- రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలి
- పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే అభివృద్ధి
- నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ
భారతదేశ అభివృద్ధి మూలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర, రాష్టా ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే.. సహకార సమాఖ్య మరింత అర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకువెళ్లేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న మోదీ.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
పోటీ తత్వాన్ని, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాల మధ్యే కాకుండా..జిల్లా స్థాయిల్లోనూ బలోపేతం చేయాలని ప్రధాని అన్నారు. కోవిడ్ వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేశాయో చూశామని, ఈ విధానంలో దేశం సక్సెస్ అయ్యిందని, ప్రపంచం కూడా మనల్ని గుర్తించిందన్నారు. దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండాయని, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈ సందర్భంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గత కొన్ని ఏండ్ల నుంచి ఉచితంగా బ్యాంకు అకౌంట్లు కల్పిస్తున్నామని, వ్యాక్సినేషన్ పక్రియ పెరిగిందని, ఆరోగ్య సదుపాయాలు కూడా పెరిగాయన్నారు. పేదల కోసం ఉచిత విద్యుత్తు కనెక్షన్లు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ సదుపాయాలు పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చినట్లు ప్రధాని వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని ముందుకు నడిపేందుకు పటిష్టమైన విధానాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనుమతించాలని.. ఇందుకు రాష్ట్రాలు, కేంద్రం రెండూ తమకు సహకరించాలని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌లో పాల్గనడానికి తాము ప్రైవేట్ రంగానికి అవకాశాలను కల్పించాల్సి వుందని అన్నారు. కొరోనా మహమ్మారి సమయంలో..కేంద్రం రాష్ట్రాలు ఏ విధంగా సమన్వయంగా పనిచేశాయో చూశామని.. అందులో విజయం సాధించామని.. దీంతో భారత్ ఇమేజ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు.
భారత దేశ అభివృద్ధికి పునాది.. కేంద్రం, రాష్టాల్రు కలిసి నిర్ధిష్ట దిశలో పనిచేయడమేనని అన్నారు. దీంతో సహకార సమాఖ్య వాదాన్ని అర్థవంతంగా చేశామని అన్నారు. అలాగే రాష్టాల్రు, జిల్లాల మధ్య కూడా పోటీ, సహాకార సమాఖ్యను తీసుకువచ్చేందుకు యత్నించాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులతోపాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సిఇఒ అమితాబ్‌కాంత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.