హైదరాబాద్, ఆగస్టు 13 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో పోడు భూమూల విషయమై బాధిత మహిళలు తమకు జరిగిన హింసాకాండను వివరిస్తుంటే కడుపు రగిలిపోయిందనీ బిజెపి పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీనటి విజయశాంతి అలియాస్ రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ… వారం కిందట జరిగిన నిరసనల్లో అటవీ సిబ్బందిపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నెలల వయసు పసిపిల్లల తల్లులతో పాటు మరికొందరు మహిళల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన దుశ్చర్యను కళ్ళారా చూశాం. ఈ పరిణామాన్ని ప్రజాసంఘాలు, నాయకుల తీవ్రస్థాయిలో విమర్శించడంతో హత్యాయత్నం సెక్షన్లను ఉపసంహరించారు.
చివరికి బెయిల్ లభించి కారాగారం నుంచి బయటకొచ్చిన ఆ మహిళలు, జైల్లో వారికెదురైన హింసాకాండను వివరిస్తుంటే కడుపు రగిలిపోయిందన్నారు. భోజనం బాగా లేదన్నందుకు జైలు సిబ్బంది చెయ్యి చేసుకున్నారని, దుర్భాషలాడుతూ మరుగుదొడ్లు కూడా కడిగించారని, ఒంట్లో బాగోకపోయినా మందులివ్వలేదని జైల్లో ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పుకుని రోదించారన్నారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధిస్తోందన్నారు. అయితే, జాతీయ బిసి కమిషన్ ఈ పరిణామాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టడం కాస్తలో కాస్త ఊరటనిస్తోందనీ, తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవానికి ఈ మహిళల దుస్థితి అద్దం పట్టిందనీ ఆ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.