ఉక్రెయిన్‌లో యుద్ధానికి పశ్చిమ దేశాలు ఆజ్యం
అణుయుద్ధం ఆలోచన లేదని వెల్లడి
న్యూ దిల్లీ, అక్టోబర్ 28 : ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. మోడీ దేశభక్తుడు. ఆయన మేకిన్ ఇండియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగినది. మోడీ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయన ప్రధాని అయినప్పటినుంచి భారత్ అన్ని రంగాల్లో శక్తివంతంగా రూపుదిద్దుకుందని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని పుతిన్ అన్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఆధునిక రాజ్యంగా మారడంలో విపరీతమైన పురోగతిని సాధించిందని చెప్పారు. ఇండియాతో రష్యాకు ఎలాంటి సమస్య లేదని.. అన్ని విషయాల్లో పరస్పరం సహకరించుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్ లోనూ ఇది కొనసాగుతుందన్నారు. ప్రధాని మోడీ కోరినట్లుగా ఎరువుల సరాఫరాను పెంచామని..ఇది ఇండియాలో వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉక్రెయిన్ పై అణ్వాస్త్రాలను ప్రయోగించా లన్న ఉద్ధేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు.
ప్రపంచంపై ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిందన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా సహా దాన్ని మిత్రపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌లో యుద్దానికి పశ్చిమ దేశాలు ఆజ్యం పోస్తున్నాయని రష్యా అధ్యక్షులు పుతిన్ విమర్శించారు. అయితే అమెరికా, దాని మిత్ర దేశాలు చిట్టచివరికి రష్యాతోనే భవిష్యత్ గురించి మాట్లాడాల్సివస్తుందని ఆయన అన్నారు. మాస్కోలోని వల్‌డై డిస్కషన్ క్లబ్‌లో ఆయన వార్షిక ప్రసంగం చేశారు. వలసవాదంతో పాశ్చాత్య దేశాలు అంధకారంలో కూరుకుపోయాయని, మిగతా ప్రపంచాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రష్యాకు ఉక్రెయిన్‌ను పక్కలో బ్లలెంలా యుద్ధోన్మాదంతో ఎగదోస్తున్న పశ్చిమ దేశాల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
’పశ్చిమ దేశాలు ఆడుతున్న ప్రమాదకరమైన ఈ మురికి ఆటలు రక్తసిక్తమైనవి’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, నాటోతో ఉత్తమ సంబంధాలు నిర్మించుకోవాలనే రష్యా ప్రయత్నాలను పశ్చిమ దేశాలు తిరస్కరిస్తున్నాయని, రష్యాను బలహీన పర్చాలన్నదే దానికి కారణమన్నారు. డాలర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని అమెరికా చూస్తోందని పుతిన్ ఆరోపించారు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇతర దేశాలు చేస్తున్న చర్యలు వేగవంతమవుతాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.