Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ఆత్మబంధువు ప్రణబ్‌ ‌దాదా

అర్ధ శతాబ్ది పైగా  కేంద్రంలో వివిధ పదవులు నిర్వహించి భారత రాష్ట్రపతిగా   విశిష్టమైన సేవలందించిన ప్రణబ్‌ ‌ముఖర్జీ ఇరవై రోజులు పైగా  మత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారన్న వార్త యావత్‌ ‌జాతినీ కలచి వేసింది. ముఖ్యంగా, తెలంగాణ ప్రజలు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను అందరూ ప్రణబ్‌ ‌దాదా అనేవారు  కాంగ్రెస్‌ ‌పార్టీ లో నిబద్ధత, అంకిత భావం,అకుంఠిత దీక్ష గల పాత తరం నాయకుడు .వృత్తి పరంగా  జర్నలిస్టు గా ప్రారంభమయిన  ఆయనను  బెంగాల్‌ ‌లో లెక్చరర్‌ ‌గా పని చేస్తున్న రోజుల్లో  ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ   జాతీయ రాజకీయాల్లో ప్రవేశించమని ప్రోత్సహించారు.  దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయనకు గల అవగాహన, దూర దృష్టిని చూసి ఆమె ఆకర్షితులయ్యారు.  పార్టీలో  ఆయన  ప్రధానమైన సమస్యలకు  చిటికెలో పరిష్కారాన్ని సూచించేవారు.అందుకే, ఆయనను ట్రబుల్‌ ‌షూటర్‌ ‌గా  కాంగ్రెస్‌ ‌పార్టీ వారే కాకుండా, ఇతర పార్టీల వారూ, ముఖ్యంగా, యూపీఏ భాగస్వామ్య పక్షాల వారూ  అభివర్ణించేవారు. యూపీఏ  పదేళ్ళ పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎనిమిదేళ్ళు కేంద్ర మంత్రిగా సేవలందించారు.  2012లో ఆయనను రాష్ట్రపతి పదవికి సోనియా  ప్రతిపాదించగా ఆమోదించారు. యూపీఏ పార్టీలన్నీ ఆ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాయి.  పశ్చిమ బెంగాల్‌ ‌లో  మూడు దశాబ్దాలు పైగా  ముఖ్యమంత్రిగా ఉన్న మార్క్సిస్టు  పార్టీ కురువృద్ధుడు జ్యోతి బసు వివిధ అంశాలపై ప్రణబ్‌ ‌ప్రజ్ఞను  అభినందించేవారు.ఆయన సలహాలు తీసుకునే వారు. యూపీఏ పాలనలో 40 పైగామంత్రివర్గ ఉప సంఘాలకు ప్రణబ్‌  ‌చైర్మన్‌ ‌గా వ్యవహరించారు.

ఆ కమిటీల్లో ప్రత్యేక తెలంగాణపై ఏర్పాటైన కమిటీ ఒకటి. ఆ కమిటీ ముందు తన వాదనలను వినిపించేందుకు    తెరాస అధ్యక్షుడు,  తెలంగాణ ముఖ్యమంత్రి  కె చంద్రశేఖరరావు హాజరైనప్పుడు ఆయన  వాదనలను  సావధానంగా  వినేవారు.  తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుతున్నారో  తనకు పూర్వాపరాలన్నీ తెలుసునని ప్రణబ్‌  ‌చెప్పినప్పుడు   కేసీఆర్‌ ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా నిధులు,   నీటి వివాదాల గురించి ప్రణబ్‌   ‌ముందే సమాచారాన్ని సేకరించి దగ్గర పెట్టుకోవడం వల్ల , కేసీఆర్‌ ‌వివరిస్తున్నప్పుడు  తన వైపు నుంచి  ప్రణబ్‌ ‌వివరించేవారు.  తెలంగాణ ప్రాంతం  ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాల కు గురైందన్న మాట  అనకపోయినా, తెలంగాణకు న్యాయం జరగాలని  ప్రణబ్‌ అనే వారు, అదే సందర్భంలో అటు ఆంధ్ర  ప్రాంతం నాయకులకు ఎటువంటి అసంతృప్తి కలగకుండా  కత్తిమీద సాము  వంటి తన బాధ్యతను ఎంతో సమర్ధవంతంగా,ఓరిమితో నిర్వహించారు.   కమిటీ చైర్మన్‌ ‌గా   అందరి అభిప్రాయాలు తెలుసుకోవడమే తప్ప తానెప్పుడూ బయట పడే వారు కారు.  ప్రణబ్‌ ‌ముఖర్జీ కమిటీ  సిఫార్సులపై వామపక్షాలు, ఆంధ్రప్రాంతానికి చెందిన కొందరు నాయకులు చిరుబుర్రులాడకుండా,  అందరితో మంచిగా వ్యవహరించారు. తెలంగాణ సాధన పట్ల ఈ ప్రాంత నిబద్ధతను ఆయన మెచ్చుకున్నారు.   తాను రాసిన పుస్తకంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమసారథిగా కేసీఆర్‌ ‌యూపీఏలో భాగస్వామి కావడం వల్ల ఆయన పదే పదే ప్రణబ్‌ ‌ను కలుసుకునే వారు. ఈ విషయాన్ని ప్రణబ్‌ ‌తన గ్రంథంలో ప్రస్తావిస్తూ నాకు ఏ పదవులూ అవసరం లేదనీ,   తెలంగాణ ఇస్తే చాలునని అనేవారని ప్రణబ్‌ ‌పేర్కొన్నారు.  విభజన ద్వారానే తెలంగాణాకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పకనే చెప్పారు. అంతేకాక,  తెలంగాణలో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ, ప్రాంతాల  అసమానతలను రూపు మాపాలని సూచించేవారు.ఇదే విషయాన్ని కేసీఆర్‌ ‌కూడా పలు సందర్భాల్లో   ప్రణబ్‌ ‌ని ప్రశంసిస్తూ పేర్కొన్నారు. అంటే కాదు మన పొరుగువారిని మార్చలేమనీ ..వారితో సామరస్యంగా ఉండాలని హితబోధ చేసే వారు.

