“మూత్ర పిండాల వ్యాధులు ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ అధికంగా పోవడం వలన రక్తంలో ప్రోటీన్ తగ్గి కాళ్ళు చేతులు ముఖం ఉబ్బడం, మూత్రం ఆగి ఆగి రావడం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్థూలకాయత్వం కూడా మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలు అధికరక్తపోటు ప్రభావానికి ఎక్కువగా గురి అయి దెబ్బతింటాయి.”
జీవక్రియలో మూత్రపిండాలది ప్రధాన పాత్ర
మానవుని ప్రధానమైన అవయవాలలో మూత్రపిండాలు ముఖ్యమైనవి. ఇవి రక్తంలోని మలినాలను వడబోసి దాదాపు రోజు 200ల లీటర్ల రక్తాన్ని శుభ్రపరుస్తాయి. రక్తంలోని యూరియా, యూరిక్ ఆమ్లము, వ్యర్థ పదార్థాలను వడబోసి మూత్రం రూపములో బయటికి పంపిస్తాయి. రక్తంలోని నీటిసమతుల్యతను కాపాడుతూ మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. ఈ మధ్య కాలంలో యువతతో పాటు చిన్న పిల్లలు కూడా(కిడ్నీ) మూత్ర పిండాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఇందులో 40 శాతం మంది రోగులు డయాబెటిస్ వ్యాధి వలన మూత్రపిండాలు పనిచేయక చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి నెల రెండవ గురువారం ప్రపంచ(కిడ్నీ) మూత్రపిండాల దినోత్సవం జరుపుకుంటాం. ఈ సంవత్సరం ప్రతిచోటా అందరికీ కిడ్నీ ఆరోగ్యం-నివారణ నుండి గుర్తించడం మరియు సంరక్షణకు సమానమైన ప్రాప్యత అనే నినాదంతో జరుపుకుంటున్నాము. ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్న తరుణంలో మూత్రపిండాలు, మూత్రపిండాలకు వొచ్చే వ్యాధులు, నివారణ, ముందు జాగ్రత్తలు, వంటి విషయాలపైన అవగాహన కల్పించడానికి ఈ రోజు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తారు.
మూత్రపిండాలు మానవుని శరీరంలో ప్రధానమైనవి. ఇవి వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. రక్తంలోని మలినాలను శుభ్రం చేస్తాయి. అయితే నేటి జీవన విధానంలో వీటిలో రాళ్ళు, ఇతర వ్యాధులు, క్యాన్సర్ లాంటివి ఏర్పడి చాలామంది చనిపోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్ల మందిని ఇది ప్రభావితం చేస్తోంది. మన రాష్ట్రంలో దాదాపు 20వేలకు పైగా కిడ్ని సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రతి పది మందిలో ఒకరికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉంది. సాధారణంగా కలుషిత నీరు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, గ్యాస్ట్రిక్, పెయిన్ కిల్లర్స్ వాడటం వలన కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. కొన్ని వంశ పారంపర్యంగా కూడా వస్తాయి. నీరు తక్కువగా త్రాగడం వలన సాధారణంగా మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడుతాయి. మనం తీసుకునే ఆహారం వలన కూడా మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. మూత్ర పిండాల వ్యాధులు ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ అధికంగా పోవడం వలన రక్తంలో ప్రోటీన్ తగ్గి కాళ్ళు చేతులు ముఖం ఉబ్బడం, మూత్రం ఆగి ఆగి రావడం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్థూలకాయత్వం కూడా మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలు అధికరక్తపోటు ప్రభావానికి ఎక్కువగా గురి అయి దెబ్బతింటాయి.
కొన్ని సార్లు మూత్ర పిండాలు తాత్కాలికంగా పని చేయవు. తరువాత అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతాయి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కిడ్నీ సంబంధిత పరీక్షలు, మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, క్రియాటినిన్, ఆల్ట్రా సౌండ్ పరీక్షలు చేసుకొని వ్యాధి లేదని నిర్ధారణ చేసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువ నీటిని తీసుకోవాలి. శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ లాంటివి దూరంగా ఉంచాలి. మద్యపానం ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. స్థూలకాయ సమస్య రాకుండా చూసుకోవాలి . అప్పుడే సరైన మూత్ర పిండాలు సమర్థంగా పని చేస్తూ మనుషుల జీవిత కాలాన్ని పొడిగిస్తాయి.

ఉపాధాయులు
టేకుర్తి
9989048428