అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలని ప్రధాని ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిమ్స్‌లో కొరోనా టీకా రెండోడోసు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సినేషన్ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకోగా, రెండో డోసును గురువారం తీసుకున్నారు. ప్రధాని తన మొదటి డోసు తీసుకున్న 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను మోదీ తీసుకున్నారు. కోవిడ్‌ను ఓడించడానికి ఉన్న కొద్ది మార్గాల్లో వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఒకటని, అర్హులందరూ త్వరగా టీకా వేయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ట్వీట్లో.. ‘నేను ఎయిమ్స్‌లో ఈ రోజు కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నాను. కొరోనా వైరస్‌పై జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి.
అర్హులైనవారు టీకా తీసుకోవాలి. టీకా కోసం రిజిస్టర్ చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిస్టర్ పీ నివేద, నిషా శర్మ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి మొదటి, రెండో డోసు టీకాను ఇవ్వడం మరిచిపోలేమని పేర్కొన్నారు. మోదీకీ టీకా ఇవ్వడం అరుదైన అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు. తమతో మోదీ మాట్లాడారని, ఇది మరిచిపోలేని అనుభూతి అని చెప్పారు. టీకా ఇచ్చిన సందర్భంగా మోదీతో ఫోటో దిగడం గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని నర్సులు పేర్కొన్నారు. సిస్టర్ నిషా శర్మ చాలా సంతోషంతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం, ఆయనకు టీకా ఇవ్వడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని చెప్పారు.
ఆమె పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందినవారు. మోదీకి టీకా మొదటి డోసు ఇచ్చి, తాజాగా రెండో డోసు ఇవ్వడంలో సహాయపడిన సిస్టర్ పి నివేద అమితానందంతో మాట్లాడుతూ, మోదీకి టీకా మొదటి డోసు ఇచ్చిన వ్యాక్సినేటర్‌ను తానేనని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఆయనను కలిసేందుకు, ఆయనకు రెండో డోసు ఇచ్చేందుకు తనకు అవకాశం దక్కిందని చెప్పారు. తనకు ఈ అవకాశం దక్కడం పట్ల చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. మోదీ తమతో మాట్లాడారని, తాము ఆయనతో కలిసి సెల్ఫీలు దిగామని తెలిపారు.