- లాక్డౌన్ పొడిగింపుపై స్పష్టత వచ్చే అవకాశం
ప్రధాని మోదీ మంగళవారం ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కొరోనా వ్యాప్తిపై విధించిన లాక్డౌన్ గడువు మంగళవారంతో ముగియనుండటంతో దాని కొనసాగింపుపై ప్రధాని స్పష్టతనివ్వనున్నారు. దేశంలో కొరోనా కేసులు ఎక్కువగా నమోదవు తుండటంతో పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు లాక్డౌన్ను కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది.
ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్టాల్రు లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి. దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాపై ఇప్పటికే ప్రధాని సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు పార్టీల ఎంపిలతోనూ మాట్లాడారు. కరోనా కట్టడికి లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తున్న దశలో మరికొంత కాలం పొడిగించాలన్న డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరోమారు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.