హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పీఎంవో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించింది. ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెళ్లడిస్తామని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి మోదీ ఈ నెల 19న హైదరాబాద్కు రావాల్సి ఉంది. దీంతో రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది.
ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రధాని మోదీ..రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఆయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా పడటంతో ఈ అత్యాధునిక రైలు ప్రారంభం కూడా వాయిదా పడింది. వందే భారత్ రైలుతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా మోడీ ప్రారంభించాల్సి ఉంది. అదే విధంగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను శ్రీకారం చుట్టాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన అర్దాంతరంగా రద్దువడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.