Take a fresh look at your lifestyle.

ప్రణబ్ దా దా …ఓ జ్ఞాపకం

“ప్రణబ్‌ దాదా ఉండే క్వార్టర్స్‌కు రాష్ట్రపతి భవన్‌ కూత వేటు దూరంలో ఉండేది. వీరి ఇంటి ముందు నుంచి రోజు రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది గుర్రాలను వాకింగ్‌కు తీసుకువెళుతుండే వారు. ఆ గుర్రాలకు నిత్యం బలమైన ఆహారం, లభించే ట్రీట్‌మెంట్‌ చూసి దాదా అక్కతో అన్నారట…”అక్కా ..ఆ గుర్రాలను చూడు పనేమి ఉండదు. హాయిగా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నాయి. వచ్చే జన్మలో నేను కూడా రాష్ట్రపతి భవన్‌లో గుర్రమై పుడతా” అని. అప్పుడు తమ్ముడి మీద ప్రేమతోనో, నమ్మకంతోనో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. “వచ్చే జన్మలో రాష్ట్రపతి భవన్‌లో గుర్రంలా ఎందుకు ఈ జన్మలోనే అదే భవన్‌లో రాష్ట్రపతి అయి వెళతావు” అని.”

rehana pendriveఎనిమిదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్ షూటర్‌, రాజకీయ చాణుక్యుడు ప్రణబ్‌ ముఖర్జీ భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఆయన ఊరికి ప్రయాణం కట్టాను. ఇప్పటికీ నాటి జ్ఞాపకాలు తాజాగా రెప రెపలాడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లా ‘మిరాటి’ అనే చిన్న పల్లెటూరు లో తొలి ఊపిరి తీసుకున్నారు ప్రణబ్‌ దాదా. తండ్రి కమద కింకార్‌ ముఖర్జీ స్వాతంత్ర్య సమర యోధులు, 12 ఏళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దాదాకు ఒక అక్క, ఒక తమ్ముడు. నేను కోల్కతాలో ఫ్లైట్ దిగి మిరాటికి వాహనంలో వెళ్లాను. ఆ రోజు అప్పటికి రాత్రి ఎనిమిది, తొమ్మిది అయింది. ఊర్లోకి వెళ్లగానే చాలా మంది ఇంటికి దారి చూపించారు. సాధారణ మధ్యతరగతి ఇల్లు.

దాదా అక్క అన్నపూర్ణమ్మ గారితో .

దాదా అక్క అన్నపూర్ణ గారు, ఇతర కుటుంబ సభ్యులు అదే ఇంట్లో ఉండే వారు. ఆ చీకటి వేళ ఆ ఇంటి తలుపు తట్టాను. నన్ను నేను పరిచయం చేసుకుని ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని చెప్పాను. నన్ను ఎంతో అభిమానంగా లోపలికి ఆహ్వానించారు. హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పగానే దూరం నుంచి వచ్చారా అని చాలా ఆశ్చర్యపోయారు. అన్నపూర్ణ గారు, ఇతర కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇక్కడ విశేషం ఏమిటంటే అన్నపూర్ణ గారికి హిందీ రాదు, నాకు బెంగాలీ రాదు. అయినా కూడా ఆమె ఇంటర్వ్యూ చేశాను. ఎలాగంటారా? నేనేం ప్రశ్న అడుగుతున్నానో పక్కనున్న వారికి చెప్పడం, వారు నా ప్రశ్నను బెంగాలీలోకి అనువదించి ఆమెకు వివరించటం. బెంగాలీలో ఆమె చెప్పిన సమాధానాన్ని రికార్డు చేసుకున్న తర్వాత, ఆమె ఏం చెప్పారో కుటుంబ సభ్యులు నాకు హిందీలో చెప్పటం. ఇలా తర్జుమా ద్వారా ఇంటర్వ్యూ చేయటం అదే మొదటి అుభవం నాకు.

భారత రత్న ప్రణబ్ దాదా కు లెక్కలు నేర్పిన ఉపాధ్యాయుని తో ..

