Take a fresh look at your lifestyle.

తెలుగు భాషా పరిరక్షణ తెలుగోడి ప్రథమ కర్తవ్యం

  • నేడు తెలుగు భాషా దినోత్సవం
  • సాహితీ వినీలాకాశంలో ఒక  చెరగని చరిత్ర మన తెలుగు భాష

తెలుగు భాషా పటుత్వాన్ని,తెలుగు సాహితీ  పరిమళాన్ని సకల భాషా ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టగల ప్రాచీన చారిత్రక భాషా నేపథ్యం తెలుగు భాష కు మాత్రమే ఉంది. నవరసాలను ముగ్ధ మనోహరంగా పలికించగల సామర్ధ్యం తెలుగు భాష స్వంతం.తెలుగు భాషా విశిష్ఠత ప్రతీ తెలుగువాడి కంఠంలో ఖంగుమని మ్రోగుతుంది. తెలుగు భాషా ప్రవాహానికి అడ్డులేదు.  తెలుగు నాల్కలపై తెలుగోడి భాషాభిమానం తొణికిస లాడుతుంది. మందార, మకరంద మాథుర్యం వంటి  తెలుగు భాష  సకల భాషల్లో అత్యంత శ్రేష్ఠమైనది.ఎంతో మంది మహాకవులు, చరిత్రకారులు సంస్కృతంలో లిఖించిన గ్రాంథిక మహా గ్రంథాలను సైతం అలవోకగా, భావం దెబ్బతినకుండా,మూల గ్రంథాలలోని సహజత్వం ఉట్టిపడేలా అర్ధవంతంగా,మృదుమధురంగా తెనుగీకరించడం తెలుగు భాషకున్న సౌలభ్యం.ఒక పదానికి ఎన్నో అర్ధాలు,ఒక శబ్ధానికి ఎన్నో భావాలు,హాస్యానికైనా వ్యంగానికైనా, చమత్కారానికైనా తెలుగు భాషకు మరేభాష సాటిరాదు.

భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే నాలుగవ భాషగా తెలుగు గుర్తింపబడింది.తెలుగు అనేది ద్రావిడ భాషల్లో ఒకటిగా పరిగణింపబడుచున్నది. భారతదేశం తో పాటు ప్రపంచంలో పలు దేశాల్లో ద్రావిడ భాష మాట్లాడే వారున్నారు. ప్రపంచంలో దాదాపు తెలుగు భాష కొన్ని వేల సంవత్సరాలనాటి అతి ప్రాచీన భాష. తెలుగంటే ఒకరి భావాలు మరొకరు అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే మాధ్యమం మాత్రమే కాదు,ప్రాచీన కాలం నుండి వస్తున్న సంస్కృతులను,కళలను,జీవన విధానాన్ని సజీవంగా ఉంచి, ఒక జాతిగా నిలబెట్టిన నేపథ్యం తెలుగు భాషకుంది.

భారత ప్రభుత్వం గుర్తించిన ఆరు ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా దక్కకుండా చేయడానికి కొంతమంది చాలా ప్రయత్నాలు చేసారు.ఆలస్యమయినా తెలుగు భాష ప్రాచీన భాష హోదా సంపాదించింది.ఆంధ్ర ప్రదేశ్‌ ‌జనాభా సుమారు ఐదున్నర కోట్లు, తెలంగాణా జనాభా సుమారు 4 కోట్లు.కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌ ‌ఘర్‌లో సుమారు కోటి మంది తెలుగు మాట్లాడే వారున్నారు.ఈశాన్య రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాం తాలతో కలిపి  భారతదేశంలో 8 కోట్లకు పైగా తెలుగు భాష మాట్లాడతారు. ఒరిస్సా, బెంగాల్‌, ‌గుజరాత్‌ ‌లలో,కేరళ, పాండిచ్ఛేరి లో కూడా తెలుగు మాట్లాడే వారున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తెలుగు వారి ఓట్లు అప్పుడప్పుడు ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికం.

దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 52 కోట్లు,బెంగాలీ సుమారు 10 కోట్లు,మరాఠీ 8.3 కోట్లు ,తెలుగు 8.11 కోట్లమంది మాట్లాడతారు.యు.స్‌, ‌సౌదీ,మ్యాన్మార్‌,‌మలేషియా దేశాల్లో లక్షల సంఖ్యలో,ఆస్ట్రేలియా,ఫిజీ తదితర దేశాల్లో కెనడా దేశాల్లో వేల సంఖ్యలో తెలుగు మాట్లాడే వారున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది తెలుగు ప్రజలున్నారు.ట్రంప్‌ ‌హయాంలో అమెరికాలో తెలుగును ఒక అధికారిక వ్యవహారిక భాషగా చేర్చారు.ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలుగు జాతి ప్రజలు తమ మాతృభాషపై మమకారం వదులుకోలేదు.తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పడం,గౌరవించడం చేస్తున్నారు.

