Take a fresh look at your lifestyle.

ప్రసాద్‌, ‌స్వదేశ్‌ ‌దర్శన్‌ ‌స్కీమ్‌ ‌కింద.. తెలంగాణకు 305 కోట్లు మంజూరు చేశాం

  • రాష్ట్రంలో 17,483 కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్ ‌నిర్మాణం
  • తెలంగాణ సర్కార్‌ ‌నుంచి ఈఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌కోసం ఎలాంటి ప్రతిపాదనలేదు
  • పార్టమెంటులో రాష్ట్ర మంత్రుల ప్రశ్నలకు కేంద్రం సమాధానం
  • జల విద్యుత్‌ ఉత్పాదనపై కేఆర్‌ఎం‌బీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవటం లేదు : ఎపి ఎంపి ప్రశ్నకు కేంద్రం సమాధానం

తెలంగాణలో స్వదేశ్‌ ‌దర్శన్‌, ‌ప్రసాద్‌ ‌స్కీమ్‌ల కింద 305.12 కోట్ల రూపాయలను మంజూరు చేసి పర్యాటక అభివృద్ధికి సహకరిస్తున్నట్లు కేంద్ర వెల్లడించింది. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా స్వదేశ్‌ ‌దర్శన్‌ ‌స్కీమ్‌లో ఏకో సర్క్యూట్‌(2015-16), ‌ట్రైబల్‌ ‌సర్క్యూట్‌(2016-17), ‌హెరిటేజ్‌ ‌సర్క్యూట్‌(2017-18) ‌లో మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల కింద రూ. 268. 39 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే, ప్రసాద్‌ ‌స్కీమ్‌ ‌కింద జోగులాంబ దేవి ఆలయాన్ని(2020-21) గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.36.73 కోట్లు మంజూరు చేసినట్లు లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఐడెంటిఫైడ్‌ ‌పిలిగ్రిమేజ్‌, ‌హెరిటేజ్‌ ‌డెస్టినేషన్‌ల సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో ప్రాజెక్టుల మంజూరు నిరంతరం సాగే ప్రకియని మంత్రి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో 17,483 కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్ ‌నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,483 కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్ ‌నిర్మాణం అయినట్లు కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్న పథకం(మిడ్‌ ‌డే మీల్స్ ‌స్కీం) కింద కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్ ‌నిర్మాణానికి కేంద్రం వంద శాతం నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో 2006-07 నుంచి 2019-20 కాలానికి 30,408 కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్‌ను మంజూరు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ‌తెలిపారు. ఇందులో 17,483 నిర్మాణాలు పూర్తికాగా..3, 698 నిర్మాణాలు పొగ్రెస్‌లో ఉన్నట్లు ఎంపి రంజిత్‌ ‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2006లో ప్రతి కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్‌ ‌యూనిట్‌కి కేంద్ర 60 వేల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. అయితే, తెలంగాణతో పాటూ, ఇతర రాష్ట్రాలు రూ. 60 వేలతో కిచెన్‌ ‌కమ్‌ ‌స్టోర్స్ ‌నిర్మించలేకపోతున్నాయని తెలిపాయన్నారు. దీంతో 2009లో నిబంధనలు సవరించినట్లు తెలిపారు.

తెలంగాణ సర్కార్‌ ‌నుంచి ఈఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌కోసం ఎలాంటి ప్రతిపాదనలేదు
సూర్యాపేటతో సహా, కొత్తగా రాష్ట్రంలో ఈఎస్‌ఐ ‌హాస్పిటల్‌ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏడు ఈఎస్‌ఐ ‌హాస్పిటల్స్ అం‌దుబాటులో ఉన్నాయని పేర్కొంది. కొత్త ఈఎస్‌ఐ ‌హాస్పిటళ్ల ఏర్పాటు నిరంతర పక్రియని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ ‌తేలి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఈఎస్‌ఐ ‌సభ్యుల సంఖ్య, తదితర వివరాల ఆధారంగా ఈఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ఏర్పాటు జరుగుతుందని వెల్లడించారు. దేశంలో మొత్తం 160 ఈఎస్‌ఐ ‌హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో 50 హాస్పిటల్స్‌ను ఈఎస్‌ఐ ‌కార్పొరేషన్‌ ‌నిర్వహిస్తుండగా, 110 హాస్పిటల్స్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఈఎస్‌ఐ ‌డైరక్టరేట్లు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. 2021లో కొత్త ఈఎస్‌ఐ ‌హాస్పిటల్స్‌ను నెలకొల్పలేదని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

జల విద్యుత్‌ ఉత్పాదనపై కేఆర్‌ఎం‌బీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోవటం లేదు : ఎపి ఎంపి ప్రశ్నకు కేంద్రం సమాధానం
శ్రీశైలం నాగార్జున సాగర్‌, ‌పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు(కేఆర్‌ఎం‌బీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ ‌సింగ్‌ ‌పటేల్‌ ‌పార్లమెంట్‌లో ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్‌ఎం‌బీకి ఇండెంట్‌ ‌పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ‌పులిచింతల ప్రాజెక్ట్‌లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి గత జూలై 5న జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ ‌పవర్‌ ‌హౌస్‌లో విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్‌ 17‌న లేఖ ద్వారా తెలంగాణ జన్‌కోను ఆదేశించింది. జల విద్యుత్‌ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్‌ఎం‌బీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్‌ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ ‌పవర్‌ ‌హౌస్‌తోపాటు నాగార్జున సాగర్‌ ‌డామ్‌, ‌పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్‌ఎం‌బీ తెలంగాణ జెన్‌కో అధికారులను ఆదేశించింది.

జల విద్యుత్‌ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్‌ఎం‌బీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్‌ఎం‌బీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్‌కో (హైడల్‌) ‌డైరెక్టర్‌ ‌జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్‌ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్‌ఎం‌బీకి తెలిపారని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్‌ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్‌ఎం‌బీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్ ‌పవర్‌ ‌హౌస్‌, ‌నాగార్జున సాగర్‌ ‌డామ్‌, ‌పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్‌ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్‌ఎం‌బీ జూలై 16న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు జల శక్తి మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్‌ఎం‌బీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగించింది. ఆంధప్రదేశ్‌ ‌విభజన చట్టంలో కేఆర్‌ఎం‌బీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్‌ఎం‌బీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్థవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

Leave a Reply