Take a fresh look at your lifestyle.

సీఎస్‌కు చేరిన పీఆర్సీ నివేదిక

జనవరి మూడో వారంలో వేతన సవరణ ప్రకటన

‌తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పిఆర్‌సి) తమ నివేదికను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌కు అందజేసింది. అధికారుల కమిటీ, ఉద్యోగ సంఘాల సమక్షంలో సీఆర్‌ ‌బిస్వాల్‌ ‌నేతృత్వంలోని ఎండి అలీ రఫత్‌, ‌సి.ఉమా మహేశ్వరరావు నేతృత్వంలోని పిఆఆర్‌సి కమిటీ ఈ నివేదికను అందజేసింది. 2018 మేలో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌ ‌బిస్వాల్‌ ‌నేతృత్వంలో తొలి పీఆర్‌సిని నియమించింది. ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించిన నివేదికను 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ముందుగా ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. అయితే, ఆ తరువాత పలు దఫాలుగా కమిటీ నివేదిక గడువును పొడిగించింది.

చివరిగా పొడిగించిన గడువు డిసెంబర్‌ 31‌తో ముగియనుండగా, గడువుకు చివరి రోజైన గురువారం పీఆర్‌సి తమ నివేదికను సీఎస్‌కు అందజేసింది. కాగా, జనవరి మూడో వారంలో పీఆర్‌సి నివేదిక ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణను ప్రభుత్వం ప్రకటించనుంది. దీంతో పాటు వేతన సవరణతో పాటు వయో పరిమితి పెంపుపై సైతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై జవనరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సీఎస్‌ ‌నేతృత్వంలోని కమిటీని ఆదేశించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ‌గురువారం కొత్త పీఆర్‌సి, ఉద్యోగుల వయో పరిమితి పెంపు తదితర అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. పీఆర్‌సిపై నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చిన రోజే సీఎస్‌కు పీఆర్‌సి సంఘం నివేదిక అందడం గమనార్హం.

Leave a Reply