Take a fresh look at your lifestyle.

మితాహారం, మిత భాషణం…. మనిషికి భూషణం….

కొరోనా వైరస్ కేసుల సంఖ్య నిపుణుల అంచనాలకు మించి నానాటికీ పెరిగిపోతోంది. టెస్ట్ లు జరగని రాష్ట్రాల్లో కేసులు , మరణాల సంఖ్యలో పెద్దగా తేడా లేకపోవచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరీక్షలతో పాటు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా జూలై 30 వ తేదీ ఒక్క రోజే ఆరు లక్షల 42 వేల పరీక్షలను నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్నాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప వంటి ప్రముఖులకు అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నా, వైరస్ బారిన పడక తప్పడం లేదు. ఇక సామాన్యుల సంగతి ఏమిటి..? తెలుగు రాష్ట్రాల్లో కోవిద్ 19 వ్యాధిన పడిన కుటుంబాల గాథలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో సాధారణంగా వొచ్చే వ్యాధులు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. చాలా గ్రామాలు, పట్టణాలే కాదు.. హైదరాబాద్ వంటి మహానగరాలలో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిల్వఉండటం, మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం, ప్రమాదాలు చేసుకోవడం నిత్యకృత్యం అయింది. వర్షాకాలం జలుబు, దగ్గు, ఇస్నోఫియా వంటి వ్యాధులు తిరగబెడతాయి. వర్షాకాలంలో మురుగునీరుపై ముసురుకునే దోమల వల్ల బోద, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మన ప్రభుత్వాలు స్వాతంత్ర్యానంతరం సాగునీటి సౌకర్యాలతో పాటు మురుగునీటి పారుదలకు కోటానుకోట్ల రూపాయిలు కేటాయిస్తున్నప్పటికీ అవన్నీ మురుగు కాలువలో పోసిన చందంగా తయారవుతున్నాయి. కొరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినట్టే, వర్షాకాలపు వ్యాధుల విషయంలో కూడా ప్రభుత్వాలపై ఆధారపడి ప్రయోజనం లేదు. కొరోనాకు స్వీయ నియంత్రణే సరైన మందు అని ప్రధానమంత్రి నుంచి గ్రామ సర్పంచ్ వరకూ అందరూ అదే పనిగా ప్రజలకు హిత బోధ చేస్తున్నారు. అలాగే, ఇప్పుడు సీజనల్ వ్యాధులకు కూడా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అని సలహా ఇచ్చినా ఆశ్చర్యం లేదు. వర్షా కాలం లో పొద్దు పొడవక పోవడం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా వైద్యులు సూచించిన మాత్రలను వేసుకోవాలి. అలాగే, ఆకుకూరల్లో డి విటమిన్ ఎక్కువ ఉంటుంది కనుక, వాటిని ఎక్కువగా వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. పులియ బట్టిన ఆహారాన్ని అసలు తినకూడదు. ఫ్రిట్జ్ లలో నిల్వఉంచి వండిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు వొస్తాయి. చెత్త డబ్బాల్లో వేసిన చెత్త ఏరోజు ఆరోజు బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలి . వర్షాకాలంలో మహానగరాల్లో సైతం ఇళ్ళ నుంచి చెత్తను సేకరించే బండ్లు రోజువారీ రావడం లేదు. గ్రామాలు, ఓ మాదిరి పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది.

కోవిడ్ హాస్పిటల్స్ ల వద్ద వినియోగించిన పీపీఈ కిట్లు, సర్జికల్ వ్యర్థాలు నిల్వలు పేరుకుని పోతున్నట్టు నిరంతర ప్రసార మాధ్యమాల్లో చూపుతున్నా, పారిశుధ్య విభాగం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ వంటి భాగ్యవంతుల కాలనీల్లోనే కొద్ది పాటి వర్షానికి రోడ్లు చెరువులు అవుతున్నాయి. మాదాపూర్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే మ్యాన్ హోల్స్ లో పడి మరణాలు సంభవించిన సంఘటనలు మనకు తెలుసు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే మన ఆహార, విహార అలవాట్లను నియంత్రించుకోవాలి. రోడ్డు పక్కన ఆహారాన్ని విక్రయించే దుకాణాలు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ , బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లోనే రోడ్డుకు పదుల సంఖ్యలో ఇవి దర్శనం ఇస్తున్నాయి. రోడ్డు పక్కన బడ్డీ కొట్లలో చిరుతిండి సైతం తినరాదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అయినా ఈ తాత్కాలిక భోజన వసతులు పెరగడానికి కారణం దూర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు వేరే మార్గం లేకపోవడంతో వీటిని ఆశ్రయిస్తున్నారు. కూరలు , పచ్చళ్ళు, సాంబార్ వంటి వంటకాలను గాజు పెట్టెల్లో అమరుస్తున్నప్పటికీ ఈగలు ముసరడం వల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటోంది. బహుళ జాతి సంస్థల కంపెనీల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం ఉండేది. కొరోనా కారణంగా ఈ కంపెనీల్లో ఉద్యోగులంతా ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడిపోయారు. వర్షాకాలం వొచ్చే జలుబు, పడిశం వంటి రోగాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి పోతుంది. అలాంటి వారిలో కొరోనా సులభంగా వ్యాపిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో సరైన సౌకర్యాలు లేవు. కొరోనా వల్ల ప్రజల సాధారణ జీవనం దెబ్బతింది. ఉద్యోగాలు కోల్పోకుండా.. ఏది దొరికితే దాన్ని ఆధారం చేసుకుని మధ్య తరగతి ఉద్యోగులు జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారే కొరోనా బారిన ఎక్కువ పడుతున్నారు. ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరి ఫయర్ లను ఏర్పాటు చేసుకునే శక్తి మధ్యతరగతి వారికి ఉండదు. అలాగే, డ్రై ఫ్రూట్స్ వంటి ఖరీదైన ఆహారాన్ని తీసుకునే శక్తి మధ్యతరగతికి ఉండదు.అందువల్ల వారు ఎక్కువగా ఆకుకూరలను రోజుకోరకం చొప్పున మార్చి మార్చి వినియోగిస్తుంటారు. ఫ్రిట్జ్ లో ఎక్కువ కాలం నిల్వఉంచే పచ్చి కూరల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. వండిన ఆహారాన్ని నిల్వ చేయకుండా ఏ రోజుకారోజు వాడటం ద్వారా రోగాల నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ తుమ్మడం, చీదడం, ఉమ్మడం వంటి అలవాట్లను మానుకోవాలి.. అందులో వ ర్షాకాలంలో వీటి వల్ల దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాచిన నీటినే తాగాలి. అసలు తాగకపోతే డీహైడ్రేషన్ వొస్తుంది. కొరోనా కారణంగా అతి జాగ్రత్తలు పాటిస్తున్న వారు కూడా రోగాల బారిన పడుతున్నారు.అందువల్ల మితాహారం తో కొరోనా కాలంలో వర్షాకాలంలో జీవనం సాగించడం ఎంతైనా అవసరం. మితాహారం, మిత భాషణమే మనిషికి భూషణమని పెద్దలు ఊరకే అనలేదు.

Leave a Reply