- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన
- అదేరోజు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ
- ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు
న్యూ దిల్లీ, జనవరి 21 : ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖారారు అయింది. వాస్తవానికి సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ట్రెయిన్‌ను ప్రారంభించడానికి ఈ నెల 19నే మోడీ తెలంగాణలో పర్యటించాల్సింది. కానీ అనివార్య కారణాలవల్ల పర్యటన రద్దు అయ్యింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందే ఈ నెల 15న సికింద్రాబాద్-వైజాగ్ వందేభారత్ ట్రయిన్‌ను మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ఇపుడు మోడీ టూర్ ఖరారయ్యింది.
అప్పుడు వాయిదా పడ్డ మోదీ టూర్‌ను వొచ్చే నెలకు రీ షెడ్యూల్ చేశారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడటం, ముందస్తు ఎన్నికలు వొచ్చే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో మోదీ తెలంగాణ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడం, వొచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న క్రమంలో.. జాతీయ నేతలు రాష్ట్రానికి వొస్తున్నారు. ఈ నెలలో అమిత్ షా రానుడంగా.. వొచ్చే నెలలో మోదీ వొస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో మోదీ ఏం మాట్లాడతారనేది హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేస్తారా..? కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేసే ఆరోపణలకు సమాధానం చెబుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.