఎం కేర్స్ ‌సైట్‌ ‌డొమైన్‌ ‌నేమ్‌ ‌ప్రభుత్వం వాడే డొమైన్‌ ‌నేమ్‌. ‌పిఎం కేర్స్ ‌డాట్‌ ‌గవ్‌ ‌డాట్‌ ఇన్‌ అని ఉంటుంది. పిఎం కేర్స్ ‌కూ ప్రభుత్వానికీ ఏమీ సంబంధం లేకపోతే ఈ డొమైన్‌ ‌నేమ్‌ ఏమిటి..? పిటిషన్‌ ‌దారుడు కూడా ఢిల్లీ హైకోర్టులో ఆ మాటే అడిగారు..’’

గెస్ట్ ఎడిట్‌
ఆలపాటి సురేశ్‌ ‌కుమార్‌

పిఎం కేర్స్… ‌గత ఏడాది మార్పి నెలలో నెలకొల్పిన ఈ ఫండ్‌ ‌గురించి గతంలో ఒక సారి ముచ్చటించుకున్నాం. మరోసారి దీని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవరికన్నా పొరపాటున దీని గురించి తెలియకపోతే అలాంటి వారి కోసం ఒకసారి వివరణ ఇస్తాను. పిఎం అంటే ప్రైమ్‌ ‌మినిస్టర్‌.. ‌ప్రధానమంత్రి…! పిఎం కేర్స్ అం‌టే ప్రధానమంత్రి మీ బాగోగులు పట్టించుకుంటారు అని. ఈ ఫండ్‌ ‌పూర్తి పేరు.. prime minister’s citizen assistance and relief in emergency situations,, ఇంగ్లీషు పదాలను చాలా జాగ్రత్తగా ఏర్చి కూర్చిన ఈ పొడవాటి పేరును పొట్టి చేస్తే పిఎం కేర్స్ అవుతుంది. అహర్నిశలూ ప్రధానమంత్రికి మీ ఆలోచనే అని దేశ ప్రజలకు చెప్పడం కోసం నరేంద్ర మోదీ మేనేజర్లు ఈ పేరు ఎంపిక చేశారు. పెట్టిన దగ్గర నుంచీ దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఖాతరు చేసేది ఎవరు..?

నరేంద్ర మోదీ సర్కారు విమర్శలను ఖాతరు చేసే దశ దాటిపోయింది. ఇప్పుడు తాజాగా పిఎం కేర్స్ ‌ప్రభుత్వ నిధి కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అపిడవిట్‌ ‌దాఖలు చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఒక అండర్‌ ‌సెక్రటరీ స్థాయి అధికారి పిఎం కేర్స్ ‌వ్యవహారాలు చూస్తుంటారు. ఆయన ఈ అఫిడవిట్‌ ‌దాఖలు చేశారు. ఈ అవసరం ఎందుకు వచ్చిందంటే పిఎం కేర్స్ ‌ను భారత ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ సమ్యక్‌ ‌గంగ్వాల్‌ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం కుదరదు పొమ్మంది. అంటే..భారత ప్రభుత్వం కన్నా.. రాజ్యం కన్నా ప్రధానమంత్రి స్థాయి ఎక్కువని వారు భావిస్తున్నట్లేగా.. వారు భావిస్తున్నట్లు మనం భావించడంలో తప్పు లేదుగా..!

1948లో నెలకొల్పిన ప్రైమ్‌ ‌మినిస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫండ్‌ ఇం‌కా మనుగడలోనే ఉంది. అది ఎక్కడికీ పోలేదు. ప్రకృతి ఉత్పాతాలు వచ్చినపుడు తృణమో పణమో దానికి విరాళాలు ఇవ్వడం మనకు అలవాటు. ఈ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ హయాంలో నెలకొల్పారు. అది ఉండగా ప్రధాని పేరుపై మరో సహాయ నిధి అక్కర్లేదు. అయితే నెహ్రూ..నెహ్రూ కుటుంబం అంటే మోదీకి చెప్పరానంత ద్వేషం కాబట్టి బహుశా ఆ సహాయ నిధి అంటే కూడా ఆయనకు గిట్టక పోయి ఉండవచ్చు. సరే బాగానే ఉంది..తాను ఏర్పాటు చేసిన నిధిని పారదర్శకంగా నడపడానికేం.. దానికేం అభ్యంతరం..? ప్రజాస్వామ్యంలో ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నది. మన రాజ్యాంగం ప్రకారం ప్రజలదే సార్వభౌమాధికారం. ఇప్పుడీ పిఎం కేర్స్ ‌వ్యవహారం చూస్తే..ఆ ప్రజల కన్నా తాను ఎక్కువని ప్రధాని మోదీ భావిస్తున్నారనుకోవాలి. అలా భావించకపోతే పిఎం కేర్స్ ‌కు విరాళాలు ఎవరు అందిస్తున్నదీ చెప్పాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం ఉన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ ‌దాఖలు చేయగలదా..? ప్రధాని పేరుతో ఏర్పాటయిన సంస్థ..ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో నడిచే సంస్థ ప్రభుత్వ సంస్థ ఎలా కాకుండా పోయింది. కానపుడు ప్రధాని, ఆర్ధిక మంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి దానికి ట్రస్టీలుగా ఎందుకు ఉన్నారు..? గత ఏడాది మార్చిలో పిఎం కేర్స్ ‌నిధిని నెలకొల్పినపుడు ప్రభుత్వం దానికి ప్రచారం ఎందుకు కల్పించినట్లు.. విరాళాలు అందించాలని ఎందుకు పిలుపు ఇచ్చినట్లు.. ఇప్పుడా విరాళాలు ఎవరు ఇచ్చిందీ ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం లేదంటే.. దాని అర్ధం ఏమిటి.?మేము ఎవరికీ జవాబుదారీ కాదు.

