Take a fresh look at your lifestyle.

రైతు సంఘాల నాయకులతో చర్చలకు ప్రధానికి నామోషీనా ..?

సాగు చట్టాలపై సాగుతున్న ఆందోళనను సమర్ధించినందుకు హక్కుల ఉద్యమనాయకురాలు గ్రెటా థెన్ బర్గ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుందనీ,ఆమె మాదిరిగానే విదేశీయులు భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. హక్కుల ఉద్యమకారులకు దేశం, ప్రాంతం, కులం,మతం,వర్గం ఉండవు. హక్కులకు ఎక్కడ భంగం కలిగినా వారు స్పందిస్తూ ఉంటారు. చిలీ,అంగోలా వంటి దేశాల్లో జరిగిన పోరాటాలకు మన దేశంలోని హక్కుల ఉద్యమకారులు మద్దతు ప్రకటించడం మనకు తెలుసు.ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది.కానీ, ప్రభుత్వం విమర్శలను సహించే పరిస్థితిని పూర్తిగా వదిలిపెట్టి ఎవరు ఏది మాట్లాడినా చర్యలకు ఉపక్రమిస్తోంది. రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పలు సార్లు వ్యతిరేకించిన ప్రాంతీయపార్టీలు కూడా ఇదే మార్గంలో నడుస్తున్నాయి.

ఇంతకీ తనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినా, రైతుల పోరాటానికి మద్దతు విషయంలో తన వైఖరి మారదని గ్రెటా థన్ బర్గ్ స్పష్టం చేశారు. మన దేశంలో కూడా వివిధ రాజకీయ పార్టీలు ఇదే మాదిరిగా రైతుల ఉద్యమానికి సౌహార్దాన్ని తెలిపినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా ఎదురుదాడి చేసింది. అంతెందుకు అమెరికా కూడా ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను సమర్ధిస్తూనే , రైతుల ఉద్యమం ప్రజాస్వామ్యంలో సహజ పరిణామమని పేర్కొంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ మేనకోడలు కూడా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయంగా సెలబ్రెటీలు రైతులకు మద్దతు ప్రకటిస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని మన దేశంలో సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రెటీల చేత ప్రభుత్వం ప్రకటన ఇప్పించింది. ప్రభుత్వంలో అసహన ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కేసులు,ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయడం వంటి చర్యలకు ఉపక్రమిస్తోంది. నిజానికి ఇది గోటితో పోయే వ్యవహారం.

ఇగో సమస్య కారణంగా ఇది పెరిగి తాళవృక్ష ప్రమాణంలో పెద్దదైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలి దశలోనే రైతు సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడి ఉంటే సమస్య ఇంతవరకూ వొచ్చేది కాదు. రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ తికాయత్ మాటల్లో ఈ విషయం స్పష్టం అవుతోంది. ప్రధాన మంత్రి నేరుగా మాట్లాడాలన్న ఆయన డిమాండ్ అంతరార్థం ఇదే. మొదట్లో ఎవరో కొందరు రైతులు ఉద్యమం ప్రారంభించిన మాట నిజమే.ఇప్పుడు రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.ఈ తరుణంలో ప్రధానమంత్రి ప్రతిష్టకు పోకుండా రైతు సంఘాల నాయకులతో తానే నేరుగా చర్చలు జరిపి ఉంటే సమస్యకు పరిష్కారం దొరికేది. అమెరికా విదేశాంగ శాఖ డిల్లీలోని తమ రాయబార కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

ప్రధానమంత్రి కూడా ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని అన్నారు.అలాంటప్పుడు రైతు సంఘాల ప్రతినిధులతో తానే స్వయంగా మాట్లాడవొచ్చు కదా అని సమాజంలో వివిధ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఎంత చేసిందో ,ఇంకా ఏమేమి చేయాలనుకుంటోందో ప్రధాని నోటంట వినేందుకు రైతులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా,ఏ ప్రభుత్వాధినేత అయినా, ప్రజాఉద్యమాలకు స్పందించి దిగి రావల్సిందే. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఇంటర్నెట్ సహా అన్ని కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వారంతా రైతుల సమస్యలపైనే మాట్లాడుతున్నారు. మోడీ ప్రభుత్వ విధానాలపైన కాదు.కనుక ఈ విషయాన్ని ప్రతిష్ఠగా తీసుకోవల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏడాదిన్నర పాటు ఈ చట్టాలను నిలిపివేసేందుకు ఇప్పటికే అంగీకరించింది కనుక,ఆ విషయాన్నే ప్రధానమంత్రి రైతు సంఘాల నాయకులను పిలిచి స్పష్టం చేస్తే సమంజసంగా ఉండేది.

ఇప్పుడు జరుగుతున్న పోరాటాన్ని రైతులు ఆత్మగౌరవ పోరాటంగా పేర్కొంటున్నారు. తమతో మాట్లాడేందుకు ప్రధానమంత్రి నామోషీగా భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి. దేశ రాజధాని నగరం వెలుపల ఇంత సుదీర్ఘ కాలం ఎన్నడూ ఏ ఆందోళన జరగని మాట నిజమే .,కానీ, వ్యవసాయ హక్కుల కోసం జరుగుతున్న పోరును ప్రభుత్వం తక్కువ అంచనా వేయరాదు. భూములపై హక్కులు పోతాయేమోనని రైతులు ఆందోళ న చెందుతున్నారు.అటువంటిదేమీ లేదని ప్రధానమంత్రి రైతు సంఘాల నాయకులకు నేరుగా హామీ ఇవ్వవొచ్చు. పార్లమెంటులో ప్రతిపక్షాలను లెక్క చేయని రీతిలో ఇప్పుడు రైతు సంఘాల నాయకులతో నేరుగా చర్చించేందుకు ప్రధాని వెనుకాడటం ఆయన వైఖరికి అద్దం పడుతోంది. ఈ ఆందోళన ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించింది.ఇంకా ముదరకముందే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రైతు సంఘాల నాయకులతో నేరుగా ప్రధాని చర్చించాలి.

Leave a Reply