Take a fresh look at your lifestyle.

బెంగాల్‌ ‌రైతులను.. సర్వనాశనం చేసిన ఘనత దీదీదే

పీఎం కిసాన్‌ ‌యోజన ఫలాలు అందకుండా చేశారు
బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతపై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజం

పశ్చిమబెంగాల్‌ను, అక్కడి రైతులను సర్వనాశనం చేసిన ఘనత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే దక్కుతుందని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం 70 లక్షల మంది రైతులకు పీఎం- కిసాన్‌ ‌యోజన ఫలాలు అందకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి కిసాన్‌ ‌యోజన కింద తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా రూ. 18 వేల కోట్ల నిధులను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్‌లో నిరసనలు వ్యక్తమవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈరోజు పశ్చిమబెంగాల్‌ ‌లోని 70 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కింద ప్రయోజనం సిద్ధించలేదు. 23 లక్షలమందికి పైగా బెంగాల్‌ ‌రైతులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు కానీ వారి దరఖాస్తులను చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందంటూ మోదీ విమర్శించారు. దేశమంతటా కోట్లాది రైతులు పిమ్‌ ‌కిసాన్‌ ‌నిధి కింద లబ్ధి పొందుతున్నారు కానీ మమత కారణంగా ఈ పథకం బెంగాల్‌లో అమలు కావడం లేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూర్చే పీఎం- కిసాన్‌ ‌పథకాన్ని బెంగాల్‌లో అమలు చేయడం లేదు. అర్హులైన రైతులు ఒక్కొక్కరికి 2 వేల రూపాయల మేర.. మొత్తంగా రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తున్నాం. వాటిని నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫలాలు వారికి చేరకుండా చేస్తోంది. అప్పుడు ఆందోళనలు జరగలేదు. కానీ ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్నారు. దేశమంతా ఈ పథకం వల్ల లబ్ది పొందుతోందని మోదీ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిద్ధాంతాలతో పశ్చిమ బెంగాల్‌ను నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోని రైతులంతా కేంద్ర పథకాల వల్ల లబ్ధి పొందుతుంటే ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే అర్హులైన రైతులకు నష్టం వాటిల్లుతోంది. సీఎం మమత 15 ఏళ్ల క్రితం చేసిన ప్రసంగాన్ని ఓ సారి పరిశీలిస్తే.. ఆమె సిద్ధాంతం బెంగాల్‌ను ఎంతగా నాశనం పట్టించిందో అర్థమవుతుందని మోదీ ఆక్షేపించారు. ఈ స్వార్థ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సొంత రాష్ట్రంలో రైతులను పట్టించుకోని వారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరిట ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వారికి మాత్రం మద్దతు పలుకుతున్నారని ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కారు తీరును విమర్శించారు. కాగా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, అధికార టీఎంసీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Leave a Reply