Take a fresh look at your lifestyle.

భారత ప్రధాని రాష్ట్ర పర్యటన ఈసారి కూడా …

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌రాక సందర్భంగా ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోటోకాల్‌ ‌పాటిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గత సంవత్సరకాలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భాల్లో ప్రోటోకాల్‌ ‌ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని స్వాగతించడం మొదలు వీడ్కోలు వరకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల   గైర్హాజరు అవుతున్న విషయం తెలియందికాదు. అయితే తనకు బదులుగా ఎయిర్‌ ‌పోర్టులో ప్రధానిని ఆహ్వానించేందుకు మంత్రులను పంపుతుండడం వివాదగ్రస్తమవుతూనే ఉంది. కాగా ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గతంలోకన్నా మరింత తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ‌మధ్య నిప్పులో ఉప్పులా తయారైంది. ఈ రెండు పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు తయారైనాయి. ఈ రెండు పార్టీలు కూడా ఆయా పార్టీల నాయకత్వంలోని ప్రభుత్వాలను పడదోసే పథకాల రచనలో తనమునకలైనాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు, వివిధ రాజకీయ పార్టీలు సంఘటిత పోరుకు కూడా సిద్ధమయినాయి.

తాజాగా కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపుకు దాదాపు 19 రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్దతు సార్వత్రిక ఎన్నికలవరకు సాగుతుందా లేదా అన్నది పక్కకు పెడితే, బిజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌వైపే ఇప్పుడు అందరి చూపుంది. కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్‌ ‌చేస్తూ, నిలదీస్తున్న ప్రధాన పార్టీల్లో బిఆర్‌ఎస్‌ ‌ముందువరుసలో నిలిచింది. అటు కేంద్రంలో బిజెపీ, ఇటు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన మొదట్లో ఈ రెండు పార్టీల మధ్య మంచి సయోధ్యే ఉండింది. ఎప్పుడైతే కేంద్రం విభజన హామీలను నెరవేర్చకపోవడం, నిధుల కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తున్నదన్న అభిప్రాయం కలిగిందో అప్పటినుండి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం తగవులాటకు దిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారింది. అప్పటినుండి సవాళ్ళు ప్రతిసవాళ్ళు, ఆరోపణలు మొదలైనాయి. ఈ రెండు ప్రభుత్వాలుకూడా తమదే పైచెయ్యి అనిపించుకోవాలన్న దిశలో ప్రణాళికలను రచిస్తూ వొచ్చాయి. అయితే ఎంఎల్‌ఏల కొనుగోలు వ్యవహరం దీనికి పరాకాష్టకు చేరుకుంది. తమ ప్రభుత్వాన్ని పడదోయడానికి బిజెపి ఎలాంటి కుట్రపన్నిందన్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా దేశవ్యాప్తం చేయగలిగింది బిఆర్‌ఎస్‌. ‌దాంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరింత దూరమయ్యాయి. దానికి తగినట్లుగా టిఎస్‌పిఎస్‌సి అంశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని జండాకు ఎక్కించాలనుకున్న బిజెపి ప్రయత్నానికి ఎస్‌ఎస్‌సి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారాన్ని బిజెపి మెడకు వేసింది బిఆర్‌ఎస్‌. ఇదిప్పుడు రాష్ట్రంలో రావణకాష్టంగా మండుతోంది.

ఈ విషయంలో సాక్షాత్తు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రమేయాన్ని ఎత్తి చూపుతూ, తెలంగాణ పోలీస్‌ ఆయనను అరెస్టు చేయడం, అనంతరం బెయిల్‌పై ఆయన విడుదల కావడం రాష్ట్ర రాజకీయా)ను ఒక్కసారే కుదిపేసింది. ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా ప్రధాని గత పర్యటనలను ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్‌ ‌సమీపంలోని ముచ్చింతల్‌లోని   చిన్న జియ్యర్‌ ‌స్వామి ఆశ్రమంలో వైష్టవాచార్యులు శ్రీ రామానుజచార్యుల 216 అడుగుల (సమతామూర్తి) భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు ప్రధాని వొచ్చిన సందర్భంగా, పటాన్‌ ‌చెరువులోని ఇంటర్నేషనల్‌ ‌క్రాఫ్ట్ ‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ‌ఫర్‌ ‌పెమీ- ఎరిడ్‌ ‌ట్రాఫిక్‌ ‌క్యాంపస్‌ (ఇ‌క్రిసాట్‌) ‌స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, గచ్చిబౌలీలో నిర్వహించిన ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ‌ద్విశతాబ్ది వార్షికోత్సవాల సందర్భంగానైతేనేమీ, రామగుండం ఫర్టిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలోనైతేనేమీ ప్రధాని రాష్ట్ర రాజధాని వొచ్చిన వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ ‌పాటించక పోవడంపైన రాజకీయ వర్గాలనుండి తీవ్ర విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. విచిత్రమేమంటే మోదీ హైదరాబాద్‌కు రావడానికి ఒక రోజుముందు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న యశ్వంత్‌  ‌సిన్హాను స్వాగతించేందుకు కెసిఆర్‌ ‌స్వయంగా తన మంత్రులతోకలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్ళి, తెల్లవారి ప్రధానికి స్వాగతం పలుకకపోవడంపైన ప్రధానంగా బిజెపి వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. భారతదేశానికి లభించిన చరిత్రాత్మక అవకాశమైన జి 20 (2023 సెప్టెంబర్‌లో జరిగే)  సమావేశాల అతిథ్యంపైన దిల్లీలో  ఏర్పాటుచేసిన  దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అధినేతల సమావేశానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌హాజరు కాకపోవడం పలు విమర్శలకు దారితీసింది. ప్రధాని హైదరాబాద్‌ ‌వొచ్చిన సందర్భంగా ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులను పంపించడం అనవాయితీ చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇది ఒక విధంగా ప్రధానిని, రాజ్యాంగాన్ని అవమానించడమేనంటూ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు బిజెపి నాయకులు.

ఇప్పుడు తాజగా మరోసారి ప్రధాని నేడు  రాష్ట్ర రాజధానిలో పర్యటించనున్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో ప్రధాని ప్రైవేటు కార్యక్రమానికి వొచ్చారని, మరోసారి అదే రోజున తమపార్టీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం, ఇంకోసారి బెంగుళూరు టూర్‌ ‌పెట్టుకోవడం. మరోసారి ఒంట్లో బాగులేదని చెప్పుకుంటూ రాగా, ఇప్పుడు అదే రోజున సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాధర్నా కార్యక్రమానికి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ పిలుపునిచ్చింది. సరిగ్గా మోదీ వొస్తున్న శనివారమే ఈ ధర్నాకు పార్టీ పిలుపు ఇవ్వడాన్నిబట్టి ఈసారికూడా సిఎం కెసిఆర్‌ ‌పిఎంను స్వాగతించేందుకు వెళ్ళే అవకాశాలు కనిపించడంలేదు. అయితే ఇది ప్రధాని అధికార పర్యటన కావడంతో ఎప్పటిలాగే ప్రధానిని స్వాగతించే బాధ్యతను  తన మంత్రివర్గ సహచరులలో ఒకరికి అప్పగించే అవకాశముంది.

Leave a Reply