ప్రణబ్‌ ‌ముఖర్జీ ఎంతటి  అప్రియమైన విషయమైనా నిర్మొహమాటంగా  ఎదుటివారు నొచ్చుకోకుండా స్పష్టం చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజనపై ఆయన ఆంధ్రప్రాంతం నాయకులతో జరిపిన సంభాషణ ఇందుకు నిదర్శనం.అలాగే,  ప్రస్తుత ప్రధాని  నరేంద్రమోడీ రాజకీయ భావజాలంతో తాను వ్యతిరేకించినప్పటికీ, మూడేళ్ళ పాటు ఆయనతో ఎంతో సామరస్యంగా మెలిగారు. దేశంలో  అసహన ధోరణులు పెరిగినప్పుడు గోరక్షుల పేరిట   దళితులపై  కొందరు దాడులు చేసినప్పుడు ప్రణబ్‌ ‌తన అభిప్రాయాలను  నిర్మొహమాటంగా తెలియజేశారు. అసహన ధోరణులను అంతమొందించాలన్న   ప్రణబ్‌ ‌మాటనే మోడీ పలు సందర్భాల్లో ఉటంకించారు. ప్రణబ్‌ ‌మోడీకి సన్నిహితంగా మెలగడంపై సోనియాగాంధీకి  కొందరు చాడీలు చెప్పారు.  అయినా ఆయన వెరవలేదు.  నాగపూర్‌ ‌లో ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌పరివార్‌ ‌పెద్దలు ఆహ్వానించినప్పుడు కూడా ఆయన  అసహన ధోరణులపై నిష్కర్షగా తెలియజేశారు.  ప్రణబ్‌  అన్ని పదవులూ, భారత్‌ ‌రత్నతో సహా అన్ని బిరుదులూ పొందారు. ఆయనది పరిపూర్ణమైన జీవితం, నిండుకుండలాంటి  మనిషి,  పూర్ణత్వాన్ని పొందిన  నాయకుడు., భారతీయ సంప్రదాయాన్ని అణువణువునా జీర్ణించుకున్న నాయకుడు.ఆయన ఏటా దుర్గా పూజా ఉత్సవాలను నిర్వహించేవారు. ఆయన ఎంత ఆధ్యాత్మిక చింతనా పరుడో,అంత  ప్రగతి శీల వాది.లౌకిక భావ సంపన్నుడు.  కేంద్రంలో ఆయన అన్ని శాఖలూ నిర్వహించారు.  విదేశాంగ మంత్రిగా ఆయన  అన్ని దేశాల్లో పర్యటించారు.    అన్ని సమస్యలపై ఆయనకు సాధికారత ఉండబట్టే ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకూ క్లిష్టమైన సందర్భాల్లో ఆయన సేవలు వినియోగించుకున్నారు. ఆయన   ట్రబుల్‌ ‌షూటర్‌ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం.

Leave a Reply