తెలుగు భాషకు చెందిన ఎన్నో పురాతన శిలా శాసనాలున్నాయి.వీటిని బట్టి తెలుగు భాష ఎంత ప్రాచీన మైనదో అవగతమౌతున్నది.తెలుగు భాషకు సి.పి.బ్రౌన్‌ ‌చేసిన సేవలు గురించి  ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రౌన్‌ ‌నిఘంటువు తెలుగు భాషాప్రియులకు వరం. ఆంగ్లేయుడిగా అరుదెంచి, అచ్చమైన తెలుగువాడిగా అవతరించి,తెలుగు భాషా వికాసానికి తనదైన శైలిలో ఎనలేని కృషి చేసి,తెలుగు భాష అంటే ఏమిటో, తెలుగుభాషా విశిష్ఠత ఎలాంటిదో ప్రపంచానికి  పరిచయం చేసిన చార్లెస్‌ ‌ఫిలిప్‌ ‌బ్రౌన్‌ ‌తెలుగు భాషా సేవా నిరతి అనన్యసామానం.వ్యాకరణ సొగసులతో, వర్ణనలతో, సామెతలతో, ద్వంద్వార్ధాలతో, చాటువులతో గద్య,పద్యాల అందచందాలతో,  ఒద్దికగా తెలుగు జన హృదయాల్లో మమేకమైన తెలుగు భాష కు ఇలలో మరే భాష సాటి రాదు. సరితూగలేదు. భాషా సరళత కోసం కొన్ని కొన్ని అక్షరాలను తీసివేయడం వలన, పలకడం  రాకపోవడం వలన తెలుగు భాషా విశిష్ఠత దెబ్బతిం టున్నది.వీటిని పునరుద్ధరించి,స్పష్టమైన ఉచ్ఛారణ కోసం పాటు బడాలి.

అష్ట,శత,సహస్రావధానాలతో, సాహితీ కదనరంగంలో జగ్గజ్జేతగా నిలబడిన ఏకైక భాష మన తెలుగు. అలాంటి తెలుగు మాట్లాడడం అవమానమని భావించడం మన పుట్టుకను మనమే అవమానించుకోవడం వంటిది.మన  మాతృమూర్తిని అవమానిం చుకోవడం వంటి ఆత్మహత్యా సదృశ మైన చర్య.’’దేశ భాష లందు తెలుగు లెస్స’’ అన్న రాయల మాట తెలుగు వారి హృదయాలకు తేనెలొలికే కమ్మని మాట.ఆంగ్ల భాషను నేర్చుకోవాలి.అదే సందర్భంలోతెలుగు భాషను విస్మరించరాదు.తెలుగు భాష గ్రాంథికమైనా, వ్యవహారికమైనా దాని విశిష్ఠత వర్ణింప నలవి కాదు. పూర్వకాలం లో తెలుగు గ్రాంథికానికి విలువెక్కువ. ఇది  సాహితీ స్రష్ఠలకు మాత్రమేఅవగతమయ్యేది.

తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టి,వాడుక భాషతో తెలుగు భాషను ప్రజల హృదయాలకు హత్తుకునే ఆలోచన చేసి,తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడిగా వేనోళ్ళ శ్లాఘించబడ్డ గిడుగు వెంకట రామ్మూర్తిజన్మించిన ఆగష్టు 29 వ తేదీని ‘‘తెలుగు భాషా దినోత్సవం’’ గా జరుపుకోవడం ముదావహం.మాతృభాష ను మరచి,పరాయి భాషలెన్ని నేర్చినా ఫలితం శూన్యం. మానసిక వికాసానికి మూలం మాతృభాష. తెలుగు మన మాతృభాష కావడం మన మహద్భాగ్యం.హస్తినకు రాజైనా,అమ్మకు కొడుకే కదా! అలాగే ఎవరెన్ని భాషలు మాట్లాడినా మాతృభాష కు సరిసమానమైన భాష మరొకటి లేదు.చక్కనైన,చిక్కనైన పద సమూహాలతో, నిండు పున్నమి వెన్నెలలా చల్లని కాంతులను వెదజల్లే తెలుగుభాషా పరిమళాన్ని ఆస్వాదించాలి.ఆరాధించాలి. తెలుగు భాషా వైశిష్ఠ్యాన్ని  కాపాడాలి. తెలుగు భాషా ఔన్నత్య పరిరక్షణకు పాటుబడాలి. తెలుగంటే ఒక భాష కాదు. తెలుగు జాతిని,చరిత్రను కాపాడే ఒక జీవన విధానం.తెలుగును విస్మరించడం  తెలుగు నేలకు,తెలుగు జాతికి కళంకం. తెలుగుభాషా పరిరక్షణ తెలుగు చరిత్రను సజీవం గా నిలపడానికి మన ముందున్న ఏకైక ధ్యేయం.
– సుంకవల్లి సత్తిరాజు., 9704903463.

Leave a Reply