Take a fresh look at your lifestyle.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి

‘‘అ‌గ్రరాజ్యంలో భారతీయ ఓట్ల కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. అమెరికా గడ్డ పై భారతీయులకు ఉన్న ప్రాధాన్యత పార్టీల మధ్య నెలకొన్న పోటీకి అద్దం పడుతోంది. గత కొంత కాలం నుంచి హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌ ‌వంటి కార్యక్రమాల ద్వారా ఇండియన్స్‌కు దగ్గర అవటానికి ట్రంప్‌  ‌తంటాలు పడుతుంటే…తాజాగా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్‌ను డెమోక్రటిక్‌ ‌పార్టీ ఉపాధ్యక్ష పదవి రేసులో నిలబెట్టింది..’’

rehana pendriveఈ ఏడాది చివరలో అమెరికా శ్వేతసౌధ అధిపతి ఎవరో తేల్చే ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్ళకు ఒకసారి అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. వివాదాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌గా ఉండే ట్రంప్‌కు ఈసారి ఎన్నికలు అగ్నిపరీక్ష పెట్టనున్నాయి. అనేక సందర్భాల్లో జాత్యహంకారం ప్రదర్శిస్తారు అనే విమర్శలు ఎదుర్కోన్నారు. అమెరికా ఫర్‌ అమెరికన్స్ ‌వంటి జాతీయతా భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇతర ఖండాల నుంచి దశాబ్దాల క్రితమే వలస వచ్చిన వారిని తక్కువగా చూడటం కూడా ట్రంప్‌ ‌స్వభావంలో కనిపిస్తుంది. మామూలు సమయంలో ఈ గిమ్మిక్కులు పని చేస్తాయేమో కాని ఇప్పుడంతా కొరోనా కాలం కదా. ట్రంప్‌కు కలిసి వచ్చేటట్లు కనిపించటం లేదు. వైరస్‌ ‌కట్టడిలో అగ్రరాజ్యం ఘోరంగా విఫలమయ్యింది. ధీటైన నాయకత్వ లేమి వల్ల ఆ దేశంలో కొరోనా కరాళ నృత్యం చేసింది. కొరోనా కేసులు, మరణాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న దేశం అమెరికా. దీనితో అమెరికన్లు ట్రంప్‌ ‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌ ‌పాపులారిటీ ఇండెక్స్ ‌రోజు రోజుకూ పడిపోతోంది. సీఎన్‌ఎన్‌ ‌నిర్వహించిన నేషనల్‌ ‌పోల్‌లో  ప్రతి పది మంది అమెరికన్లలో దాదాపు ఆరుగురు ట్రంప్‌ ‌మాటల్ని నమ్మడం లేదని తేలింది. గత ఎన్నికల్లో వైట్‌ అమెరిన్స్ ‌ట్రంప్‌కు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఓట్‌ ‌బ్యాంక్‌కు గండిపడుతోంది. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంతో బ్లాక్‌ అమెరికన్స్‌కు మరింత దూరం అయ్యారు. దీనితో ట్రంప్‌ ‌భారతీయ ఓట్ల పై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో దాదాపు 40లక్షల మంది ఇండియన్‌ అమెరికన్లు ఉన్నారు. ఇందులో దాదాపు ఇందులో దాదాపు 25లక్షల మందికి అమెరికాలో ఓటు హక్కు ఉంది. అందుకే భారతీయ ఓట్లు కీలకంగా మారాయి.

ట్రంప్‌ అలా…
సాధారణంగా అమెరికాలోని భారతీయ ఓటర్లు డెమొక్రటిక్‌ ‌పార్టీ అభ్యర్థి వైపు కాస్త మొగ్గు చూపుతుంటారు. దీనితో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  ట్రంప్‌ ‌కొంత కాలం నుంచే భారతీయ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మన ప్రధాని మోడితో మంచి సంబంధాలను నెరుపుతున్నారు. గత ఏడాది ప్రవాసులు భారీగా తరలివచ్చిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి ట్రంప్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని ‘అబ్‌కే బార్‌ ‌ట్రంప్‌ ‌సర్కార్‌’ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. ఆ రకంగా ఈ కార్యక్రమం వెనుక పొలిటికల్‌ అజెండా ఉందన్న విశ్లేషణలను అక్కడి పత్రికలు రాశాయి. ఇక ఈ ఏడాది భారత గడ్డపై కుటుంబ సమేతంగా అడుగు పెట్టారు ఈ శ్వేత సౌధాధిపతి. నమస్తే ట్రంప్‌ ‌కార్యక్రమాన్ని మనం నిర్వహించాం. తాజ్‌ ‌మహల్‌ ‌సందర్శన, హైదరాబాద్‌ ‌హౌస్‌లో విందు ఇవన్నీ…భారతీయుల పై పాజిటివ్‌ ఇం‌పాక్ట్ ‌చూపించేందుకు చేసిన ప్రయత్నాలే. ఇక తాజాగా  పరిశోధన రంగంలో భారతీయుల సేవల పై ట్రంప్‌ ‌ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని, ఈ కష్టకాలంలో  వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చి భారత్‌కు అండగా ఉంటానని చెప్పటం ద్వారా భారతీయ ఓటర్లలో సానుకూల దృక్పధం తీసుకువచ్చే ప్రయత్నం చేశారన్నది ఓక విశ్లేషణ.

జో బిడెన్‌ ఇలా…
డెమోక్రట్ల తరపున అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు  జో బిడెన్‌. ‌ప్రభుత్వ వైఫల్యాలు సహజంగానే ప్రతిపక్ష డెమోక్రట్లకు పాజిటివ్‌గా ఉపయోగపడతాయి. అదే సమయంలో జో బిడెన్‌ ‌వ్యూహాత్మకంగా మరో అడుగు ముందుకు వేశారు భారతీయ ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు. తమ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ, కాలిఫోర్నియా సెనెటర్‌ ‌కమలా హారిస్‌ ‌పేరును ప్రతిపాదించారు. అంతే కాదు ఎన్నికలు ముగిసే వరకూ తన ప్రచారంలో కమలా హ్యారిస్‌ ‌భాగస్వామిగా ఉంటారని, తమ భాగస్వామ్యంతో విజయం మరింత సులువవుతుందని భావిస్తున్నట్లు చెప్పటం కూడా విశ్లేషణకు ముడి సరుకు లభించిన అంశమే. కమలా హ్యారిస్‌కు అమెరికాలో ఫియర్‌ ‌లెస్‌ ‌లేడీగా గుర్తింపు ఉంది. కమల తల్లి తమిళనాడు నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. భారతీయ ఓట్ల కోసం ఈ రెండు పక్షాలు వేస్తున్న ఎత్తులు, పై ఎత్తులు అమెరికా ఎన్నికల వాతావరణంలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

Leave a Reply