రెండో రోజు ఆయన చదువుకున్న ప్రాథమిక పాఠశాలకు, తర్వాత హై స్కూల్ కు వెళ్ళాను. ఇక్కడా ఓ ప్రత్యేకం ఉంది. ప్రణబ్ దాదాకు ఎనిమిదో తరగతిలో పాఠాలు చెప్పిన మాస్టర్ ఒకరు బతికే ఉన్నారని తెలుసుకుని ఆయన్ను వెతికి పట్టుకోవటంలో విజయం సాధించాను. ఆయన లెక్కల మాష్టారు. బహుశా ఈ అపర మేధావి రాజకీయ లెక్కలు సరి చేయటం అక్కడి నుంచి నేర్చుకున్నారేమో. ఆ మాష్టారును దాదా చదువుకున్న అదే స్కూల్‌కు తీసుకువెళ్లి గ్రౌండ్ లో ఇంటర్వ్యూ చేయటం గొప్ప అనుభూతి. దేశ రాష్ట్రపతికి గురువుని అని గర్వంగా చెప్పుకునే అదృష్టం, అవకాశం ఎంత మంది ఉపాధ్యాయులకు వస్తుంది. అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన కొంత కాలం జర్నలిస్ట్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళటం, దేశ రాజకీయ రంగం పై తనదైన ముద్ర వేయటం అందరికీ తెలిసిన విషయమే. 47 ఏళ్ళ వయస్సులో ఆర్ధిక మంత్రి అయి అతి చిన్న వయస్సులో అంత కీలక శాఖ బాధ్యత వహించిన మంత్రిగా రికార్డు సృష్టించారు. ఇందిరిగాంధీకి నమ్మినబంటు. ఆమె మరణం తర్వాత రాజీవ్‌తో అంత పొసగలేదు. రాజీవ్‌ ప్రణబ్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ వీడి సొంత పార్టీ పెట్టుకున్నా… దాదా ప్రభావం చూపలేకపోయారు. దీనితో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. రాజీవ్‌ మరణం తర్వాత పీవీ హయాం నుంచి ఒక రకంగా దాదా శకం ప్రారంభం అయ్యింది.

గుర్రమై పుడతా…
అన్నపూర్ణ గారికి తమ్ముడంటే చాలా ప్రేమ. ఎందుకంటే దాదా కంటే ఆమె పదేళ్ళు పెద్ద. దీనితో అక్కను మింటి తల్లి వాత్సల్యం ఆమెది. ఆమెను మిరాటిలో నేను కలిసినప్పుడు ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. దాదా మొదటి సారి ఎమ్‌పీగా గెలిచిన ఓ రోజు ఎమ్‌పీ క్వార్టర్స్‌లో అక్కా తమ్ముడి కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. ప్రణబ్‌ దాదా ఉండే క్వార్టర్స్‌కు రాష్ట్రపతి భవన్‌ కూత వేటు దూరంలో ఉండేది. వీరి ఇంటి ముందు నుంచి రోజు రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది గుర్రాలను వాకింగ్‌కు తీసుకువెళుతుండే వారు. ఆ గుర్రాలకు నిత్యం బలమైన ఆహారం, లభించే ట్రీట్‌మెంట్‌ చూసి దాదా అక్కతో అన్నారట…”అక్కా ..ఆ గుర్రాలను చూడు పనేమి ఉండదు. హాయిగా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నాయి. వచ్చే జన్మలో నేను కూడా రాష్ట్రపతి భవన్‌లో గుర్రమై పుడతా” అని. అప్పుడు తమ్ముడి మీద ప్రేమతోనో, నమ్మకంతోనో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. “వచ్చే జన్మలో రాష్ట్రపతి భవన్‌లో గుర్రంలా ఎందుకు ఈ జన్మలోనే అదే భవన్‌లో రాష్ట్రపతి అయి వెళతావు” అని. భారత ముద్దు బిడ్డ ప్రణబ్‌ దాదాకు నివాళులు అర్పిస్తూ…

Leave a Reply