- సైనిక లాంఛనాలతో..కోవిడ్ నిబంధనల మేరకు పూర్తి
- నివాళి అర్పించిన, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ముగిశాయి. అశ్రునయనాల మధ్య దాదాకు కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంతిమ సంస్కారాలను
నిర్వహించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రణబ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రణబ్ అంత్యక్రియలను ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్స్‌లో ప్రణబ్ అంతిమయాత్ర కొనసాగింది. అనారోగ్య సమస్యలతో ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ప్రణబ్ చేరిన విషయం విదితమే. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. ఆ తర్వాత ప్రణబ్‌కు కొరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ క్రమంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ 31న సాయంత్రం ప్రణబ్ తుదిశ్వాస విడిచారు. ప్రణబ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు నివాళులర్పించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 10 రాజాజీమార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసంలో ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు, కూతురును పరామర్శించారు. అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ప్రణబ్ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు త్రివిధ దళాల సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అంతకు ముందు ఉదయం 9గంటలకు ప్రణబ్ పార్థీవ దేహాన్ని సైనిక హాస్పిటల్ నుంచి 10 రాజాజీమార్గ్‌లోని అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. ప్రణబ్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.