Take a fresh look at your lifestyle.

ప్రధాని ప్రసంగం దేనికి సంకేతం ..?

అన్ లాక్ 2.0 పై ప్రధాని నరేంద్రమోడీ  మంగళవారం నాడు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో  కొరోనా వ్యాప్తి ని   గాలికి వదిలేసినట్టు కనిపిస్తోంది.   నాలుగు లాక్ డౌన్ ల తర్వాత   అన్ లాక్ 1.0 ను  ప్రభుత్వం ప్రకటించింది.  సడలింపుల కోసమే  అన్ లాక్ ను ప్రకటించింది.  సడలింపుల వల్ల కొరోనా కేసులు  మరిన్ని పెరిగాయి. రోజుకు పదివేల పైగా కేసులు నమోదు అవుతున్నట్టు  ప్రభుత్వం జారీ చేసిన లెక్కలే చెబుతున్నాయి.    ఇక పైన నిబంధనలను మరింత కఠినంగా అమలు జేస్తామని ప్రధాని ప్రకటించారు. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇక  పైన కఠినంగా నిబంధనలు అమలు జేస్తామన్న మాటలో అర్థం లేదు.  అన్ లాక్ -1 లో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే కేసుల సంఖ్య పెరిగినట్టు ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారు. అంటే,   సడలింపులు నిర్లక్ష్యానికి దారి తీస్తాయని ఆయన అంగీకరించినట్టే.   ఇప్పుడు అన్ లాక్ -2 కాలంలో    ఉన్నపళంగా మార్పు వొస్తుందని ఆయన నమ్మబలుకుతున్నారు.   లాక్ డౌన్లను అమలులోకి తెచ్చి మంగళవారానికి వందరోజులు పూర్తి అయింది. వంద రోజుల నుంచి  బయటకు రాకుండా ఇళ్ళకే పరిమితం అయిన వారు అల్ లాక్ -1  ప్రకటించగానే ఒక్కసారిగా బయటకు వొచ్చారు.  సడలింపుల రెండో ఘట్టంలో కూడా వారు బయటకు   రాకుండా ఉండలేరు.  కొరోనా  వైరస్  పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్టు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. వంద రోజుల నుంచి కొరోనా   వ్యాప్తిలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా ఇప్పుడు పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచుతామనడం అర్ధం లేని విషయం.   ప్రజలకు  లాక్ డౌన్ నిబంధనలను గురించి తెలియజెప్పడంలో తమ ప్రభుత్వం  విజయం సాధించిందనీ,  జాగరూకతపై ప్రజల్లో స్పృహ పెరిగిందని ప్రభుత్వం  పేర్కొంటోంది. అలాంటప్పుడు కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నకు  ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు.  దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు చెప్పినా ఒకటే కారణం. విదేశాల నుంచి వచ్చిన వారివల్లేనని. నిజమే కావచ్చు, కానీ, అది కొరోనా ప్రారంభ దశలో విదేశాల నుంచి వచ్చిన  వారి వల్లనే వైరస్ వ్యాప్తి పెరిగింది.  లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చి వంద రోజులైనా ఇంకా విదేశాల నుంచి వచ్చిన వారి బెడద ఉందంటే అది ప్రభుత్వ వైఫల్యమే.   విదేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాల్లోనే పరీక్షలు జరిపించి క్వారంటైన్ లకు తరలిస్తున్నట్టు  ప్రభుత్వం మార్చి చివరి వారంలోనే ప్రకటించింది. అలాంటి ఏర్పాట్లు ఉన్నప్పుడు ఇంకా విదేశ ల నుంచి వొచ్చిన వారి వల్లేననడం   సమంజసంగా  లేదు.  విదేశాల నుంచి వొచ్చిన వారి సంగతి అటుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు పంపడంలో ప్రభుత్వ వైఫల్యం ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  దేశం మొత్తం మీద   60 లక్షల మంది పైగా వలస కార్మికులు ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మందైనా  స్వస్థలాలకు చేరి ఉంటారా అన్నది అనుమానమే. ఒక వేళ చేరి ఉంటే,  లాక్ డౌన్ సడలింపుల కాలంలో   భవన నిర్మాణ కార్యకలాపాల కోసం  వారిని మళ్ళీ వెనక్కి రప్పించిన రాష్ట్రాలు ఉన్నాయి.   సడలింపుల్లో భాగంగానే వారిని రప్పించడం జరిగింది.   అన్ లాక్ ల సడలింపులతో    కొరోనా వ్యాప్తి కట్టడి సాధ్యం కాదన్నది  సామాజిక విశ్లేషకుల అభిప్రాయం. ఇక పేదలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు  గరీబ్ కల్యాణ్  పథకాన్ని  దీపావళి వరకూ  పొడిగిస్తున్నట్టు  ప్రధానమంత్రి ప్రకటించారు.  అంటే దీపావళి వరకూ పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన స్వయంగా అంగీకరిస్తున్నట్టయింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ కొరోనా  వ్యాప్తి  ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.  పండుగ సీజన్ లో   ప్రజలెవరూ పస్తులుండకూడదనే   90 వేల కోట్ల రూపాయిలను  ఆహార ధాన్యాలు, నిత్యావసరాల సరఫరాకు ఖర్చు చేయబోతున్నామని ప్రధాని ప్రకటించారు.ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 1,70 లక్షల కోట్ల రూపాయిల ప్యాకేజీ సొమ్ము అసలైన లబ్ధి దారులకు అందలేదన్నది నిష్ఠుర సత్యం,   ప్యాకేజీలు , ఫలహారాలు కాదు. ప్రజలు స్వశక్తి మీద పని చేసుకునే వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం విఫలమైంది.  కొరోనా  టెస్ట్ ల వల్ల   ఐసోలేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం  కనిపించడం లేదు. ప్రభుత్వ దవాఖానాలకు  వెళ్ళడమంటే నరకానికి దారులన్న అభిప్రాయం ప్రజల్లో దృఢ పడిపోయింది. ప్రైవేటుహాస్పిటల్స్ ల్లో చికిత్సలకు ఏర్పాట్లు చేశామంటూ ప్రకటిస్తున్నారు కానీ, అక్కడ  వసూలు చేస్తున్న ఫీజులు ఉన్న రోగాన్ని మరింత పెంచుతున్నాయి.   వీటిని కట్టడి చేయలేని  ప్రభుత్వం  ఇప్పుడు కొత్తగా ప్యాకేజీలను ప్రకటించడం  రోగ మొకచోటైతే, మందు మరో మరో చోట అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ప్రజలను కొరోనా  వ్యాప్తిలో వదిలేసి  ప్యాకేజీలకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త పేర్లు ప్రకటించడం వల్ల  ప్రయోజనం ఉండదు.ఈ విషయాన్ని    ప్రధాని గ్రహించాలి. నిజానికి కేంద్రంలో కొరోనా కట్టడి విషయంలో సమన్వయం ఉన్నట్టు కనిపించడం లేదు. వైద్య,ఆరోగ్య శాఖల మధ్య , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడం  వల్లనే కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కేంద్ర బృందాలు తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. కానీ, వాటి నివేదికలు ప్రభుత్వానికి అంది తదుపరి చర్యలు తీసుకునే లోపల  మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది.  పైపై మెరుగుల చర్యల  కన్న, కొరోనా కట్టడి విషయంలో ప్రధానంగా ప్రభుత్వాలు  దృష్టిని కేంద్రీకరించాలి.

Leave a Reply