ఎవరికీ ఏమీ వెల్లడించాల్సిన పని లేదు అనేగా..! ప్రధాని ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేసే దశ దాటిపోయారని అంటున్నది అందుకే. తన వ్యక్తిగత ప్రతిష్ట చూసి పిఎం కేర్స్ ‌కు నిధులు ఇస్తున్నారనీ, దానికీ భారత ప్రభుత్వానికీ సంబంధం లేదనీ మోదీ భావిస్తున్నారు. కానీ ఇక్కడో పేచీ ఉంది. భారత ప్రధాని కాకపోతే మోదీ ఎవరు.. ఆయనను ఖాతరు చేసేదెవరు..? భారత ప్రధాని అయినందుకు ప్రజలు మోదీని గౌరవిస్తున్నారా లేక మోదీ ప్రధాని అయినందుకే ప్రజలు ఆ పదవిని గౌరవిస్తున్నారా..? రెండవదే కరెక్టు అనుకునే వారు దేశంలో లేకపోలేదనుకోండి. మోదీ కూడా అలానే అనుకుంటున్నారా అన్నది ప్రశ్న ఇక్కడ. అలా అనుకోకపోతే ఆయన కార్యాలయంలో పని చేసే అధికారి హైకోర్టులో ఇలాంటి అఫిడవిట్‌ ‌దాఖలు చేయగలరా. ఇక్కడ మరో పేచీ ఉంది. పిఎం కేర్స్ ‌సైట్‌ ‌లో ప్రధాని ఫొటోతో పాటు జాతీయ పతాకాన్నీ, భారత ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని కూడా పెట్టారు. వీటిని మించి మరోటి ఉంది..పిఎం కేర్స్ ‌సైట్‌ ‌డొమైన్‌ ‌నేమ్‌ ‌ప్రభుత్వం వాడే డొమైన్‌ ‌నేమ్‌. ‌పిఎం కేర్స్ ‌డాట్‌ ‌గవ్‌ ‌డాట్‌ ఇన్‌ అని ఉంటుంది. పిఎం కేర్స్ ‌కూ ప్రభుత్వానికీ ఏమీ సంబంధం లేకపోతే ఈ డొమైన్‌ ‌నేమ్‌ ఏమిటి..? పిటిషన్‌ ‌దారుడు కూడా ఢిల్లీ హైకోర్టులో ఆ మాటే అడిగారు. దీనికి ప్రధాని కార్యాలయం ఏం చెబుతుందో చూడాలి. అసలు ప్రధాని కార్యాలయంతో సంబంధం ఉందంటేనే మనం ఏమనుకుంటాం… ఏమనుకోవాలి..? ఒకపక్క ప్రధాని కార్యాలయం కోర్టులో జవాబు చెబుతుంది. మరోపక్క దీనితో ప్రభుత్వానికి సంబంధం లేదంటుంది. ఇట్లాంటి విడ్డూరాలు బహుశా మోదీ ఏలుబడిలోని ఇండియాలో తప్ప మరే దేశంలోనూ కనబడవు.

నిజానికి పాలనలో పారదర్శకత లేకపోవడం అన్నది మనకు కొత్త విషయం కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సమాచార హక్కు చట్టాన్ని తెచ్చుకోవడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఆ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేయాలా అని మోదీ ప్రభుత్వం చూస్తున్నది. ప్రజల కోసం, ప్రజలను పాలించడం కోసం, ప్రజల విరాళాలతో నడిచే రాజకీయపార్టీలు సమాచార హక్కు చట్టం తమకు వర్తించబోదని భీష్మిస్తాయి. ఈ విషయంలో ఒక్క బీజెపినే నిందించాల్సిన పని లేదు. అన్ని పార్టీలదీ అదే వైఖరి. దేశాన్ని పాలించడం అంతిమ లక్ష్యంగా పని చేసే రాజకీయ పార్టీలకు విరాళాలు ఎవరు ఇస్తున్నదీ తెలుసుకునే హక్కు ప్రజలకు లేకుండా ఎలక్టోరల్‌ ‌బాండ్ల స్కీమును నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది. మిగతా పార్టీలు అన్నీ వ్యతిరేకించినా ఆ స్కీము రద్దు కాదు. దాని ప్రకారం స్మగ్లర్లు, ఉగ్రవాదులు, దొంగలు, అవినీతిపరులు, ఎవరైనా గానీ మన భవిష్యత్తు నిర్ణయించే రాజకీయ పార్టీలకు ఎంచక్కా నిధులు ఇవ్వవచ్చు. అది కూడా చట్ట బద్ధంగా. దొంగతనంగా కాదు. కాకపోతే మనకు తెలియదు..ఆ ఇచ్చింది ఎవరన్నదీ. ఇదీ మన ఏలికల పారదర్శకత..! ఇలాంటి స్కీమును ప్రవేశపెట్టి నడిపించే ప్రధానమంత్రి పీఎం కేర్స్ ‌విషయంలో పారదర్శకంగా ఉంటారని అనుకోవడం అత్యాశే అనుకోండి. కానీ ఏదో ఒక చోట ఇలాంటివాటికి ముగింపు ఉండొద్దూ..!.

Leave a Reply