రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలు
హాజరైన ప్రధాని మోడీ, మంత్రులు, అధికారులు
న్యూ దిల్లీ, జనవరి 26 : దేశ వ్యాప్తంగా గణంతత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. సైనిక పాటవం, అభివృద్ధి శకటాలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడు జరిగింది. ఈ పరేడులో దేశ సైనిక సామర్థ్యాన్ని చెప్పేలా ఘనంగా సాగింది. భారత వాయుసేన విన్యాసాలు, వివిధ రాష్ట్రాల శకటాలతో పరేడ్ సాగింది. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్ ఏఎస్ఐ బాబురామ్‌కు అశోక్ చక్ర పురస్కారాన్ని ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.
లెప్టినెంట్ జనరల్ విజరు కుమార్ నేతృత్వంలో సైనికుల గౌరవ వందనంతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్ ప్రారంభమైంది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఆద్యంతం పరేడ్ ఆకట్టుకుంది. మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు జరిగాయి. ఇందులో పాత విమానాలతో పాటు ఆధునిక జెట్లు అయిన రఫేల్, సుఖోయ్, జాగ్వార్ వంటివి ప్రదర్శించారు. అయితే సాధారణంగా ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ను ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ’ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే ఆహుతులకు ఆహ్వానాలు అందాయి. కేంద్రమంత్రులు, అదికారులు పాల్గొన్నారు.