Take a fresh look at your lifestyle.

అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ

  • అధ్యక్షుడు జో బైడెన్‌తో, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ కానున్న ప్రధాని
  • మూడు రోజుల పర్యటనలో ఐరాస సదస్సులో ప్రసంగించనున్న మోడీ

క్వాడ్‌ ‌సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ అమెరికా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అగ్రరాజ్యానికి చేరుకున్న మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. వాషింగ్టన్‌లోని జాయింట్‌ ‌బేస్‌ అం‌డ్రూస్‌కు చేరుకోగానే.. వేలాది మంది భారత-అమెరికన్లు భారత జెండాలను చేతబూని ఆయనకు స్వాగతం పలికారు. ఆయన రాక నేపథ్యంలో బైడెన్‌ ‌యంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు, అమెరికాలోని భారత రాయబారులు పలువురు అక్కడకు చేరుకుని…మోడీని స్వాగతించారు. ఆర్మీ బ్రిగేడియర్‌ అనూప్‌ ‌సింగాల్‌, ఎయిర్‌ ‌కమాండర్‌ అం‌జన్‌ ‌భద్ర, నౌకాదళ కమాండర్‌ ‌నిర్భయా బప్నా విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. కొరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2020 జనవరి తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. కాగా, వంద మందికిపైగా ప్రవాస భారతీయులు విమానాశ్రయం వద్ద త్రివర్ణ పతాకాన్ని చేపట్టుకుని ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. తన కోసం వేచి ఉన్నవారిని కలిసిన మోదీ.. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ…‘వాషింగ్టన్‌లో నాకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు. మన ప్రవాసులే మనకు బలం.

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటు కోవడం అభినందనీయం’ అని అన్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమోరికాలో తీరికలేకుండా గడపనున్నారు. తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్‌ ‌సదస్సులో పాల్గొన నున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో తొలిసారిగా నేరుగా మోడీ భేటీ కానున్నారు. అదేవిధంగా క్వాడ్‌ ‌సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా పాల్గననున్నారు. భారత్‌ను వీడే ముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్మామ్యం బలోపేతం, జపాన్‌, ఆ‌స్ట్రేలియాతో సంబంధాల బలోపేతానికి దీన్నొక సందర్భంగా వినియోగించుకుంటానని అన్నారు. కాగా, 2014లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రధాని మోడీ 7 సార్లు అమెరికాలో పర్యటించారు.

Leave a Reply