ప్రతిదినం ప్రజాహితం
- వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పై పుస్తకాన్ని ఆవిష్కరించిన
- వైఎస్సార్సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ
హైదరాబాద్ :తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసి, తెలుసుకుని, మీకు అండగా ‘నేను ఉన్నాను – నేను విన్నాను’ అని ప్రజలకు అభయమిచ్చి, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలను అమలు చేస్తూ తన పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజ శేఖర రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ మాట్లాడారు. 2019 మే నెల నుంచి 2020 మే 31 వరకు ఒక సంవత్సరం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రోజువారీ అధికారిక కార్యక్రమా లను జాతీయ మీడియా సలహాదారుడి ఆంత రంగిక కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ డివిజనల్ పిఆర్వో పాలెపు రాజ శేఖర్ పుస్తకం రూపొందించగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడి కార్యాలయం ప్రచురించిన ‘‘ప్రతిదినం ప్రజాహితం’’ పుస్తకాన్ని హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో శ్రీమతి విజయమ్మ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.
శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఈ సందర్భంగా తాను అభినందిస్తున్నానని, మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంధంలా భావిస్తూ ఇచ్చిన హామీలన్నీ సంవత్సర కాలంలో తొంబై శాతం అమలు చేశారని, హరితాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్ద డానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని, జూలై 8వ తేదీన ఇళ్ల పంపిణీ కూడా చేయనున్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఆరు లక్షల మందికి కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించి, దేశాని ఆదర్శంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపారని, అందులో భాగస్వాములైన గ్రామ సచివాలయాల ఉద్యోగుల కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రతిదినం ప్రజాహితం కోరి ముఖ్యమంత్రి చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలు, శాఖలవారీగా చేసిన సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు మున్నగు అంశాలను ఒక విషయ సూచికలా తెలియజేసే తొలి సంవత్సర నివేదికగా తన కార్యాలయం తరఫున ఈ పుస్తకాన్ని ముద్రించామని, జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్ తెలిపారు.పుస్తక రచయిత పాలెపు రాజ శేఖర్‌ను శ్రీమతి విజయమ్మ, దేవులపల్లి అమర్ ఈ సందర్భంగా అభినందించారు.